ముంబైలో 26/11 ఉగ్రదాడి సూత్రధారి తహవూర్ హుస్సేన్ రాణాను భారత్ తీసుకొచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఆయన తరఫు న్యాయవాది జాన్ జి క్లైన్ అతడిని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. అయితే అమెరికా అత్యున్నత న్యాయస్థానం ఈ అప్పీలును తోసిపుచ్చింది. రాణా ఆరోగ్యం, భారతదేశంలో చిత్రహింసలకు అవకాశం ఉందని పేర్కొంటూ దీనిని ఆపాలని కోరుతూ న్యాయవాది.. విదేశాంగ మంత్రి మార్కో రుబియోకు లేఖ రాశారు.
ఈ లేఖలపై స్పందించిన రుబియో కార్యాలయం రాణాను భారత్‌కు పంపాలనే నిర్ణయం ఐక్యరాజ్యసమితి కన్వెన్షన్‌కు కట్టుబడి ఉందని తెలిపింది. అతడిని భారత్‌కు పంపడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమెరికా కోర్టు కూడా సమర్థించిందని పేర్కొంది.
జనవరిలో యూఎస్ సుప్రీం కోర్టు రాణా పిటిషన్‌ను తిరస్కరించిన రోజు. రాణా న్యాయవాది క్లైన్ అతన్ని భారతదేశానికి అప్పగించవద్దని కోరుతూ అప్పుడే విదేశాంగ మంత్రి రుబియోకు లేఖ రాశారు. అంతే కాదు క్లైన్ తన అభ్యర్థనను వివరంగా వివరించడానికి రుబియోతో అపాయింట్మెంట్ కూడా కోరారు.
క్లైన్ నాలుగు కారణాలతో రాణాకు ఉపశమనం కోరారు. గతంలో ఇదే కేసుకు సంబంధించి షికాగో కోర్టులో రాణాను విచారించారని, అక్కడ ఆయనను నిర్దోషిగా ప్రకటించారని క్లైన్ లేఖలో రాశారు. రెండో వాదన ఏంటంటే ముంబై దాడుల్లో రాణా పాత్ర డేవిడ్ హెడ్లీకి సహాయకుడి పాత్రగా ఉందని అన్నారు. అంతకు మించి ఏమీ లేదు అని చెప్పారు. మూడో కారణం చెబుతూ.. భారతదేశంలో రాణా చిత్రహింసలను ఎదుర్కొనే అవకాశం ఉందని లేఖలో పేర్కొన్నారు. 64 ఏళ్ల రాణా ఆరోగ్యం కూడా క్షీణిస్తోందని నాలుగు కారణాన్ని లేఖలో రాశారు క్లైన్.
అమెరికా కోర్టులో ఒక వ్యక్తిని విచారించి నిర్దోషిగా ప్రకటించి.. ఆ వ్యక్తిని భారత్ కు అప్పగించడమేంటి అన్నట్టుగా లేఖలో ప్రస్తావించారు క్లైన్. అంతేకాదు ఇప్పుడు అదే కేసుకు సంబంధించి మరో దేశానికి లొంగిపోవాల్సి వస్తోందన్నారు. అయితే క్లైన్ వాదనలన్నింటినీ అమెరికా అత్యున్నత న్యాయస్థానం, మార్కో రూబియో తోసిపుచ్చడంతో చివరకు తహవూర్ రాణాను భారత్‌కు తీసుకొచ్చారు.