TS assembly elections : ఎంఐఎం వ్యూహాలు ఎవరికి లాభం?
Telangana assembly elections 2023 : బీ’ టీమ్ అన్న విమర్శలతో మజ్లీస్ పార్టీ కొత్త రకమైన సమస్యలను వచ్చి పడ్డాయి. నగరానికే పరిమితమై ఇతర చోట్ల పోటీ చేయకపోతే బీఆర్‌ఎస్‌తో దోస్తీ కోసం పార్టీ విస్తరణను పణంగా పెడుతున్నారన్నవి విమర్శలు. ఇక ఐంఐఎంకు రానున్న ఎన్నికలు చాలా కీలకంగా మారాయని నిపుణులు అంటున్నారు.
Telangana assembly elections 2023 : తెలంగాణ అసెంబ్లీ సమరానికి వంద రోజుల సమయమే ఉండడంతో అన్ని రాజకీయ పార్టీలలో టికెట్ల హడావుడి ప్రారంభమైంది. అధికార బీఆర్‌ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దరఖాస్తుల వడబోతలో ఉన్నాయి. తెలంగాణలో నిర్ణయాత్మకమైన పాత్ర పోషించే మజ్లీస్ ఇత్తేహాద్ ముస్లీమీన్ పార్టీ కార్యాలయం దారుసలాంలో మాత్రం నిశబ్ధం రాజ్యమేలులోంది. ఈ పార్టీ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఉండడంతో ప్రధాన పార్టీలన్నీ ఏదో ఒక సందర్భంలో ఎంఐఎం పేరును తలవాల్సిందే. ఈ పార్టీ తమ అభ్యర్థుల ఎంపికయే కాదు, ఇతర పార్టీల అభ్యర్థుల ఎంపికలో కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తుండడం దాని ప్రాధాన్యతను తెలియజేస్తుంది. పార్టీ విస్తరణ పేరుతో దేశంలోని పలు రాష్ట్రాల ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న ఎంఐఎం తెలంగాణలో మాత్రం హైదరాబాద్‌కే పరిమితం కావడంపై అనేక ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి.
ట్రెండింగ్ వార్తలు
దేశవ్యాప్త విస్తరణే లక్ష్యంగా..
మజ్లీస్‌గా పిల్చుకునే ఎంఐఎం పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించాలనే లక్ష్యంతో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, బీహార్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, కర్ణాటక రాష్ట్రాలలో ఆ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసింది. మహారాష్ట్రలో 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చెరో రెండు స్థానాలు, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఔరంగాబాద్ స్థానాన్ని పొందింది. 2020 బీహార్ ఎన్నికల్లో ఐదు స్థానాలు గెలిచినా వారందరూ ఆర్జేడీలో చేరడంతో అసెంబ్లీలో ప్రాతినిథ్యం లేకుండా పోయింది. ఈ రెండు మినహా మిగతా రాష్ట్రాలలో రిక్తహస్తమే ఎదురయ్యింది. 2014 నుండి తెలంగాణేతర ప్రాంతాలలో ఇప్పటివరకూ 500 స్థానాలకుపైగా పోటీ చేసిన ఎంఐఎం కేవలం 10 స్థానాలను మాత్రమే సాధించింది. దేశంలోని ముస్లిం మైనార్టీల పట్టున్న ప్రాంతాల్లో పోటీ చేస్తున్న ఎంఐఎం రాజకీయ వ్యూహాలపై విమర్శలు వస్తున్నాయి. ముస్లిం ఓట్లలో చీలిక తెచ్చి పరోక్షంగా బీజేపీకి లాభపడేలా ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ వ్యవహరిస్తున్నారనే ఆరోపణలకు అనేక ఉదాహరణలున్నాయి. బీజేపీకి గట్టి పోటీ ఉన్న రాష్ట్రాల్లోనే మజ్లీస్ బరిలోకి దిగుతూ ఆ పార్టీకి తోడ్పడుతోంది. పలు రాష్ట్రాల్లో పోటీ చేస్తున్న మజ్లీస్ పక్కనున్న ఏపీలో ముస్లిం ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాలపై మాత్రం దృష్టి పెట్టడంలేదు. ఇందుకు ప్రధాన కారణం అక్కడి బీజేపీకి పట్టులేకపోవడమే అని ఇతర పార్టీలు ఎంఐఎం తీరును తప్పుపడుతున్నాయి. బీజేపీకి ‘బీ’ టీమ్‌గా మారిందనే విమర్శలను ఎంఐంఎం ఎదుర్కొంటుంది.
