నెల రోజులు పడాల్సిన వర్షాలు.. గంటల్లో! టెక్సాస్​లో అల్లకల్లోలం- 13మంది..-texas crippled by unprecedented rain 13 dead over 23 girls missing ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  నెల రోజులు పడాల్సిన వర్షాలు.. గంటల్లో! టెక్సాస్​లో అల్లకల్లోలం- 13మంది..

నెల రోజులు పడాల్సిన వర్షాలు.. గంటల్లో! టెక్సాస్​లో అల్లకల్లోలం- 13మంది..

Sharath Chitturi HT Telugu

అమెరికా టెక్సాస్​ని భారీ వరదలు ముంచ్చెత్తాయి. నెల రోజులు కురువాల్సిన వర్షాలు.. కొన్ని గంటల్లోనే పడటం ఇందుకు కారణం. వర్షాలు, వరదల కారణంగా 13మంది చనిపోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

టెక్సాస్​లో భారీ వరదలు.. (AP)

ఒక్క నెలలో కురవాల్సిన వర్షాలు.. కేవలం కొన్ని గంటల్లో పడితే? అమెరికా టెక్సాస్​లో ఇదే జరిగింది. ఫలితంగా ఆ రాష్ట్రం అంతా అల్లకల్లోలంగా మారింది. భారీ వర్షాలతో పాటు వరదలు ముంచ్చెత్తడంతో టెక్సాల్​లో కనీసం 13మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గల్లంతయ్యారు. వీరిలో 23మంది బాలికలు కూడా ఉన్నారు.

టెక్సాస్​లో భారీ వర్షాలు- వరదలు..

అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక ప్రకారం, కెర్ కౌంటీలో రాత్రిపూట కనీసం 10 ఇంచ్​ (25 సెంటీమీటర్లు) వర్షం కురవడంతో గౌడలూప్​ నదిలో వరద పోటెత్తింది. ఈ వరద మధ్య సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదని అధికారులు చెబుతుండటంతో ఆకస్మిక వరదల కారణంగా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది! కెర్ కౌంటీ షెరీఫ్ లారీ లీథా వరదల్లో 13 మంది మరణించినట్లు ధృవీకరించారు. మృతదేహాలను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారు.

లెఫ్టినెంట్ గవర్నర్ డాన్ ప్యాట్రిక్ మాట్లాడుతూ.. కనీసం 400 మంది సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నారని తెలిపారు. తొమ్మిది రెస్క్యూ బృందాలు, 14 హెలికాప్టర్లు, 12 డ్రోన్‌లను గాలింపు చర్యల కోసం ఉపయోగిస్తున్నామని, కొంతమందిని చెట్ల పైనుంచి రక్షించినట్లు ప్యాట్రిక్ చెప్పారు.

తమ ప్రియమైన వారి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్న ప్రజల నుంచి సోషల్ మీడియాలో విజ్ఞప్తులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి.

23 మంది బాలికలు ఆకస్మిక వరదల్లో గల్లంతు..!

లెఫ్టినెంట్ గవర్నర్ డాన్ ప్యాట్రిక్ ప్రకారం, టెక్సాస్ హిల్ కంట్రీలోని క్యాంప్ మిస్టిక్ అనే వేసవి శిబిరానికి హాజరైన సుమారు 750 మంది బాలికల్లో 23 మంది గల్లంతయ్యారు. గల్లంతైన బాలికలు సహా ఆచూకీ తెలియని వారిని కనుగొనడానికి గాలింపు బృందాలను మోహరించినట్లు ఆయన తెలిపారు.

నేషనల్ వెదర్ సర్వీస్ ఆస్టిన్/శాన్ ఆంటోనియో కార్యాలయానికి చెందిన వాతావరణ శాస్త్రజ్ఞుడు బాబ్ ఫోగార్టీ ప్రకారం, హంట్‌లో ఒక నది గేజ్ కేవలం రెండు గంటల్లో 22 అడుగుల (6.7 మీటర్లు) మేర నీటిమట్టం పెరిగినట్లు నమోదు చేసింది. హంట్ వద్దే గౌడలూప్​ నది చీలిపోతుంది.

"నీరు చాలా వేగంగా కదులుతోంది. అది మీపైకి వచ్చే వరకు ఎంత దారుణంగా ఉంటుందో మీరు గుర్తించలేరు" అని ఫోగార్టీ చెప్పారు.

నది పర్యాటకం హిల్ కంట్రీ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగం. ప్రసిద్ధ, శతాబ్దాల నాటి వేసవి శిబిరాలు దేశం నలుమూలల నుంచి పిల్లలను ఆకర్షిస్తాయి. హంట్, ఇంగ్రామ్ మధ్య, అద్దెకు అనేక నదీ తీర గృహాలు, క్యాబిన్‌లు ఉన్నాయి.

టెక్సాస్‌లో వరదలు సంభవిస్తున్న సమయంలో, మరోవైపు సెంట్రల్ న్యూజెర్సీలో తీవ్రమైన వాతావరణం నెలకొంది. అక్కడ ఉరుములతో కూడిన వర్షాల కారణంగా కనీసం ముగ్గురు మరణించారు.

ప్లెయిన్‌ఫీల్డ్‌లోని ఇద్దరు వ్యక్తులు వారి వాహనంపై చెట్టు కూలడంతో మరణించినట్లు నగరానికి సంబంధించిన ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా తెలిసింది.

నగరం తన ఫోర్త్​ ఆఫ్​ జులై పరేడ్, కచేరీ, బాణాసంచా ప్రదర్శనను రద్దు చేసింది.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.