సుశాంత్ సింగ్ రాజ్పుట్ మరణానికి సంబంధించిన కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్, ఆమె తండ్రిపై జారీ చేసిన లుక్ అవుట్ నోటీసులను (ఎల్ఓసీ) బాంబే హైకోర్టు కొట్టివేయడాన్ని సవాలు చేస్తూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), మహారాష్ట్ర ప్రభుత్వం, బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ దాఖలు చేసిన పిటిషన్ని సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఫలితంగా రియా చక్రవర్తికి భారీ ఊరట లభించినట్టు అయ్యింది.
జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లో తీవ్రత కనిపించడం లేదని, నిందితులు కేవలం హైప్రొఫైల్ కాబట్టే వ్యాజ్యం దాఖలు చేసినట్టు ఉందని వ్యాఖ్యానించింది.
“మేము మిమ్నల్ని హెచ్చరిస్తున్నాము. విలువలే లేని పిటిషన్ని దాఖలు చేస్తున్నారు. నిందితులు కేవలం హై-ప్రొఫైల్ కాబట్టి పిటిషన్ వేసినట్టుంది. భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది,” అని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.
సుశాంత్ కేసులో మాదకద్రవ్యాలకు సంబంధించిన అంశాలపై 2020 సెప్టెంబర్లో రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అరెస్టు చేసింది. అటు సుశాంత్ సింగ్ రాజ్పుట్ మరణం నేపథ్యంలో నటిపై సీబీఐ లుకౌట్ నోటీస్ కూడా ఇచ్చింది.
రియా చక్రవర్తి, ఆమె ఇద్దరు కుటుంబ సభ్యులపై సీబీఐ జారీ చేసిన ఎల్ఓసీని బాంబే హైకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో రద్దు చేసింది.
సుశాంత్ సింగ్ రాజ్పుట్ (34).. 2020 జూన్ 14న బాంద్రాలోని తన అపార్ట్మెంట్లో ఉరివేసుకుని కనిపించారు. అతని తండ్రి పట్నా నివాసి కృష్ణ కిషోర్ సింగ్ ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు, బీహార్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
"కిస్ దేశ్ మే హై మేరా దిల్" వంటి షోలతో బుల్లితెరపై తన కెరీర్ని ప్రారంభించిన సుశాంత్, ఏక్తా కపూర్ "పవిత్ర రిష్తా" చిత్రంలోని పాత్రతో ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత 'కై పో చే', 'ఎంఎస్ ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ', 'శుద్ధ్ దేశీ రొమాన్స్', 'డిటెక్టివ్ బ్యోమ్కేష్ బక్షీ!', 'చిచోరే', 'దిల్ బెచారా' వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు.
మరీ ముఖ్యంగా 'ఎంఎస్ ధోనీ - ది అన్ టోల్డ్ స్టోరీ'తో సుశాంత్ తన కెరీర్లోనే బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్నారు. సుశాంత్ చివరి చిత్రం, సంజనా సంఘీతో కలిసి నటించిన "దిల్ బెచారా" ఓటిటిలో విడుదలైంది. ఇది "ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్" అధికారిక రీమేక్.
అయితే సుశాంత్ సింగ్ రాజ్పుట్ మరణం ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలింది. ఆయన మరణానికి అసలు కారణాలు ఇంకా తెలియలేదు.
సంబంధిత కథనం