తెలంగాణలో ముస్లింలు 12% ఓట్లతో నిర్ణయాత్మకంగా ఉన్నా మజ్లీస్ హైదరాబాద్‌కే పరిమితం అయ్యింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లోని ముథోల్, బోథ్, నిర్మల్, సిర్పూర్, నిజామాబాద్ అర్బన్, బోధన్, కామారెడ్డి, మెట్‌పల్లి, జగిత్యాల, కరీంనగర్, కోరుట్ల, సంగారెడ్డి, జహీరాబాద్, మహబూబ్‌నగర్, షాద్‌నగర్, వికారాబాద్, రాజేంద్రనగర్, నల్గొండ తదితర నియోజకవర్గాలలో పట్టున్నా కన్నెత్తి చూడడం లేదు. రాష్ట్రంలో సుమారు 50 నియోజకవర్గాల్లో మజ్లీస్‌కు 20 వేలకుపైగా ఓట్లతో గెలుపోటములను శాసించే పట్టు ఉంది. అంటే ఆ పార్టీ రూపొందించుకున్న ‘దేశవ్యాప్తంగా పార్టీ విస్తరణ’ సూత్రాన్ని అమలు చేయడానికి తెలంగాణలో సానుకూల వాతావరణం, వనరులు పుష్కలంగా ఉన్నాయి. అయినా ఆ పార్టీ జంటనగరాల్లో అదీ కూడా పాతబస్తీ సరిహద్దులను దాటడం లేదు. దీనికి ప్రధాన కారణం ఆ పార్టీ మొదటి నుండి తమ స్వప్రయోజనాల కోసం అధికారంలో ఉన్న పార్టీలతో అంటకాగడమే.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతంలోనే కాకుండా ఏపీలోని ఉమ్మడి కర్నూలు, కడప, నెల్లూరు, గుంటూరు తదితర ప్రాంతాల్లో కూడా ముస్లిం ఓట్ల ప్రభావంతో మజ్లీస్ పార్టీ విస్తరణకు అవకాశాలున్నా ఆ పార్టీ హైదరాబాద్ దాటలేదు. రాష్ట్రం విడిపోకముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌తో, అనంతరం తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌తో దోస్తీతో ఇతర ప్రాంతాల్లో పోటీపై ఆసక్తి కనబర్చలేదు. 2014లో రాష్ట్రం విడిపోయాక మాత్రం మజ్లీస్ తెలంగాణలో 21 చోట్ల పోటీ చేసి ఏడు స్థానాలు సాధించింది. ఏపీలో 13 చోట్ల పోటీ చేసి అన్ని చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. ఎంఐఎం చరిత్రలో రాష్ట్రంలో ఇన్ని స్థానాల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. 2018లో తెలంగాణలో 8 చోట్ల పోటీ చేసి తమ 7 స్థానాలను నిలబెట్టుకుంది. గత మూడు దశాబ్దాలుగా హైదరాబాద్ ఎంపీ స్థానాన్ని నిరాటంకంగా నిలబెట్టుకుంటుంది. అధికారంలో ఉన్న పార్టీతో చెట్టాపట్టాలేసుకుంటూ సర్కారు నుండి పొందే ప్రయోజనాలను పొందడంలో మజ్లీస్ పార్టీది అందవేసిన చెయ్యి. సున్నితమైన పాతబస్తీలో గట్టిపట్టున్న ఆ పార్టీతో ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా ఉండేలా అధికార పక్షాలు కూడా ఆ పార్టీ వ్యవహారాలను చూసీచూడనట్టు ఉండేవి. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం ఓట్లను పొందాలంటే మజ్లీస్‌తో సఖ్యత అవసరమనే అభిప్రాయంతో కూడా గతంలో కాంగ్రెస్, ఇప్పుడు బీఆర్‌ఎస్ పార్టీలు అసదుద్దీన్ ఓవైసీ ఎక్కడా నొచ్చుకోకుండా వ్యవహరిస్తుంటారు.
