Bombay HC: ‘‘భార్యను తిట్టడం, నేలపై పడుకోమనడం క్రూరత్వం కాదు’’: బొంబాయి హైకోర్టు
Bombay HC: 20 ఏళ్ల క్రితం నాటి ఒక కేసుకు సంబంధించి బాంబే హైకోర్టు వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. భార్యను తిట్టడం, ఒంటరిగా గుడికి వెళ్లనివ్వకపోవడం, కింద కార్పెట్ పై పడుకోవాలని ఆదేశించడం క్రూరత్వం కిందకు రావని బొంబాయి హైకోర్టు వ్యాఖ్యానించింది.
భార్యను దూషించడం, ఆమెను ఒంటరిగా ఆలయానికి వెళ్లనివ్వకపోవడం, కింద కార్పెట్ పై పడుకోవాలనడం వంటి చర్యలు ఐపీసీ సెక్షన్ 498ఏ ప్రకారం క్రూరత్వంగా పరిగణించలేమని బొంబాయి హైకోర్టు స్పష్టం చేసింది. ఐపీసీ సెక్షన్ 498ఏ, 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం) కింద కింది కోర్టు దోషులుగా తేల్చిన వ్యక్తిని, అతని కుటుంబాన్ని హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.
2002 నాటి కేసు
2002 లో మహారాష్ట్రలో ఒక యువతి ఆత్మహత్య చేసుకుంది. భర్త, అతడి కుటుంబ సభ్యుల క్రూరత్వం, వేధింపుల వల్లనే ఆమె ఆత్మహత్య చేసుకుందని నిర్ధారించిన ట్రయల్ కోర్టు వారిని దోషులుగా తేల్చి, శిక్ష విధించింది. అయితే, ఆ భర్త, అతడి కుటుంబ సభ్యులు హైకోర్టుకు అప్పీల్ చేశారు. ఆ అప్పీల్ పై హైకోర్టు విచారణ జరిపి, పై తీర్పు వెలువరించింది.
ఇవేమీ క్రూరత్వం కావట..
బొంబాయి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం.. భార్య ను తరచూ దూషించడం, వంట రాదని తిట్టడం, ఇరుగుపొరుగు వారితో మాట్లాడనివ్వకపోవడం, ఒంటరిగా ఆలయానికి వెళ్లడానికి అనుమతించకపోవడం, టీవీ చూడటానికి అనుమతించకపోవడం, కింద నేలపై కార్పెట్ మీద పడుకోవాలని ఆదేశించడం వంటి నిందితులపై ఉన్న అభియోగాలు సెక్షన్ 498ఏ ప్రకారం క్రూరత్వం కిందకు రావని బొంబాయి హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు, చెత్త బయట వేయడానికి ఒంటరిగా పంపించకపోవడం, అర్ధరాత్రి సమయంలో నిద్ర లేపి నల్లా నుంచి మంచి నీళ్లు పట్టాలని చెప్పడం వంటివి కూడా క్రూరత్వంగా భావించకూడదని, అవి ఒక ఇంటి గృహ వ్యవహారాలకు సంబంధించినవి బొంబాయి హైకోర్టు అభిప్రాయపడింది.
పొరుగువారితో మాట్లాడవద్దు
ఇలాంటి క్రూరత్వ ఆరోపణలు సంబంధిత సెక్షన్ల కింద తీవ్రమైనవిగా పరిగణించలేమని హైకోర్టు వ్యాఖ్యానించింది. వాటిని చట్టప్రకారం నేరంగా పరిగణించలేమని కోర్టు తెలిపింది. ‘‘కేవలం కార్పెట్ మీద పడుకోవడం కూడా క్రూరత్వం కిందకు రాదు. అదేవిధంగా ఏ విధమైన దూషణలు, ఎవరు చేశారు అనే విషయం స్పష్టంగా తెలియడం లేదు. అదేవిధంగా, ఆమెను పొరుగువారితో కలవకుండా నిరోధించడం కూడా వేధింపులుగా పరిగణించలేము’’ అని జస్టిస్ అభయ్ ఎస్ వాఘ్వాస్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అర్ధరాత్రి నీళ్లు పట్టాలి
ఆ మహిళ అత్తమామలు నివసించే గ్రామానికి అర్ధరాత్రి సమయంలో నీటి సరఫరా జరుగుతుందని, అందువల్ల అర్ధరాత్రి 1:30 గంటలకు అన్ని ఇళ్ల వారు మంచినీళ్లను పట్టుకుని స్టోర్ చేసుకుంటారని ఒక సాక్షి చెప్పిన విషయాన్ని న్యాయమూర్తి ప్రస్తావించారు. అదీకాక, మృతురాలి అత్తమామల వాంగ్మూలం ఆధారంగా ఆత్మహత్య చేసుకోవడానికి రెండు నెలల ముందు మృతురాలు అత్తవారింటికి వెళ్లినందున ఈ ఆరోపణలను ఆత్మహత్యకు తక్షణ కారణంగా పరిగణించలేమని హైకోర్టు పేర్కొంది.
ట్రయల్ కోర్టుపై విమర్శలు
20 ఏళ్ల క్రితం నిందితుడిని దోషిగా నిర్ధారించే సమయంలో ట్రయల్ కోర్టు అనుచిత వ్యాఖ్యలు చేసిందని బాంబే హైకోర్టు న్యాయమూర్తి విమర్శించారు. మృతురాలి పట్ల నిందితుల ప్రవర్తన నిరంతరాయంగా క్రూరంగా (cruelty) ఉందని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవని ఆయన అన్నారు.