Taliban carry out 1st public execution: హత్యానేరం రుజువైన ఒక వ్యక్తికి తాలిబన్ అధికారులు బుధవారం బహిరంగంగా మరణశిక్షను అమలు చేశారు. తాలిబన్ అధికారంలోకి వచ్చిన తరువాత బహిరంగంగా మరణ శిక్షను అమలు చేయడం ఇదే తొలిసారి.
ఈ మరణ శిక్షను కూడా తాలిబన్ వినూత్నంగా అమలు చేసింది. హత్య కాబడిన వ్యక్తి తండ్రితోనే హత్య చేసిన వ్యక్తిపై ఏకే 47 తుపాకీతో మూడు రౌండ్లు కాల్పులు జరిపించి, మరణ శిక్ష అమలు చేసింది. బహిరంగంగా వందలాది మంది ప్రజలు, పెద్ద సంఖ్యలో అధికారులు చూస్తుండగా ఈ శిక్షను విధించింది. అఫ్గానిస్తాన్ లోని పశ్చిమ ఫారా రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి కొందరు అధికారులు ప్రత్యేకంగా కాబూల్ నుంచి వెళ్లారు.
బహిరంగ మరణ శిక్ష విధానాన్ని మళ్లీ ప్రారంభించడం ద్వారా, అఫ్గాన్ చాంధన విధానాలనే తామూ అమలు చేస్తామని అధికార తాలిబన్ స్పష్టం చేసినట్లైంది. ఇస్లామిక్ చట్టం లేదా షరియాను అమలు చేయడంలో కచ్చితంగా వ్యవహరిస్తామని స్పష్టం చేసింది. అఫ్గానిస్తాన్ లో 2021 ఆగస్ట్ లో తాలిబన్ అధికారంలోకి వచ్చింది. అఫ్గానిస్తాన్ అత్యున్నత న్యాయస్థానాలు, తాలిబన్ సుప్రీం లీడర్ ముల్లా హైబతుల్లా అఖుండ్జాదా అనుమతితో ఈ మరణ శిక్ష నిర్ణయం తీసుకున్నట్లు తాలిబన్ అధికార ప్రతినిధి ముజాహిద్ వెల్లడించారు.
మరణ శిక్షకు గురైన వ్యక్తి పేరు తాజ్మిర్. హెరాట్ రాష్ట్రానికి చెందిన వాడు. ఐదేళ్ల క్రితం హెరాట్ రాష్ట్రానికి చెందిన ముస్తఫా ను హత్య చేసి, అతడి వద్ద నుంచి మొబైల్ ఫోన్ ను, మోటార్ సైకిల్ ను తీసుకెళ్లిపోయాడు. బాధిత కుటుంబం ఫిర్యాదు చేయడంతో తాజ్మిర్ ను అఫ్గాన్ పోలీసులు అరెస్ట్ చేసి, విచారణ ప్రారంభించారు. తాజ్మిర్ నేరాన్ని అంగీకరించడంతో, అతడికి మరణ శిక్ష విధించారు. 1990 దశకంలో తాలిబన్ అధికారంలో ఉన్న సమయంలో అఫ్గానిస్తాన్ లో బహిరంగ మరణశిక్షలు అమలు చేశారు.