Ranveer Allahbadia : ‘యూట్యూబ్ వీడియోలు చేయకూడదు.. పాస్‌పోర్ట్ ఇచ్చేయాలి’- సుప్రీంలో రణ్‌వీర్‌కి షాక్!
Ranveer Allahbadia news : రణ్వీర్ అల్లాబాదియా వివాదంపై సుప్రీంకోర్టు తాజాగా విచారణ చేపట్టింది. ఈ బీర్‌బైసెప్స్ యూట్యూబర్‌పై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూనే, యూట్యూబ్‌లో వీడియోలు చేయకూడదని, పాస్‌పోర్ట్ ఇచ్చేయాలని ఆదేశాలిచ్చింది.

సమయ్ రైనా “ఇండియాస్ గాట్ లేటెంట్ షో”లో యూట్యూబ్ సెలబ్రిటీ రణ్వీర్ అల్లాబాదియా చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి మాటలు ఎవరికి నచ్చుతాయి? అని ప్రశ్నిస్తూ.. యూట్యూబర్ మనసులో ఏవో చెడు అభిప్రాయాలు ఉన్నాయని, అవే షో ద్వారా బయటపడ్డాయని వ్యాఖ్యానించింది.
రణ్వీర్ అల్లాబాదియాపై సుప్రీంకోర్టు సీరియస్..
‘మీ తల్లిదండ్రులు శృంగారం చేయడాన్ని జీవితాంతం చూస్తావా? లేక ఒకసారి వారితో శృంగారంలో పాల్గొని జీవితం మొత్తం మీద చూడకుండా ఉంటావా?’ అని ఇండియాస్ గాట్ లేటెంట్ షోలో బీర్‌బైసెప్స్ యూట్యూబర్ రణ్వీర్ అల్లాబాదియా చేసిన కామెంట్స్ తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై తన మీద దాఖలైన ఎఫ్ఐఆర్లను ఒకేచోట చేర్చి వాటిని కొట్టివేయాలని యూట్యూబర్ రణ్వీర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటేశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. రణ్వీర్ వ్యాఖ్యలను తప్పుపట్టింది.
“ఇలాంటి ప్రవర్తనను ఖండించాలి. మీరు ప్రజాదరణ పొందినంత మాత్రాన, సమాజాన్ని తేలికగా తీసుకోలేరు. ఈ భాషను ఇష్టపడే వారు ఈ భూమ్మీద ఎవరైనా ఉంటారా? అతని మనసులో ఏదో చెడు భావనలు ఉన్నాయి. అవే షో ద్వారా బయటపడ్డాయి. అతడిని మేమెందుకు రక్షించాలి?” అని సుప్రీంకోర్టు చెప్పినట్టు సమాచారం.
అయితే, బీర్‌బైసెప్స్ యూట్యూబర్ రణ్‌వీర్‌ని అరెస్టు చేయకూడదని ఆదేశాలిచ్చింది. ఇది రణ్‌వీర్‌కి భారీ ఊరట!
అంతేకాదు, ఇకపై రణ్వీర్ ఎలాంటి యూట్యూబ్ షోలను ప్రసారం చేయకుండా సుప్రీంకోర్టు నిషేధం విధించింది.
ఈ వ్యాఖ్యలు వికృత మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని జస్టిస్ కాంత్ అన్నారు.
"మీరు ఎంచుకున్న పదాలతో తల్లిదండ్రులు సిగ్గుపడతారు, సోదరీమణులు సిగ్గుపడతారు. సమాజం మొత్తం సిగ్గుపడుతుంది. మీద వికృతమైన మనసు. మనది చట్టబద్ధ పాలనకు కట్టుబడే న్యాయవ్యవస్థ. ఒకవేళ (అల్లాబాదియాకు వ్యతిరేకంగా) బెదిరింపులు ఉంటే, చట్టం తన పని తాను చేసుకుపోతుంది," అని జస్టిస్ కాంత్ అన్నట్టు సమాచారం.
'పాస్‌పోర్ట్ సమర్పించండి'
విచారణ సందర్భంగా.. ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని రణ్వీర్ అల్లాబాడియాను సుప్రీంకోర్టు ఆదేశించింది.
'జైపూర్‌లో ఇదే ఆరోపణలపై మరేదైనా ఎఫ్ఐఆర్ నమోదైతే, పిటిషనర్ అరెస్ట్‌పై స్టే ఉంటుంది. పిటిషనర్ తన పాస్‌పోర్టును థానే పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేయాలి. ఈ కోర్టు ముందస్తు అనుమతి లేకుండా ఆయన దేశం విడిచి వెళ్లకూడదు," అని జస్టిస్ కాంత్ స్పష్టం చేశారు.
సంబంధిత కథనం