Cyclone Michaung : భారీ వర్షాలతో తమిళనాడు అతలాకుతలం..!
Cyclone Michaung : మిచౌంగ్ తుపాను కారణంగా తమిళనాడు తడిసి ముద్దవుతోంది. చెన్నైతో పాటు అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Cyclone Michaung live updates : భారీ వర్షాలకు తమిళనాడు అతలాకుతలమవుతోంది. ఆంధ్రప్రదేశ్ తీరంవైపు మిచౌంగ్ తుపాను దూసుకొస్తున్న తరుణంలో చెన్నై సహా తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో ఆదివారం రాత్రి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. అనేక ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. అనేక లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. చెన్నై, చెంగల్పట్టు, కంచీపుర్, నాగపట్టణం, కుద్దలూరు, థిరువల్లూర్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి.
తమిళనాడు అతలాకుతలం..
ఈ మిచౌంగ్ తుపాను.. మంగళవారం ఉదయం నెల్లూర్- మచిలీపట్నం మధ్యలో తీరం దాటుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 5:30 గంటలవరకు, గడిచిన 24 గంటల్లో తమిళనాడులో మీనంబాక్కమ్లో 196ఎంఎం వర్షపాతం నమోదైంది. నుంగంబాక్కంలో 154.3 ఎంఎం వర్షపాతం నమోదైంది.
Tamil Nadu rains : భారీ వర్షాల నేపథ్యంలో చెన్నైతో పాటు మరో మూడు జిల్లాల్లోని విద్యాసంస్థలకు సోమవారం సెలవును ప్రకటించింది అధికార యంత్రాంగం. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఆప్షన్ని ఇవ్వాలని ప్రైవేటు సంస్థలను సూచించింది. తీర ప్రాంతాల్లోని మత్స్యకారులు వేటకు వెళ్ల వద్దని అధికారులు ఆదేశాలిచ్చారు.
మరోవైపు.. తుపానును ఎదుర్కొనేందుకు తమిళనాడు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 5వేలకుపైగా రిలీఫ్ క్యాంప్‌లను ఏర్పాటు చేసింది. ముప్పు ప్రాంతాల్లోని ప్రజల తరలింపు ప్రక్రియ.. ఇప్పటికే కొనసాగుతోంది. పరిస్థితులను ఎప్పటికప్పుడు దగ్గరుండి సమీక్షిస్తున్నారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్.
Chennai rains today : భారీ వర్షాల కారణంగా చెన్నైలో జనజీవనం స్తంభించింది. మరీ ముఖ్యంగా విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లోని రన్‌వేని నేటి రాత్రి 11 గంటల వరకు మూసివేస్తున్నట్టు ప్రకటించారు అధికారులు. అనేక రైళ్లు కూడా రద్దయ్యాయి. ప్రయాణికులకు రీఫండ్ ఇస్తామని భారతీయ రైల్వే వెల్లడించింది.
భారీ వర్షాలకు చెన్నైలోని కనాథూర్ ప్రాంతంలో ఓ గోడ కూలింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించినట్టు, ఒకరు గాయపడినట్టు సమాచారం.
మిచౌంగ్ తుపాను కారణంగా.. పుదుచ్చేరిలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేంద్ర పాలిత ప్రాంతంలో ప్రస్తుతం 144 సెక్షన్ అమల్లో ఉంది. అవసరమైతే కానీ ప్రజలు బయటకు రావొద్దని అధికారులు సూచించారు.
సంబంధిత కథనం