Afghanistan: విడాకులు తీసుకున్న భర్తల దగ్గరికి బలవంతంగా మహిళలు: తాలిబన్ల మరో దుశ్చర్య!
Afghanistan: గతంలో జారీ అయిన విడాకులను తాలిబన్లు రద్దు చేస్తున్నారని తెలుస్తోంది. తీవ్రమైన వేధింపులకు గురై భర్తలకు విడాకులు ఇచ్చిన మహిళలను మళ్లీ వారి వద్దకే తాలిబన్లు పంపుతున్నారన్న సమచారం బయటికి వచ్చింది.
Afghanistan: అఫ్గానిస్థాన్‍లో తాలిబన్ (Taliban) నియంతృత్వ పాలన సాగుతోంది. ముఖ్యంగా ఆ దేశంలో మహిళలు, బాలికల హక్కులను తాలిబన్లు కాలరాస్తూనే ఉన్నారు. విద్య నుంచి వివాహం వరకు అన్ని విషయాల్లో మహిళలకు ఆంక్షలు విధిస్తున్నారు. స్వేచ్ఛను హరించి వేస్తున్నారు. ఈ విషయంపై ప్రపంచమంతా ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయినా తాలిబన్లు మాత్రం తమ పంథాను మార్చుకోవడం లేదు. ఇక తాలిబన్లు చేస్తున్న మరో చర్య బయటికి వచ్చింది. భర్తలు వేధిస్తున్నారంటూ గతంలో విడాకులు తీసుకున్న మహిళలను.. మళ్లీ వారి వద్దకే పంపుతున్నారట తాలిబన్లు. దీంతో చాలా మంది మహిళలు తీవ్ర వేదనకు లోనవుతున్నారు. వివరాలివే..
“రాక్షసుడు మళ్లీ వచ్చాడనిపించింది”
Afghanistan: సంవత్సరాల పాటు భర్త వేధింపులు భరించి విడాకులు తీసుకున్న మాల్వా (పేరు మార్చాం) అనే మహిళను మళ్లీ అతడి దగ్గరికి తాలిబన్లు పంపించారు. విడాకులను రద్దు చేశారు. తనకు బలవంతంగా విడాకులు ఇప్పించారంటూ తాలిబన్లకు తన భర్త చెప్పాడని, దీంతో వారు విడాకులను రద్దు చేశారని ఆమె వెల్లడించారు. దీంతో తన భర్త మళ్లీ తన వద్దకు వచ్చాడని ఆమె చెప్పారు. “దేవుడా.. రాక్షసుడు మళ్లీ తిరిగివచ్చాడని నాలో నేను ఎంతో వేదన పడ్డా. నేను, నా కూతురు ఆరోజు చాలా ఏడ్చాం” అని 40 ఏళ్ల మాల్వా.. న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్‍పీతో చెప్పారు.
Afghanistan: మళ్లీ కలిసిన తర్వాత మాల్వాను ఆమె భర్త మరింత వేధింపులకు గురి చేశారు. తరచూ కొట్టాడు. దీంతో ఆమె చేతులు తీవ్రంగా గాయపడ్డాయి. వేళ్లు పగిలిపోయాయి. పళ్లు సైతం చాలా దెబ్బ తిన్నాయి. “అతడు నా వెంట్రుకలు పట్టుకొని లాగుతాడు. దీంతో నేను స్వల్పంగా బట్టుతల కూడా వచ్చింది. నన్ను విపరీతంగా కొడుతున్నాడు. దీంతో నా పళ్లన్నీ పగిలిపోయాయి” అని మాల్వా చెప్పారు. అయితే తన భర్త నుంచి తాము మళ్లీ తప్పించుకొని పేర్లు మార్చుకొని తిరుగుతున్నామని ఆమె అన్నారు. మళ్లీ ఎక్కడ కనిపెడతాడో అని భయంభయంగా జీవిస్తున్నామని అన్నారు.
Afghanistan: తాలిబన్ కమాండర్లు అఫ్గానిస్థాన్‍లో చాలా మంది కొందరి విడాకులను రద్దు చేశారని, గతంలో వేధింపులను ఎదుర్కొన్న మహిళలను మళ్లీ వారి భర్తల వద్దకు బలవంతంగా పంపుతున్నారని ఆ దేశానికి చెందిన కొందరు లాయర్లు.. ఏఎఫ్‍పీకి చెప్పారు.
Afghanistan: అఫ్గానిస్థాన్‍లో ఉన్న ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని 2021లో తాలిబన్లు కూల్చివేశారు. ఆ దేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఆ తర్వాతి నుంచి మహిళలు, బాలికలపై రకరకాల ఆంక్షలు విధిస్తున్నారు. మహిళలు యూనివర్సిటీల్లో చదవకూడదని, ఉద్యోగాలకు వెళ్లకూడదని ఇలా చాలా ఆంక్షలు విధించారు. ఇక 2021 కంటే ముందు విడాకులు తీసుకున్న కొందరు మహిళలను మళ్లీ వారి భర్తల వద్ద పంపే బలవంతపు చర్యలకు కూడా పాల్పడుతున్నారు.
తాలిబన్లు తన విడాకులను బలవంతంగా రద్దు చేశారని సనా అనే యువతి చెప్పారు. తన భర్త నుంచి తాను విపరీతమైన వేధింపులకు గురవుతున్నానని వెల్లడించారు. “మా అమ్మాయి ఏడ్చినా.. ఆహారం బాగాలేకున్నా అతడు నన్ను విపరీతంగా కొడతాడు. మహిళలకు అసలు మాట్లాడే అర్హతే లేదని నన్ను దూషిస్తుంటాడు” అని చెప్పారు. అయితే తన కూతురికి తాలిబన్ కమాండర్‌తో ఎంగేజ్‍మెంట్ నిశ్చయించటంతో తన భర్త నుంచి తప్పించుకొని రహస్యంగా జీవిస్తున్నానని ఆమె చెప్పారు. ప్రస్తుతం తమ ఇంటి తలుపు ఎప్పుడు చప్పుడైనా విపరీతమైన భయం వేస్తోందని అన్నారు. అలా చాలా మంది మహిళల విడాకులను తాలిబన్లు రద్దు చేశారని తెలుస్తోంది.
సంబంధిత కథనం