Shiv Sena name and symbol: సుప్రీం కోర్టులో ఉద్దవ్ శిబిరానికి దక్కని ఊరట
శివసేన పార్టీ పేరు, పార్టీ గుర్తు మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండే నేతృత్వంలోని శిబిరానికి కేటాయిస్తూ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేసిన ఉద్దవ్ బృందానికి ఉపశమనం లభించలేదు.
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని వర్గానికి 'శివసేన' పేరు, 'విల్లు, బాణం' గుర్తును కేటాయించాలన్న ఎన్నికల కమిషన్ ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు బుధవారం నిరాకరించింది. ఈ దశలో స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది.
ఎన్నికల కమిషన్ ఉత్తర్వు ఆధారంగా కాకుండా వేరే ఏదైనా చర్య తీసుకుంటే ఉద్ధవ్ ఠాక్రే శిబిరం చట్టంలో ఉన్న ఇతర పరిష్కారాలను అనుసరించవచ్చని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. రెండు వారాల తర్వాత విచారించేందుకు అత్యున్నత న్యాయస్థానం ఈ పిటిషన్‌ను లిస్ట్ చేసింది.
సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మధ్యంతర ఉపశమనం కల్పించాలని పట్టుబట్టారు. కాగా ఈ పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని ప్రతివాది అయిన ఏక్‌నాథ్ షిండేను సుప్రీంకోర్టు ఆదేశించింది.
సిఎం షిండే నేతృత్వంలోని ప్రత్యర్థి వర్గానికి 'శివసేన' పేరును, 'విల్లు - బాణం' గుర్తును కేటాయించాలని ఎన్నికల సంఘం తీసుకున్న చర్యను సవాలు చేస్తూ ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
శాసన మండలి, రాజ్యసభలో తమ వర్గానికి మెజారిటీ ఉందని భావించడంలో ఈసీ విఫలమైందని ఉద్ధవ్ సోమవారం దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. శాసన మెజారిటీ మాత్రమే ఎన్నికల కమిషన్‌కు ఆధారం కాదని నివేదించారు.
‘పిటిషనర్‌కు శాసన మండలి, రాజ్యసభలో మెజారిటీ ఉందని పరిగణనలోకి తీసుకోవడంలో ఈసీఐ విఫలమైంది. ఈసీఐ తీసుకున్న ప్రాతిపదికలో కూడా వైరుధ్యం ఉంది. ముఖ్యంగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న సభ్యులు తమ సభ్యత్వ హక్కును కోల్పోయే అవకాశం ఉంది. అలాంటప్పుడు గుర్తుల ఉత్తర్వులకు సంబంధించిన పిటిషన్‌పై తీర్పు చెప్పేందుకు ఎవరికి మెజారిటీ ఉందో నిర్ధారించడానికి శాసన మెజారిటీ మాత్రమే సురక్షితమైన మార్గదర్శి కాదు..’ అని పిటిషన్‌లో నివేదించారు.