Bulldozer demolitions: తమ అనుమతి లేకుండా అక్టోబర్ 1వ తేదీ వరకు బుల్ డోజర్ కూల్చివేతలను నిలిపివేయాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. పబ్లిక్ రోడ్లు, జలవనరుల ప్రాజెక్టులు, రైల్వే లైన్ నిర్మాణాలకు సంబంధించిన కూల్చివేతలను ఇందులో నుంచి మినహాయించింది. మునిసిపల్ చట్టాల ప్రకారం ఆస్తులను ఎప్పుడు, ఎలా కూల్చివేయవచ్చనే దానిపై మార్గదర్శకాలను రూపొందిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.
గతవారం జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ సుధాంశు ధూలియా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం 'బుల్డోజర్ జస్టిస్'ను విమర్శించింది. చట్టాన్ని అత్యున్నతమైనదిగా భావించే దేశంలో ఈ బుల్ డోజర్ బెదిరింపులు సరికాదని స్పష్టం చేసింది.
పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో ఒక కుటుంబంలోని ఒక వ్యక్తి పేరు ఉండడంతో, ఆ కుటుంబం ఉంటున్న ఇంటిని కూల్చివేస్తామని గుజరాత్ మున్సిపల్ అధికారులు బెదిరించారు. దాంతో, మునిసిపల్ అధికారుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆ కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ తమ క్లయింట్ కుటుంబానికి చెందిన మూడు తరాల వారు రెండు దశాబ్దాలుగా ఆ ఇంటిలో నివసిస్తున్నారని తెలిపారు. ‘‘రాజ్య కార్యకలాపాలు చట్టబద్ధమైన పాలనకు లోబడి ఉన్న దేశంలో, ఒక కుటుంబ సభ్యుడు చేసిన నేరం కుటుంబంలోని ఇతర సభ్యులపై లేదా వారు చట్టబద్ధంగా నిర్మించిన నివాసంపై చర్యలు తీసుకోవడాన్ని అంగీకరించదు. ఇల్లు కూల్చివేతకు ఆ కుటుంబ సభ్యుడిపై ఉన్న నేరారోపణలు సరైన కారణం కాదు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
భారత్ లో కూల్చివేతలను నియంత్రించేందుకు మార్గదర్శకాలు జారీ చేస్తామని సుప్రీంకోర్టు (supreme court) తెలిపింది. దేశవ్యాప్తంగా నిర్మాణాల కూల్చివేతలపై విస్తృత స్థాయి మార్గదర్శకాలను రూపొందిస్తున్నామని తెలిపింది. ‘‘అక్రమ నిర్మాణాలు అని భావిస్తున్న వాటికి సంబంధించి యజమానులకు నోటీసు ఇవ్వవచ్చు, సమాధానం ఇవ్వడానికి సమయం, ఇతర చట్టపరమైన పరిష్కారాలను అనుసరించడానికి సమయం ఇవ్వవచ్చు. ఆ తరువాత కూల్చివేత చేపట్టవచ్చు.. దీన్ని పాన్ ఇండియా ప్రాతిపదికన పరిష్కరించాలనుకుంటున్నాం’’ అని జస్టిస్ భూషణ్ ఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ల ధర్మాసనం పేర్కొంది.