Supreme Court: ఎలక్టోరల్ బాండ్ల పథకంపై సుప్రీంకోర్టు మరో కీలక తీర్పు
రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడానికి ఉద్దేశించిన ఎలక్టోరల్ బాండ్స్ పథకంలో అవకతవకలు జరిగాయని, వాటిపై సిట్ ద్వారా దర్యాప్తు జరపాలని కోరుతూ సుప్రీంకోర్టులో పలు ఎన్జీఓలు పిటిషన్ దాఖలు చేశాయి. వాటిపై శుక్రవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.
ఎలక్టోరల్ బాండ్ల (EB) ద్వారా రాజకీయ పార్టీలకు నిధులను సమకూర్చే పథకం ఒక కుంభకోణమని, దానిపై న్యాయ పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)తో విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ పై సిట్ దర్యాప్తు అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ స్కీమ్ ను ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టు రద్దు చేసింది.
ఇది క్విడ్ ప్రొ కో
ఈ ఎలక్టోరల్ బాండ్స్ పథకంలో రాజకీయ పార్టీలు, కార్పొరేట్ సంస్థలు, దర్యాప్తు సంస్థల మధ్య క్విడ్ ప్రోకో కనిపిస్తోందని ఆరోపిస్తూ రెండు ప్రభుత్వేతర సంస్థలు (ఎన్జీవో) సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశాయి. ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని 'స్కామ్'గా అభివర్ణించిన పిటిషనర్, వివిధ రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చిన డొల్ల కంపెనీలు, నష్టాల్లో ఉన్న కంపెనీల నిధుల మూలాలపై దర్యాప్తు చేసేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
ఇప్పటికే ఆ స్కీమ్ ను కొట్టేసిన సుప్రీంకోర్టు
ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ ఫిబ్రవరి 15న ఆ పథకాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఎలక్టోరల్ బాండ్ల పథకం ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం సమాచార హక్కును ఉల్లంఘించడమేనని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియలో రాజకీయ పార్టీలు ముఖ్యమైన విభాగాలు అని, ఆ రాజకీయ పార్టీలకు నిధులు ఎక్కడి నుంచి అందాయో తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉంటుందని సుప్రీంకోర్టు (supreme court) వ్యాఖ్యానించింది.
ఇది కూడా 2జీ స్కామ్ వంటిదే..
2జీ స్కామ్, బొగ్గు కుంభకోణం మాదిరిగా ఎలక్టోరల్ బాండ్ స్కామ్ వెనుక కూడా కోట్లాది రూపాయల అక్రమ డబ్బు లావాదేవీ జాడ ఉందని పిటిషనర్లు వాదించారు. ఆ స్కామ్ లపై జరిపినట్లే.. దీనిపై కూడా కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించి, ఆ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని కోరారు.
2018 నుంచి..
రాజకీయ నిధుల్లో పారదర్శకతను తీసుకువచ్చే ప్రయత్నాల్లో భాగంగా రాజకీయ పార్టీలకు ఇచ్చే నగదు విరాళాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్టోరల్ బాండ్లను 2018 లో ప్రవేశపెట్టారు. పలు కేసుల్లో కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్న కార్పొరేట్ కంపెనీలు ఆ దర్యాప్తు ఫలితాలను ప్రభావితం చేయడానికి అధికార పార్టీకి పెద్ద మొత్తంలో డబ్బును విరాళంగా ఇచ్చాయని పిటిషన్ లో ఆరోపించారు.