MIM TS assembly elections : ఇతర పార్టీలను దారిలోకి తెచ్చుకోవడం కూడా మజ్లీస్‌కు వెన్నతో పెట్టిన విద్యే. ఇందుకు ఉదాహరణగా గత జూన్‌లో బోధన్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేకు, ఐంఎఐం కార్పొరేటర్‌కు మధ్య జరిగిన ఘర్షణ ఘటనను సాకుగా తీసుకొని అసదుద్దీన్ రాబోయే ఎన్నికల్లో మజ్లీస్ 50 స్థానాలకు పైగా పోటీ చేస్తుందని వ్యూహాత్మకంగా ప్రకటించారు. రెండు నెలలు తిరిగేసరికి అసెంబ్లీ సమావేశాల్లో మజ్లీస్ బరాబర్ మా మిత్రపక్షమే అని సీఎం కేసీఆర్ ఢంకా భజాయిస్తే, ఎంఎంఐం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ దేశంలో కేసీఆర్ వంటి నేతలే లేరని పొగిడారు. కేసీఆర్‌కు ప్రధాన మంత్రి అయ్యే అర్హతలన్నీ ఉన్నాయని అసదుద్దీన్ మరో ప్రకటన చేశారు. అధిక స్థానాల్లో పోటీ చేస్తామని గంభీర ప్రకటన మజ్లీస్‌కు అనతికాలంలోనే బీఆర్‌ఎస్‌తో అంత గాఢమైన దోస్తీ ఎందుకు కలిగిందో రహస్యమే. కేసీఆర్ నాలుగు స్థానాలు మినహా మిగతా 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. ప్రకటించని నాలుగు స్థానాల్లోని గోషామహల్, నాంపల్లి నియోజకవర్గాల్లో మజ్లీస్ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారనే ప్రచారం ఉంది. అంతేకాక ముస్లిం ప్రభావిత సెగ్మంట్లలో టికెట్ల కోసం బీఆర్‌ఎస్ అభ్యర్థులు అసదుద్దీన్ సిఫార్సు కోసం ప్రయత్నిస్తున్నారంటే బీఆర్‌ఎస్‌పై మజ్లీస్ ప్రభావం ఏ మేరకుందో అర్థమవుతోంది.
తెలంగాణలో గత ఆరు నెలల్లో రాజకీయ వాతావరణం చాలా వేగంగా మారిపోయింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు స్థానాలు గెలిచిన బీజేపీ, అనంతరం గ్రేటర్ ఎన్నికల్లో, దుబ్బాక, హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయం సాధించడంతో రాష్ట్ర రాజకీయాలు బీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీగా మారిపోయాయి. అయితే మునుగోడు ఉప ఎన్నికల్లో, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయం అనంతరం రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఎదిగింది. ఇదే సమయంలో లోక్‌సభ ఎన్నికలకు అధిక ప్రాధాన్యతిచ్చే బీజేపీ అధిష్టానం కూడా కేసీఆర్‌తో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుందనే ప్రచారం దావనంలా వ్యాపించింది. కేసీఆర్ కూడా బీజేపీ బదులు కాంగ్రెస్‌ను తీవ్రంగా విమర్శిస్తుండడం, ఎమ్మెల్సీ కవితపై లిక్కర్ స్కాం కేసు నిదానంగా సాగుతుండడం వంటి అనేక పరిణామాలు కూడా ఈ వార్తలకు బలం చేకూర్చాయి. ఇంతకాలం దేశవ్యాప్తంగా బీజేపీకి ‘బీ’ టీమ్‌గా మజ్లీస్ విమర్శలు ఎదుర్కొనగా, ఇప్పుడు రాష్ట్రంలో బీఆర్‌ఎస్ బీజేపీకి ‘బీ’టీమ్‌గా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి.
