అవినీతి నిరోధక చట్టం కింద ఏ కేసులోనైనా ప్రభుత్వ ఉద్యోగిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు ప్రాథమిక విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అవినీతి కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు ప్రాథమిక విచారణను క్లెయిమ్ చేయడానికి నిందితుడికి ఎటువంటి చట్టపరమైన హక్కు లేదని తెలిపింది. అవినీతికి సంబంధించిన కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు ప్రాథమిక దర్యాప్తు సాకు చెప్పి తమపై చర్యలు తీసుకోకుండా తప్పించుకుంటున్న వారికి సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఉత్తర్వులు పెద్ద ఎదురుదెబ్బ అని పలువురు అంటున్నారు.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఉద్యోగిపై కేసు(ఎఫ్ఐఆర్) నమోదు చేయడానికి ప్రాథమిక విచారణ జరపడం తప్పనిసరి కాదని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. అవినీతి నిరోధక చట్టంతో సహా కొన్ని కేటగిరీల కేసుల్లో ప్రాథమిక విచారణ వాంఛనీయమే అయినప్పటికీ, ఇది నిందితుడి చట్టపరమైన హక్కు కాదు లేదా క్రిమినల్ కేసు నమోదు చేయడానికి అవసరమైన షరతు కాదు అని కోర్టు తెలిపింది.
లైవ్ లాలో వచ్చిన ఒక నివేదిక ప్రకారం.. కాగ్నిజబుల్ నేరం సమాచారం ద్వారా బహిర్గతం అయినప్పుడు, ఎఫ్ఐఆర్‌కు ముందు ప్రాథమిక విచారణ తప్పనిసరి కాదని కోర్టు తెలిపింది. కానీ కేసు వాస్తవాలు, పరిస్థితుల ఆధారంగా, ప్రభుత్వ ఉద్యోగి చేసిన నేరం కాగ్నిజబుల్ కాదా అని దర్యాప్తు సంస్థ కనుగొనాల్సిన అవసరం ఉందని కోర్టు తెలిపింది. ప్రాథమిక విచారణ ఉద్దేశం అందిన సమాచారం నిజానిజాలను ధృవీకరించడం కాదని, ఆ సమాచారం కాగ్నిజబుల్ నేరాన్ని బహిర్గతం చేయడానికి దారితీస్తుందో లేదో తెలుసుకోవడం మాత్రమేనని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రాథమిక దర్యాప్తు అవసరమా అనే నిర్ణయం కేసుకు సంబంధించిన వాస్తవాలు, పరిస్థితులను బట్టి మారుతుందని వెల్లడించింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ప్రభుత్వ ఉద్యోగిపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. జస్టిస్ దత్తా, జస్టిస్ మెహతాలతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. అవినీతి నిరోధక చట్టం 1988 ప్రకారం కర్ణాటక లోకాయుక్త పోలీసులు ఆ అధికారిపై సెక్షన్ 13(1)(బి), సెక్షన్ 12తో పాటు సెక్షన్ 13(2) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్‌ను హైకోర్టు కొట్టివేయడంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది.
సంబంధిత కథనం
టాపిక్