Rahul Gandhi teaches martial arts: విద్వేషాలను వీడి దేశప్రజలందరు ఏకం కావాలన్న సందేశంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా సాగుతోంది. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన ఈ దేశవ్యాప్త పాదయాత్ర వచ్చే సంవత్సరం కశ్మీర్లో ముగియనుంది.
రాహుల్ గాంధీ మహారాష్ట్రలో యాత్ర చేస్తున్న సమయంలో తనతో పాటు ఈ పాద యాత్రలో పాల్గొంటున్న వారితో చేసిన సరదా సంభాషణ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. రాహుల్ గాంధీ యూ ట్యూబ్ చానెల్ లో శనివారం ఆ వీడియోను అప్ లోడ్ చేయగా, క్షణాల్లోనే అది వైరల్ గా మారింది.
ఆ వీడియోలో రాహుల్ గాంధీ తన సహ యాత్రికులకు మార్షల్ ఆర్ట్స్ లోని కొన్ని మెళకువలను నేర్పిస్తుండడం కనిపిస్తుంది. అంతేకాదు, అదే సమయంలో బీజేపీ, ఆరెస్సెస్ లపై రాహుల్ వ్యంగ్యాస్త్రాలు విసరడం కూడా కనిపిస్తుంది. రాహుల్ గాంధీ జపనీస్ మార్షల్ ఆర్ట్ అయికిడో లో బ్లాక్ బెల్ట్ సాధించిన విషయం చాలా మందికి తెలియదు. రాహుల్ ఫిట్ నెస్ ను ఈ భారత్ జోడో యాత్ర సమయంలోనే చాలామంది గుర్తిస్తున్నారు.
తాజాగా, మహారాష్ట్రలో ఒకరోజు యాత్ర ముగిసిన తరువాత, సహయాత్రికులతో కూర్చుని చిట్ చాట్ ప్రారంభించారు. వారికి కొన్ని మార్షల్ ఆర్ట్స్ మెళకువలు నేర్పించారు. శత్రువు తన పూర్తి శక్తి సామర్ధ్యాలతో మనపైకి వచ్చినప్పుడు ఏం చేయాలో వారికి వివరించారు. ఆ శక్తిని మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో వారికి బోధించారు. ఆ మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్ ను చేసి చూపించారు. అదే సమయంలో, బీజేపీ, ఆరెస్సెస్ లపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. బీజేపీ, ఆరెస్సెస్ లు ఇలా పూర్తి శక్తినంతా ఉపయోగించి తనపైకి విమర్శలు, ఆరోపణలతో వచ్చినప్పుడు, వారి నుంచి వారి శక్తినంతా ఇలాగే తీసేసుకుంటానని సరదాగా వ్యాఖ్యానించాడు.