‘రేప్ విక్టమ్ పై అలహాబాద్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు అనుచితం’: సుప్రీంకోర్టు ఆగ్రహం-supreme court raps allahabad hcs observation that rape victim invited trouble ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ‘రేప్ విక్టమ్ పై అలహాబాద్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు అనుచితం’: సుప్రీంకోర్టు ఆగ్రహం

‘రేప్ విక్టమ్ పై అలహాబాద్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు అనుచితం’: సుప్రీంకోర్టు ఆగ్రహం

Sudarshan V HT Telugu

నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ, అత్యాచార బాధితురాలు తన సమస్యలను తానే కొని తెచ్చుకుంది అని అలహాబాద్ హై కోర్టు చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ వ్యాఖ్యలు సరికాదని, బాధితురాలిని అవమానించడమేనని స్పష్టం చేసింది.

సుప్రీంకోర్టు (PTI)

అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి బెయిల్ మంజూరు చేస్తూ, బాధితురాలిని ఉద్దేశించి అలహాబాద్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాజాగా, ఆ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు కూడా స్పందించింది. ఆ వ్యాఖ్యలు చాలా దారుణంగా, ఇన్ సెన్సిటివ్ గా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యలను తప్పుబట్టింది. గతంలో కూడా ఒక అత్యాచారం కేసులో అలహాబాద్ హైకోర్టు తీర్పును, ఆ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పు పట్టిన విషయం తెలిసిందే.

అసలు కేసు ఏంటి?

ఉత్తర ప్రదేశ్ లోని ఒక స్థానిక యూనివర్సిటీలో ఎంఏ చదువుతున్న యువతి స్నేహితురాళ్లతో కలిసి బార్ కు వెళ్లింది. అక్కడ అతిగా మద్యం సేవించి, సొంతంగా ఇంటికి వెళ్లలేని పరిస్థితుల్లో, అదే బార్ లో పరిచయమైన వ్యక్తితో కలిసి అతడు తీసుకువెళ్లిన ఇంటికి వెళ్లింది. అక్కడ ఆ యువకుడు తనపై రెండు సార్లు అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ కేసులో కింది కోర్టు బెయిల్ మంజూరు చేయకపోవడంతో, నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసు తీర్పు సందర్భంగా అలహాబాద్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు సంచలనం గా మారాయి. ‘‘ఆ యువతి ఎంఏ చదువుతోంది. తన చర్యల పర్యవసానాలు ఆమెకు తెలుసు. ఆమే స్వయంగా సమస్యలను కొని తెచ్చుకుంది’’ అని వ్యాఖ్యానిస్తూ నిందితుడికి జస్టిస్ సంజయ్ కుమార్ సింగ్ బెయిల్ మంజూరు చేశారు.

సుప్రీంకోర్టు ఆగ్రహం

అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘అవును, బెయిల్ మంజూరు చేయవచ్చు.. కానీ ఆమె స్వయంగా సమస్యలను కొని తెచ్చుకుంది అనే వ్యాఖ్యలు ఏమిటి? అసలు ఆ చర్చ ఎందుకు? ముఖ్యంగా ఈ వైపు (జడ్జీలు) ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి’’ అని జస్టిస్ బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యాఖ్యలను సామాన్యుడు ఎలా గ్రహిస్తాడో కూడా ఆలోచించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. అనంతరం, ఈ కేసు విచారణను 4 వారాల పాటు వాయిదా వేశారు.

హైకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా..

హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ సివిల్ సొసైటీ నెట్వర్క్ జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్, బాధితురాలి తల్లి దాఖలు చేసిన పిటిషన్ గత వారం జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్లతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఫిర్యాదుదారు అయిన బాధితురాలి తల్లి పేరును హైకోర్టు ప్రస్తావించిందని, ఆ పేరును సవరించాలని ఈ కోర్టు అనేక ఆదేశాలు జారీ చేసిందని ఫూల్కా తెలిపారు. వక్షోజాలను పట్టుకోవడం, మహిళ పైజామాను కిందకు లాగడం అత్యాచారయత్నంగా పరిగణించలేమని పేర్కొంటూ.. మరో కేసులో హైకోర్టు ఇచ్చిన మరో ఉత్తర్వులపై మార్చి 26న సుప్రీంకోర్టు స్టే విధించింది.

Sudarshan V

eMail
వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.