సాధారణ 'జలుబు' అనుకుంటే.. 20ఏళ్ల జీవితాన్నే మర్చిపోయింది!
యూకేలోని ఓ మహిళ.. కొన్ని నెలల క్రితం జలుబుతో బాధపడింది. ఓరోజు రాత్రి జలుబుతోనే నిద్రపోయింది. కానీ ఆమె తిరిగి లేచేందుకు 16రోజులు పట్టింది. అప్పటి వరకు కోమాలో ఉన్న ఆ మహిళ.. తిరిగి లేచిన తర్వాత తన 20ఏళ్ల జీవితాన్ని మర్చిపోయింది. అప్పుడే.. అది సాధారణ జలుబు కాదని ఆమెకు తెలిసింది.
క్లైర్ మఫ్పెట్ రీస్ అనే మహిళ.. తన భర్త స్కాట్, ఇద్దరు కుమారులతో కలిసి యూకేలోని ఎస్సెక్స్‌లో నివాసముంటోంది. కొన్ని నెలల క్రితం.. జలుబుతో బాధపడింది. చిన్న విషయమే, తగ్గిపోతుందని అనుకుంది. జలుబుతోనే ఓ రోజు రాత్రి నిద్రపోయింది. కానీ ఆ తర్వాత 16రోజుల వరకు ఆమె నిద్ర లేవలేదు. కోమాలోకి జారుకుంది. ఆసుపత్రికి తరలించగా.. ఆమెకు ఎన్సిఫలైటిస్ అనే వ్యాధి సోకినట్టు తెలిసింది. 16రోజుల తర్వాత కోమా నుంచి బయటకొచ్చిన ఆమె.. తన 20ఏళ్ల జీవితాన్ని మర్చిపోయింది!
ఫిబ్రవరి 22న 'వరల్డ్ ఎన్సిఫలైటిస్ డే' సందర్భంగా.. తమ కథను ఓ టీవీ షో ద్వారా ప్రపంచంతో పంచుకుంది రీస్ కుటుంబం.
"ఆ ఘటన జరిగిన రెండు వారాల ముందు.. రీస్‌కు జలుబు సోకింది. ఆ తర్వాత అది తీవ్రమైంది. ఓరోజు రాత్రి బెడ్ మీద నిద్రపోయింది. ఆ తర్వాతి రోజు తనను లేపేందుకు నేను చాలా ప్రయత్నించాను. కానీ రీస్ లేవలేదు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాను. వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. తర్వాత రాయల్ లండన్ హాస్పిటల్‌కు తరలించారు. మెదడులో బ్లీడింగ్ వల్ల ఆమె కోమాలోకి వెళ్లినట్టు తొలుత భావించారు. కానీ తర్వాత చేసిన పరీక్షల్లో.. రీస్‌కు ఎన్సిఫలైటిస్ సోకినట్టు తేలింది," అని నాటి పరిస్థితిని వివరించాడు రీస్ భర్త స్కాట్.
ఎన్సిఫలైటిస్ అనే వ్యాధి వైరల్ ఫీవర్‌తో వచ్చే అవకాశం ఉంది. చాలా సందర్భంల్లో ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఈ వ్యాధి అత్యంత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. దీర్ఘకాల ప్రభావం చూపే ముప్పు కూడా ఉంది.
ఈ వ్యాధితో.. జీవితంలోని ఎన్నో విషయాలను మర్చిపోయినట్టు రీస్ చెప్పింది.
"నాకు పిల్లలు ఉన్నట్టు తెలుసు. వారిని నేను గుర్తుపట్టాను. కానీ వారి పుట్టిన రోజులు, నేను వారికి జన్మనివ్వడం వంటి విషయాలను మర్చిపోయాను. అందరిని గుర్తుపట్టగలను కానీ వారి జ్ఞపకాలు మాత్రం నాకు గుర్తుకు రావడం లేదు. స్కాట్‌ని మర్చిపోయి ఉంటే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది," అని రీస్ చెప్పుకొచ్చింది.
మర్చిపోయిన 20ఏళ్ల జ్ఞాపకాలు తిరిగి వచ్చే అవకాశం ఉందని రీస్ చెప్పింది. అలా జరగకపోయినా, కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తానని స్పష్టం చేసింది.
సంబంధిత కథనం