బీ టీమ్ అంటూ విమర్శలతో..
TS elections schedule : ఈ ‘బీ’ టీమ్ విమర్శలతో మజ్లీస్ పార్టీ కొత్త రకమైన సమస్యలను ఎదుర్కొంటుంది. నగరానికే పరిమితమై ఇతర చోట్ల పోటీ చేయకపోతే బీఆర్‌ఎస్‌తో దోస్తీ కోసం పార్టీ విస్తరణను పణంగా పెడుతున్నారనే విమర్శలను ఇటు పార్టీలో, అటు ఇతర పార్టీల నుండి ఎదుర్కోవాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా పార్టీ విస్తరణ పేరుతో బీజేపీకి ఉపయోగపడేలా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం ముస్లింలలో కూడా ఏర్పడితే పార్టీ మూలాలే దెబ్బతినవచ్చు. ఒకవేళ రాష్ట్రంలో పార్టీని విస్తరించడం పేరుతో సుమారు 50 స్థానాల్లో పోటీ చేస్తే మరోరకమైన విమర్శలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. బీఆర్‌ఎస్ బీజేపీకి ‘బీ’ టీమ్‌గా మారిందనే ప్రచారం నేపథ్యంలో ముస్లిం ఓట్లు ఏకమొత్తంగా రాష్ట్రంలో బలపడుతున్న కాంగ్రెస్‌వైపు మళ్లకుండా ఆ సామాజిక వర్గం ఓట్లను చీల్చి బీఆర్‌ఎస్‌కు మేలు చేకూర్చేలా ఐంఎఐం అధిక స్థానాల్లో బరిలోకి దిగుతుందనే ప్రచారం కూడా ఉంది.
తెలంగాణలో బీఆర్‌ఎస్, ఎంఐఎం దోస్తానా ఎంతకాలమనేది వేచిచూడాల్సిందే. కేసీఆర్ వైఖరి నిలకడగా ఉండకపోవడం ఎంఐఎంకు ఇబ్బందులు తేవచ్చు. 2009లో సార్వత్రిక ఎన్నికలు ముగియకముందే కేసీఆర్ బీజేపీ నేతలను కలవడం, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, కోవిడ్ సమయంలో కేసీఆర్ బేషరతుగా మోదీ ప్రభుత్వ నిర్ణయాలకు మద్దతివ్వడమే కాకుండా, వాటిని తప్పుపట్టినవారిని కూడా విమర్శిండం వంటి గత అనుభవాలతో కేసీఆర్ ఎప్పుడు ఏ గట్టున ఉంటారో చెప్పలేము. అయితే సిద్దాంతరీత్యా ఎంఐఎంకు మాత్రం బీజేపీ ఎల్లకాలం ప్రధాన రాజకీయ శత్రువే. ఎన్నికల తర్వాత కేసీఆర్ ప్లేటు ఫిరాయించి బీజేపీవైపు మళ్లితే ఎంఐఎంకు పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారవడం ఖాయం. ముస్లిం సామాజిక వర్గంలో గట్టిపట్టున్న మజ్లీస్ రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ఎదగే అవకాశాలున్నా ఎవరో ఒకరి వంచన చేరుతూ ఇతర పార్టీల ప్రయోజనాల కోసం సొంత పార్టీని పణంగా పెడుతున్నారనే ఇంటా బయట విమర్శలకు రాబోయే ఎన్నికలే సమాధానం చెబుతాయి.
- ఐ.వి.మురళీ కృష్ణ శర్మ, రీసెర్చర్, పీపుల్స్‌పల్స్ రీసెర్చ్ సంస్థ
సంబంధిత కథనం