US elections 2024 : అధ్యక్ష ఎన్నికల బ్యాలెట్​లో భారతీయ భాషకు చోటు- హిందీ కాదు..!-this is the only indian language on new yorks 2024 presidential ballot ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Us Elections 2024 : అధ్యక్ష ఎన్నికల బ్యాలెట్​లో భారతీయ భాషకు చోటు- హిందీ కాదు..!

US elections 2024 : అధ్యక్ష ఎన్నికల బ్యాలెట్​లో భారతీయ భాషకు చోటు- హిందీ కాదు..!

Sharath Chitturi HT Telugu
Nov 05, 2024 06:41 AM IST

US elections 2024 : న్యూయార్క్​లో నివాసముంటున్న భారతీయ సమాజానికి అరుదైన గుర్తింపు! అమెరికా అధ్యక్ష ఎన్నికల బ్యాలెట్​లో ఒక భారతీయ భాషకు చోటు దక్కింది! ఆ బాష హిందీ కాదు. మరి ఆ లాంగ్వేజ్​ ఏదంటే..

అమెరికా అధ్యక్ష ఎన్నికల బ్యాలెట్​..
అమెరికా అధ్యక్ష ఎన్నికల బ్యాలెట్​.. (AP)

అమెరికాలో మరికొన్ని గంటల్లో 2024 అధ్యక్ష ఎన్నికలు ప్రారంభంకానున్నాయి. కాగా 200కు పైగా భాషలు మాట్లాడే న్యూయార్క్​లో ఒక భారతీయ భాష అధ్యక్ష ఎన్నికల బ్యాలెట్​లో చోటు సంపాదించుకుంది. ఇది హిందీ కాదు! 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల బ్యాలెట్లలో ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా మాట్లాడే ఇతర భాషలతో పాటు చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ భాషగా బెంగాలీ నిలిచింది.

న్యూయార్క్​లో నివాసముంటున్న బెంగాలీ వర్గాలకు సేవ చేయడానికి ఇది చక్కటి అవకాశం అని నగర ఎన్నికల బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖేల్ జె.ర్యాన్ తెలిపారు.

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, మాజీ అధ్యక్షుడు ట్రంప్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది! అటు, శక్తివంతమైన, బహుళ సాంస్కృతిక జనాభాకు ప్రసిద్ధి చెందిన న్యూయార్క్ తన బ్యాలెట్ పత్రాలలో ఆంగ్లంతో పాటు నాలుగు అదనపు భాషలను చేర్చింది. వాటిలో చైనీస్, స్పానిష్, కొరియన్ భాషల సరసన బెంగాలీ నిలిచింది.

టైమ్స్ స్క్వేర్ సేల్స్ ఏజెంట్, బెంగాలీ అయిన సుభాష్ ఈ విషయంపై హర్షం వ్యక్తం చేశారు. క్వీన్స్​లో నివసిస్తున్న తన తండ్రి ఈ భాషాపరమైన మద్దతు నుంచి ప్రయోజనం పొందుతారని అతను పేర్కొన్నాడు. "నాలాంటి వారికి ఇంగ్లీష్ తెలుసు. కానీ మా కమ్యూనిటీలో చాలా మంది వారి మాతృభాషతో మరింత సౌకర్యవంతంగా ఉంటారు. ఇది కచ్చితంగా పోలింగ్ కేంద్రంలో ఉపయోగపడుతుంది. బెంగాలీ బ్యాలెట్ చూసి మా నాన్న సంతృప్తిగా ఉంటారనే నమ్మకం ఉంది,'' అని సుభాష్ అన్నారు.

బ్యాలెట్​పై బెంగాలీ- చట్టపరమైన బాధ్యత కూడా..

పీటీఐ నివేదికల ప్రకారం.. బెంగాలీ భాషను చేర్చడం సింబాలిక్ ప్రాముఖ్యతను కలిగి ఉన్నప్పటికీ, ఇది చట్టపరమైన అవసరం కూడా! బెంగాలీ మాట్లాడే పౌరులకు "అవసరమైన సమాచారం- ఓటింగ్ ఆప్షన్స్​ని పూర్తి ప్రాప్యత ఉంది," అని నిర్ధారించడానికి కొన్ని పోలింగ్ సైట్లు బెంగాలీ ఓటింగ్ సామగ్రిని అందించాలని నగర నిబంధనలు నిర్దేశిస్తాయి.

"జనసాంద్రత ఎక్కువగా ఉన్న చోట ఆసియా భారతీయ భాష అందుబాటులో ఉండాలి" అని న్యూయార్క్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వివరించారు. పలు చర్చల అనంతరం బెంగాలీని ఎంచుకున్నట్లు తెలిపారు.

అధికంగా మాట్లాడే భారతీయ భాష హిందీనే అయినప్పటికీ, భారతదేశం- బంగ్లాదేశ్ నుంచి వెళ్లి న్యూయార్క్​లో నివాసముంటున్న బెంగాలీల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. 1965 ఓటింగ్ హక్కుల చట్టం ప్రకారం దక్షిణాసియా మైనారిటీ సమూహాలకు భాషా సహాయం తప్పనిసరి అని ఫెడరల్ ఆదేశాల తరువాత 2013లో క్వీన్స్​లో బెంగాలీని చేర్చడం జరిగింది.

“ఇది భారతీయ సమాజం బయటకు వెళ్లి ఓటు వేయడానికి సహాయపడుతుంది. ఈ విధంగా మా గళం వినిపిస్తాము,” అని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ అధ్యక్షుడు డాక్టర్ అవినాష్ గుప్తా చెప్పారు. ఇక్కడ భారతీయులు గణనీయమైన సంఖ్యలో ఉన్నారని, ఇంతమంది ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం హర్షణీయమన్నారు.

2024 నవంబర్ 5న జో అమెరికా తన 47వ ప్రెసిడెంట్​ని ఎన్నుకోనుంది.

Whats_app_banner

సంబంధిత కథనం