Income tax raids on BBC: బీబీసీ ఆఫీస్‍ల్లో కొనసాగుతున్న ఐటీ సోదాలు: ముఖ్యమైన 5 విషయాలు ఇవే
Income tax raids on BBC: భారత్‍లోని బీబీసీ కార్యాలయాల్లో ఐటీ శాఖ అధికారులు రెండో రోజు కూడా ట్యాక్స్ సర్వే కొనసాగిస్తున్నారు. సోదాలు చేస్తున్నారు.
Income tax raids on BBC: ఢిల్లీ, ముంబై నగరాల్లోని బ్రిటీష్ బ్రాడ్‍కాస్టింగ్ కార్పొరేషన్ (BBC) మీడియా సంస్థ కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ (IT) సోదాలు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం బీబీసీ కార్యాలయాల్లోకి ప్రవేశించిన ఐటీ అధికారులు.. నేడు (ఫిబ్రవరి 16) కూడా ‘ట్యాక్స్ సర్వే’ కంటిన్యూ చేస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, 2002 గుజరాత్ అల్లర్లపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ పెను దుమారాన్ని రేపిన కొద్ది రోజులకే ఈ పరిణామం జరగడం తీవ్ర చర్చనీయాంశం అయింది. బీబీసీ కార్యాలయాల్లో ఐటీ అధికారులు ఇప్పటి వరకు కొన్ని మొబైళ్లు, ల్యాప్‍టాప్‍లను స్వాధీనం చేసుకున్నారు. అసలు ఎందుకీ సర్వే, ప్రస్తుత పరిస్థితేంటో ముఖ్యమైన విషయాలు ఇక్కడ తెలుసుకోండి.
ఎందుకు ఈ సోదాలు?
Income tax raids on BBC: బీబీసీకి సంబంధించి పన్నుల చెల్లింపు, అంతర్జాతీయ ట్యాక్సేషన్, నిధుల మళ్లింపు వివరాలను సేకరించేందుకు ఐటీ శాఖ అధికారులు ఆ కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా అనుబంధ సంస్థలకు బీబీసీ నిధుల మళ్లింపు గురించి ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సంస్థ లాభాలను బీబీసీ గణనీయంగా వేరే చోటికి మళ్లిస్తోందని ఐటీ శాఖ అనుమానాలను వ్యక్తం చేస్తోంది.
‘ట్యాక్స్ సర్వే’లో ఏం జరుగుతోంది?
Income tax raids on BBC: మంళవారం ఉదయం 11 గంటల సమయంలో ఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లోకి ఐటీ అధికారులు ప్రవేశించారు. ఉద్యోగుల మొబైళ్లు, ల్యాప్‍టాప్‍లను కూడా స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలు చేశారు. ఢిల్లీ ఆఫీస్‍లోని ఉద్యోగుల మొబైళ్లను సీజ్ చేశారు. ఆ తర్వాత వారిని ఇంటికి పంపారు. తర్వాతి షిఫ్ట్ వారిని వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాల్సిందిగా సూచించారు. షెల్ కంపెనీలు, నిధుల మళ్లింపు, విదేశాలకు నిధుల బదిలీల గురించిన కీవర్డులతో కంప్యూటర్లలో ఐటీ అధికారులు సెర్చ్ చేస్తున్నట్టు సమాచారం. ఈ సర్వే ముగిసిన తర్వాత ఉద్యోగుల మొబైళ్లు, ల్యాప్‍టాప్‍లను ఐటీ అధికారులు తిరిగి ఇచ్చేయనున్నారు.
బ్రిటన్ ఏమంటోంది!
IT Survey in BBC offices: ఇండియాలోని బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సర్వే గురించి బ్రిటన్ ఆచితూచి స్పందించింది. ప్రస్తుతం పరిస్థితి నిశితంగా గమనిస్తున్నామని బ్రిటన్ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అమెరికా కూడా ఇలాంటి వైఖరినే వ్యక్తం చేసింది.
పూర్తిగా సహకరిస్తున్నాం: బీబీసీ
IT Survey in BBC offices: తమ కార్యాలయాల్లో ట్యాక్స్ సర్వే కోసం వచ్చిన ఆదాయపు పన్ను శాఖ అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నామని బీబీసీ ప్రకటన విడుదల చేసింది. అతిత్వరలో ఈ విషయం సద్దుమణుగుతుందని ఆశిస్తున్నామని బీబీసీ న్యూస్ ప్రెస్ టీమ్ వెల్లడించింది. తమ జర్నలిజం కార్యాకలాపాలు సాధారణంగా కొనసాగుతాయని, ఇండియాలోని ప్రజల కోసం పని చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని పేర్కొంది.
కేంద్రంపై విమర్శలు
IT Survey in BBC offices: బీబీసీ కార్యాలయాలపై ఐటీ సోదాలను ఎడిటర్స్ గిల్డ్‌తో పాటు ప్రతిపక్షాలు ఖండించాయి. బీబీసీ కార్యాలయాల్లో సోదాలపై తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నామని ఎడిటర్స్ గిల్డ్ పేర్కొంది. మీడియా సంస్థలను ఒత్తిడి గురి చేసేందుకు ఐటీని ఉపయోగించుకోవడం సరికాదని అభిప్రాయపడింది. ఇక బీబీసీ కార్యాలయాలపై సోదాలతో కేంద్ర ఏజెన్సీల ముసుగు పూర్తిగా తొలగిపోయిందని కాంగ్రెస్ విమర్శించింది. కేంద్రం చేతిలో ఐటీ, ఈడీ సహా దర్యాప్తు సంస్థలు కీలుబొమ్ములుగా ఉన్నాయని మరోసారి నిరూపితమైందని ఆ పార్టీ నేతలు కేంద్రంపై విమర్శలు గుప్పించారు. బీబీసీ రూపొందించి డాక్యుమెంటరీకి ప్రతీకారంగానే ఈ చర్య అంటూ ఆరోపిస్తున్నారు.
సంబంధిత కథనం