Afghanistan: గర్భనిరోధక మాత్రలపై బ్యాన్ విధించిన తాలిబన్లు! వీటి వెనుక కుట్ర ఉందంటూ..-taliban ban use of contraception pills in afghanistan
Telugu News  /  National International  /  Taliban Ban Use Of Contraception Pills In Afghanistan
Afghanistan: గర్భనిరోధక మాత్రలపై బ్యాన్ విధించిన తాలిబన్లు
Afghanistan: గర్భనిరోధక మాత్రలపై బ్యాన్ విధించిన తాలిబన్లు (AP)

Afghanistan: గర్భనిరోధక మాత్రలపై బ్యాన్ విధించిన తాలిబన్లు! వీటి వెనుక కుట్ర ఉందంటూ..

19 February 2023, 17:24 ISTChatakonda Krishna Prakash
19 February 2023, 17:24 IST

Afghanistan: తాలిబన్లు మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. అప్ఘానిస్థాన్‍లోని రెండు ప్రధాన నగరాల్లో ఇప్పటికే గర్భనిరోధక మాత్రల అమ్మకంపై నిషేధం విధించారు.

Afghanistan: అఫ్గానిస్థాన్‍లో తాలిబన్ (Taliban) నియంతృత్వ పాలన సాగుతోంది. వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ ఆ దేశంలోని మహిళలు, బాలికల హక్కులను తాలిబన్లు కాలరాస్తున్నారన్న విమర్శలు అధికంగా ఉన్నాయి. మానవ హక్కులను తాలిబన్లు ఉల్లంఘిస్తున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే వారు మాత్రం ఏ మాత్రం తగ్గకుండా ముందుకుసాగుతున్నారు. ఈ క్రమంలోనే తాలిబన్లు మరో కొత్త నిర్ణయం తీసుకున్నారు. అఫ్గానిస్థాన్‍లోని రెండు ప్రధాన నగరాల్లో గర్భనిరోధక మాత్రలు (Contraception), మెడిసిన్ వాడడం, అమ్మడంపై నిషేధం విధించారు. ఈ విషయాన్ని గార్డియన్ కథనం వెల్లడించింది. వివరాలివే..

“చెక్ చేస్తున్నారు”

Afghanistan: మహిళలు గర్భం దాల్చకుండా ఉండేందుకు గర్భ నిరోధక మాత్రలు, కొన్ని రకాల ఇంజెక్షన్లు వినియోగిస్తారు. వీటి అమ్మకాలపై తాలిబన్లు నిషేధం విధిస్తున్నారు. “వారు (తాలిబన్) నా షాప్‍కు రెండుసార్లు వచ్చారు. గర్భనిరోధక మాత్రలు అమ్మవద్దని బెదిరించారు. కాబుల్‍లోని ఫార్మసీల్లో వారు రెగ్యులర్‍గా చెక్ చేస్తున్నారు. మేం అలాంటి ప్రొడక్టులను అమ్మడాన్ని ఆపేశాం” అని ఓ కాబుల్‍లోని ఓ మెడికల్ షాపు యజమాని చెప్పినట్టు గార్డియన్ రిపోర్ట్ వెల్లడించింది. “గర్భనిరోధక మాత్రలు, డెపో ప్రెవెరో ఇంజెక్షన్లును ఫార్మసీలో ఉంచుకునేందుకు తాలిబన్లు అనుమతించడం లేదు. ఈ నెల ప్రారంభంలో ఇది మొదలైంది. ఇప్పటికే ఉన్న స్టాక్‍ను అమ్మేందుకు కూడా భయపడుతున్నాం” అని కాబుల్‍లోని మరో షాప్ యజమాని గార్డియన్‍తో చెప్పారు.

“పాశ్చాత్య దేశాల కుట్ర”

Afghanistan: ముస్లిం జనాభాను తగ్గించే కుట్రతో గర్భ నిరోధక మాత్రలను పాశ్చాత్య దేశాలు తీసుకొచ్చాయని తాలిబన్లు భావిస్తున్నారని గార్డియన్ కథనం పేర్కొంది. ముస్లిం మహిళలు ఇవి తీసుకుంటే ముస్లిం జనాభాను తగ్గించవచ్చని ఆ దేశాలు వీటిని తయారు చేస్తున్నాయని చెబుతున్నారట. ఈ కారణంగానే నిషేధం విధిస్తున్నట్టు తాలిబన్లు చెబుతున్నారు. “జనాభాను నియంత్రించాలనే పాశ్చాత్య విధానాన్ని ఇక్కడ మీరు ప్రచారం చేసేందుకు మీకు అనుమతి లేదు. ఇదో అవసరపు పని” అని ఓ షాప్ యజమానితో తాలిబన్లు చెప్పారట.

మహిళల శరీరాలపై కూడా ఆంక్షలు

Afghanistan: 2021లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చి గద్దెనెక్కిన తాలిబన్లు.. మహిళలు, బాలికలపై ఆంక్షలు విధిస్తూనే ఉన్నారు. యూనివర్సిటీల్లో మహిళలకు ప్రవేశాన్ని బ్యాన్ చేశారు. వారి ఉన్నత విద్య కలలను చెరిపివేస్తున్నారు. ఉద్యోగాలు చేయకుండా ఆపేస్తున్నారు. తాజాగా గర్భ నిరోధక మాత్రం విషయంలోనూ నిషేధాన్ని అమలు చేస్తున్నారు. దీనిపై మహిళా హక్కుల ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “మహిళల చదువు, ఉద్యోగాలపైనే కాకుండా శరీరాలపై కూడా ఆంక్షలు విధిస్తూ మహిళల మానహ హక్కులను తాలిబన్లు నియంత్రిస్తున్నారు. ఇది దారుణం” అని యూకేలో యాక్టివిస్ట్‌గా ఉన్న అఫ్గాన్ సంతతికి చెందిన షబ్నమ్ నసిమి అన్నారు. ఫ్యామిలీ ప్లానింగ్ అనేది ప్రతీ ఒక్కరి హక్కు అని పేర్కొన్నారు.

సంబంధిత కథనం