school girls sexually abused: స్కూల్ లో ఇద్దరు నాలుగేళ్ల చిన్నారులపై లైంగిక వేధింపులు; సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం
ఇద్దరు చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన మహారాష్ట్రలోని బద్లాపూర్ లో జరిగింది. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు స్థానికులు తీవ్ర స్థాయిలో నిరసన తెలిపారు. బద్లాపూర్ రైల్వే స్టేషన్ నుంచి రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. చిన్నారులపై లైంగిక వేధింపుల కేసు విచారణకు సిట్ ఏర్పాటు చేశారు.
మహారాష్ట్రలోని థానే జిల్లాలోని ఓ పాఠశాలలో నాలుగేళ్ల వయస్సున్న ఇద్దరు బాలికలపై జరిగిన లైంగిక దాడి ఘటనకు నిరసనగా మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో వందలాది మంది తల్లిదండ్రులు, స్థానికులు బద్లాపూర్ రైల్వేస్టేషన్ వద్ద పట్టాలపైకి వచ్చి రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు మంగళవారం ఉదయం నుంచి స్థానిక రైల్వేస్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు.
స్కూల్ అటెండర్ నిర్వాకం
థానే జిల్లాలోని బద్లాపూర్ పాఠశాలలో కిండర్ గార్టెన్ లో చదువుతన్న మూడు, నాలుగేళ్ల వయస్సున్న ఇద్దరు చిన్నారులపై అదే స్కూల్ లో అటెండర్ గా పని చేస్తున్న వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.నిందితుడు పాఠశాల టాయిలెట్ లో ఆచిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అటెండర్ తమను అనుచితంగా తాకాడని బాలికలు తమ తల్లిదండ్రులకు చెప్పడంతో, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ అటెండర్ పై లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేశారు.
పాఠశాలపై చర్య తీసుకోవాలి..
ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. స్థానికులు పాఠశాలపై దాడికి దిగారు. చివరకు, పాఠశాల ప్రిన్సిపాల్, ఇద్దరు సిబ్బందిని యాజమాన్యం సస్పెండ్ చేసింది. బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన స్కూల్ అటెండర్ ను థానే పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం ఉదయం కూడా స్థానికులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి అప్ అండ్ డౌన్ రూట్లలో రైళ్ల రాకపోకలపై ఈ నిరసన ప్రభావం పడింది.
సిట్ ఏర్పాటు చేసిన సీఎం ఏక్ నాథ్
బద్లాపూర్ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే తెలిపారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే సిట్ ను ఏర్పాటు చేశామని, ఘటన జరిగిన పాఠశాలపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కేసును వేగవంతం చేసే పనిలో ఉన్నామని, దోషులను వదిలిపెట్టబోమని ఏక్ నాథ్ షిండే స్పష్టం చేశారు. ఇద్దరు బాలికలపై లైంగిక వేధింపుల కేసులో త్వరితగతిన విచారణ జరిపి సత్వర న్యాయం చేయాలని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశారు.