Arya Rajendran : బిడ్డతో ఆఫీసుకు మేయర్.. ఆన్లైన్లో విపరీతంగా ట్రోల్స్!
Arya Rajendran : తిరువనంతపురం మేయర్ ఆర్య రాజేంద్రన్.. తన పసి బిడ్డతో ఆఫీసుకు వెళ్లి పనిచేసుకున్నారు. ఈ ఫొటో వైరల్‌గా మారింది. కొందరు ట్రోల్ చేస్తున్నారు.
Arya Rajendran : అతి పిన్న వయస్సులో మేయర్ బాధ్యతలు చేపట్టి, దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన కేరళవాసి ఆర్య రాజేంద్రన్‌పై ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. పసి బిడ్డతో ఆమె ఆఫీసులో పని చేసుకుంటున్న ఫొటో ఇందుకు కారణం!
ట్రెండింగ్ వార్తలు
ఇదీ జరిగింది..
ఆర్య రాజేంద్రన్ వయస్సు 24. కాగా.. 2020లో 21ఏళ్ల వయస్సులో ఆమె కేరళలోని తిరువనంతపురం మేయర్‌గా ఎన్నికయ్యారు. ఇది ఒక రికార్డు. ఆ తర్వాత సీపీఐ (ఎం) పార్టీ ఎమ్మెల్యే సచిన్ దేవ్‌తో ఆమె వివాహం జరిగింది. ఆయనకు కూడా తక్కువ వయస్సులోనే ఎమ్మెల్యే అయ్యారు. కాగా.. ఈ దంపతులకు ఈ ఏడాది ఆగస్ట్ 10 ఆడబిడ్డ జన్మించింది.
ఈ నేపథ్యంలో.. కొన్ని రోజుల క్రితం, బిడ్డతో కలిసి ఆఫీసుకు వెళ్లారు తిరువనంతపురం మేయర్. బిడ్డను ఒడిలో పెట్టుకుని ఫైల్స్ చూసి, ఆమె పని ఆమె చేసుకున్నారు. ఈ సమయంలోనే ఎవరో ఆ ఫొటో తీశారు. ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Arya Rajendran baby : "కేవలం ఫొటో కోసమే ఇలా చేశారా?" అని కొందరు ప్రశ్నిస్తుండగా.. "పెద్ద పొజీషన్లో ఉన్న వారు ఏదైనా చేయొచ్చు, కానీ కింది స్థాయిలో ఉన్న వారికే అన్ని కష్టాలు," అని మరో నెటిజన్ రాసుకొచ్చారు.
నెగిటివ్ ట్రోలింగ్ మధ్య.. కొందరు ఆర్య రాజేంద్రన్‌ను ప్రశంసిస్తున్నారు కూడా! "మాతృత్వం పొందినంత మాత్రాన.. ఉద్యోగం వదిలేయాల్సిన అవసరం లేదని చెప్పేందుకు ఇది చక్కటి ఉదాహరణ," అని ఓ వ్యక్తి రాసుకొచ్చారు. 'మీ పనికి మా సెల్యూట్,' అని ఇంకొ వ్యక్తి పేర్కొన్నారు.
Arya Rajendran latest news : వీటన్నింటి మధ్య.. కొందరు చైల్డ్ కేర్ ఫెసిలిటీ అంశాన్ని లేవనెత్తుతున్నారు. పని ప్రదేశాల్లో చైల్డ్ కేర్ ఫెసిలిటీలు కచ్చితంగా ఉండాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో.. పని ప్రదేశాల్లో పిల్లలను తీసుకురావొద్దన్న ప్రభుత్వ నిబంధనలపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది.
సంబంధిత కథనం