Supreme Court : బంధుప్రీతికి బ్రేకులు వేసే ఆలోచనలో సుప్రీంకోర్టు కొలీజియం.. కీలక విషయంపై చర్చ!-supreme court likely to stop recommending judges relatives for hight court judgeship know in details ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Supreme Court : బంధుప్రీతికి బ్రేకులు వేసే ఆలోచనలో సుప్రీంకోర్టు కొలీజియం.. కీలక విషయంపై చర్చ!

Supreme Court : బంధుప్రీతికి బ్రేకులు వేసే ఆలోచనలో సుప్రీంకోర్టు కొలీజియం.. కీలక విషయంపై చర్చ!

Anand Sai HT Telugu
Dec 30, 2024 09:42 PM IST

Supreme Court : న్యాయ సేవలో బంధుప్రీతి సమస్యపై సుప్రీం కోర్టు కొలీజియం కీలక నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉందని చర్చ నడుస్తోంది. ఇప్పుడు దీనికి బ్రేకులు వేసేందుకు సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి.

సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు (HT_PRINT)

న్యాయమూర్తుల నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం తీసుకోనుందని చర్చ జరుగుతోంది. న్యాయమూర్తుల బంధువులే ఎక్కువగా నియమితులవుతారనే విషయంపై చర్చ నడుస్తోంది. చాలా మంది న్యాయమూర్తుల కుటుంబంలో ఇప్పటికే న్యాయమూర్తులు ఉండటం కూడా ఇలాంటి విమర్శలకు కారణం కావొచ్చు.

yearly horoscope entry point

న్యాయమూర్తుల బంధువులే ఎక్కువగా వస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఈ వ్యవస్థకు స్వస్తి పలికేందుకు సుప్రీంకోర్టు కొలీజియం సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి. హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో రిటైర్డ్ లేదా సిట్టింగ్ జడ్జి కుటుంబంలోని ఏ న్యాయవాది పేరును న్యాయమూర్తి పదవికి సిఫారసు చేయరాదనే ప్రతిపాదనను సుప్రీంకోర్టు కొలీజియం పరిశీలిస్తోందని అంటున్నారు.

నివేదికల ప్రకారం, ప్రస్తుత లేదా మాజీ సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తులుగా ఉన్న తల్లిదండ్రులు లేదా దగ్గరి బంధువులు అభ్యర్థులను సిఫారసు చేయకుండా ఉండాలని ఆదేశాలు ఇచ్చే ఆలోచనను సుప్రీంకోర్టు కొలీజియం పరిగణించవచ్చని పీటీఐ పేర్కొంది. తాజాగా కొలీజియంలోని న్యాయమూర్తులు కూడా దీనికి అంగీకరించారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ కారణంగా న్యాయమూర్తులుగా నియమితులయ్యే అర్హత కలిగినా.. కొందరు కాలేరనే వాదన కూడా వినిపిస్తోంది.

ప్రస్తుతం సుప్రీంకోర్టులో న్యాయమూర్తి పదవికి పేర్లను సిఫారసు చేసే ముగ్గురు సభ్యుల కొలీజియంలో భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, సూర్యకాంత్ ఉన్నారు.

హైకోర్టులలో న్యాయమూర్తుల పేర్లను నిర్ణయించే, సిఫార్సు చేసే ఐదుగురు సభ్యులతో కూడిన కొలీజియంలో న్యాయమూర్తులు సీజేఐ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, సూర్యకాంత్, హృషికేష్ రాయ్, ఏఎస్ ఓకా ఉన్నారు.

న్యాయమూర్తులుగా నియమించాల్సిన వారి పేర్లను కొలీజియం ప్రభుత్వానికి పంపుతుంది. కొలీజియం పంపిన సిఫార్సును ప్రభుత్వం ఒక్కసారి మాత్రమే తిరిగి పంపగలదు. కొలీజియం రెండోసారి పంపిన సిఫార్సును ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది.

సుప్రీం కోర్టు కొలీజియం డిసెంబర్ 22న సమావేశాలను నిర్వహించి రాజస్థాన్, ఉత్తరాఖండ్, బాంబే, అలహాబాద్ హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా నియమించేందుకు దాదాపు ఆరుగురి పేర్లను కేంద్రానికి సిఫారసు చేసింది. ఆ తర్వాత అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి శేఖర్ కుమార్ యాదవ్‌ చేసిన వ్యాఖ్యాలపై పెద్ద ఎత్తున చర్చ నడిచింది.

మరోవైపు నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ (NJAC) ఏర్పాటు చేసే విషయంపై కూడా గతంలో చర్చ జరిగింది. కొలీజియం వ్యవస్థలోని లోపాలను పరిష్కరించడానికి జాతీయ న్యాయ నియామకాల కమిషన్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అనుకుందని వార్తలు వచ్చాయి. ఎన్‌జేఏసీలో ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టులోని ఇద్దరు సీనియర్‌ న్యాయమూర్తులు, కేంద్ర న్యాయశాఖ మంత్రి, పౌర సమాజానికి చెందిన ఇద్దరు వ్యక్తులను చేర్చుకునే నిబంధన ఉంది.

Whats_app_banner

టాపిక్

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.