ఒక స్త్రీకి 10 భర్తలు.. ఉత్తర భారతీయులపై తమిళనాడు మంత్రి తీవ్ర వ్యాఖ్యలు.. తమిళ భాషను అవమానిస్తే నాలుక కోస్తామని వ్యాఖ్య-tamil nadu minister statement on north indian women marriages creates uproar ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ఒక స్త్రీకి 10 భర్తలు.. ఉత్తర భారతీయులపై తమిళనాడు మంత్రి తీవ్ర వ్యాఖ్యలు.. తమిళ భాషను అవమానిస్తే నాలుక కోస్తామని వ్యాఖ్య

ఒక స్త్రీకి 10 భర్తలు.. ఉత్తర భారతీయులపై తమిళనాడు మంత్రి తీవ్ర వ్యాఖ్యలు.. తమిళ భాషను అవమానిస్తే నాలుక కోస్తామని వ్యాఖ్య

HT Telugu Desk HT Telugu
Published Mar 14, 2025 12:26 PM IST

తమిళనాడు సీనియర్ మంత్రి దురైమురుగన్ ఉత్తర భారత సంస్కృతిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తర భారతంలో బహుభర్తృత్వం, బహుపత్నిత్వం సర్వసాధారణమని ఆరోపించారు.

దుమారం రేపుతున్న తమిళనాడు మంత్రి వ్యాఖ్యలు
దుమారం రేపుతున్న తమిళనాడు మంత్రి వ్యాఖ్యలు

ఉత్తర, దక్షిణ భారతాల మధ్య పెరుగుతున్న వివాదానికి తమిళనాడు సీనియర్ మంత్రి దురైమురుగన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అగ్నిపై ఆజ్యం పోసినట్టుగా మారాయి. ఉత్తర భారతంలో బహుభర్తృత్వం (ఒకే స్త్రీకి అనేక భర్తలు), బహుపత్నిత్వం (ఒకే పురుషునికి అనేక భార్యలు) సర్వసాధారణమని ఆయన ఆరోపించారు. తమిళ భాషను అవమానించిన వారి నాలుక కోస్తామని హెచ్చరించారు. దేశంలో జనాభా ఆధారంగా ప్రతిపాదించిన పునర్విభజనపై ఇప్పటికే ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి.

మహాభారతాన్ని ఉఠంకిస్తూ పోలిక

ఒక సభలో మాట్లాడుతూ దురైమురుగన్ మహాభారతాన్ని ఉఠంకించారు. ఉత్తర భారతంలో ఒక స్త్రీ అనేక పురుషులతో వివాహం చేసుకునే సంప్రదాయం ఉందని అన్నారు. "మా సంస్కృతిలో ఒక పురుషుడు ఒక స్త్రీని వివాహం చేసుకుంటాడు, కానీ ఉత్తర భారతంలో ఒక స్త్రీ ఐదు లేదా పది మంది పురుషులను వివాహం చేసుకోవచ్చు. అక్కడ ఐదుగురు పురుషులు ఒక స్త్రీని వివాహం చేసుకోవచ్చు, అది వారి సంస్కృతి" అని ఆయన అన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలతో ఉత్తర, దక్షిణ భారతాల మధ్య సాంస్కృతిక వివాదం మరింత తీవ్రమైంది.

ఉత్తర భారతంలో 17-18 మంది పిల్లలు: దురైమురుగన్

పునర్విభజనపై తమిళనాడు స్టాలిన్ ప్రభుత్వం, కేంద్రం మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ ప్రక్రియ కొత్త జనాభా లెక్కల ఆధారంగా జరిగితే రాష్ట్రంలో పార్లమెంటరీ స్థానాల సంఖ్య తగ్గే అవకాశం ఉందని తమిళనాడు ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై దురైమురుగన్ కేంద్ర ప్రభుత్వ యోచనను ఖండించి “జనాభా నియంత్రణ చేయమని మమ్మల్ని అడిగారు. మేం చేశాం. మా జనాభా తగ్గింది. కానీ ఉత్తర భారతంలో 17-18 మంది పిల్లలను కంటున్నారు. వారికి వేరే పని లేదు” అని అన్నారు.

బీజేపీ అసంతృప్తి

కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పార్లమెంటులో డీఎంకె ఎంపీలపై చేసిన వ్యాఖ్యలకు తమిళనాడు మంత్రి తీవ్రంగా స్పందించారు. "తమ సంస్కృతి మర్యాదకరంగా లేని వారు మా సంస్కృతిని అమర్యాదకరమని అంటున్నారా? వారి నాలుక కోస్తాం. జాగ్రత్తగా ఉండండి" అని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేత అమర్ ప్రసాద్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ నుండి క్షమాపణలు కోరారు. "డీఎంకె మనస్తత్వం ఉత్తర భారతీయులపై వారి ద్వేషాన్ని చూపుతుంది. స్టాలిన్ వెంటనే క్షమాపణ చెప్పాలి" అని ఆయన ట్వీట్ చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.