ఢిల్లీలోని ఒక ప్రముఖ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ అధిపతి, ఆధ్యాత్మిక గురువు అని చెప్పుకునే స్వామి చైతన్యానంద సరస్వతి అలియాస్ స్వామి పార్థసారథిపై లైంగిక వేధింపులు, వేధింపులు, మోసపూరిత వ్యవహారాలపై కేసు నమోదైంది. వసంత్ కుంజ్‌లోని శ్రీ శారదా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్‌లో చదువుకుంటున్న కనీసం 17 మంది విద్యార్థినులను అతను లైంగికంగా వేధించాడని పోలీసులు అతనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ ఆరోపణలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది.
ఈ కేసులోని అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే, నిందితుడు మహిళల హాస్టల్‌లో రహస్య కెమెరాలను అమర్చాడు. సెక్యూరిటీ పేరుతో ఏర్పాటు చేసిన ఈ కెమెరాల ద్వారా అమ్మాయిల కదలికలను గమనిస్తూ.. విద్యార్థినులను అతని కోరికలకు ఒప్పుకునేలా బెదిరించేవారని ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు.
అలాగే, నిందితుడు విద్యార్థినులను వేధించడానికి అనేక మార్గాలను అవలంబించాడు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థినులను అర్ధరాత్రి తన గదికి పిలిపించుకొని లైంగికంగా వేధించేవాడని ఆరోపణలున్నాయి.
అంతేకాక, ఈ విద్యార్థినులను విదేశీ పర్యటనలకు కూడా తీసుకువెళ్లేవాడని ఎఫ్‌ఐఆర్‌లో ఉంది. ఒక విద్యార్థినిని ఆమె ఇష్టం లేకుండా పేరు మార్చమని బలవంతం చేశాడు. ఇదంతా మానసిక వేధింపుల్లో భాగంగా జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. అతను వాట్సాప్, ఎస్ఎంఎస్ ద్వారా అసభ్యకర సందేశాలు పంపించడం, డిగ్రీలు, ఇతర డాక్యుమెంట్లు ఇవ్వకుండా బెదిరించడం వంటి వాటికి పాల్పడేవాడని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థినులకు ఈ ఇన్‌స్టిట్యూట్‌లో స్కాలర్‌షిప్ ద్వారా చదువుకునే అవకాశం దక్కింది. చైతన్యానంద సరస్వతి తమను అశ్లీల సందేశాలతో, అవాంఛిత శారీరక స్పర్శతో, బెదిరింపులతో వేధించారని ఆరోపించారు. నిందితుడి మాట వినేలా అతడి సన్నిహితులు కూడా తమను బెదిరించే వారని ఆరోపించారు.
తల్లిదండ్రుల జోక్యాన్ని పరిమితం చేస్తూ, నిందితుడు విద్యార్థినులను సస్పెండ్ చేస్తామని బెదిరించేవాడని ఫిర్యాదులో ఉంది. ఒక విద్యార్థినిని ఆమె పేరు మార్చుకోవాలని బలవంతం చేసిన కేసు కూడా నమోదైంది. పోలీసులు ఈ కేసులో ఇంకా విచారణ జరుపుతున్నారు.
ఈ కేసు బయటకు వచ్చిన వెంటనే శ్రీ శారదా పీఠం, శృంగేరి ఒక ప్రకటన విడుదల చేసింది. "గతంలో డాక్టర్ పార్థసారథిగా పిలువబడిన చైతన్యానంద సరస్వతి, శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం దక్షిణామ్యాయ శ్రీ శారదా పీఠం ప్రయోజనాలకు విరుద్ధంగా, చట్టవిరుద్ధమైన, అనుచితమైన కార్యకలాపాలకు పాల్పడ్డారు. ఫలితంగా, పీఠం అతనితో ఉన్న అన్ని సంబంధాలను తెంచుకుంది. చైతన్యానంద సరస్వతి చేసిన అక్రమాలపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసింది" అని పీఠం ఆ ప్రకటనలో పేర్కొంది.
దర్యాప్తులో పోలీసులు మరో సంచలన విషయాన్ని కనుగొన్నారు. ఇన్‌స్టిట్యూట్ బేస్‌మెంట్‌లో ఫోర్జరీ చేసిన లైసెన్స్ ప్లేట్ (39 UN 1) ఉన్న ఒక వోల్వో కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సాధారణంగా ఐక్యరాజ్యసమితి దౌత్యవేత్తలకు మాత్రమే ఇచ్చే ఈ నకిలీ ప్లేట్, ఇప్పుడు ఈ కేసులో ఒక ముఖ్యమైన ఆధారంగా మారింది. ఇది ఒక పెద్ద మోసపూరిత కార్యకలాపాల్లో భాగమని అధికారులు చెబుతున్నారు.