‘Maha' Live Updates: సుప్రీంలో సుదీర్ఘ విచారణ… ఇరు వర్గాల వాదనలివే…-supreme court hearing on maharashtra floor test live updates ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Supreme Court Hearing On Maharashtra Floor Test Live Updates

‘Maha' Live Updates: సుప్రీంలో సుదీర్ఘ విచారణ… ఇరు వర్గాల వాదనలివే…

HT Telugu Desk HT Telugu
Jun 29, 2022 08:33 PM IST

Maharashtra crisis: గురువారం ఉదయం 11 గంటలకు విశ్వాస పరీక్ష ఎదుర్కోవాలంటూ గవర్నర్ ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు ఏకధాటిగా మూడున్నర గంటలపాటు సుప్రీం కోర్టులో వాదనలు కొనసాగాయి. వాదనలు ముగిసిన అనంతరం రాత్రి 9 గంటలకు ఉత్వర్వులు జారీచేయనున్నట్టు ధర్మాసనం విరామం ప్రకటించింది.

భారత సర్నోన్నత న్యాయస్థానం
భారత సర్నోన్నత న్యాయస్థానం (Amlan Paliwal)

ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడణవిస్ వచ్చి కోరిన వెంటనే గవర్నర్ భగత్ కోష్యార్ విశ్వాస పరీక్షకు పిలవడం రాజ్యాంగ విరుద్ధమని చీఫ్ విప్ సునీల్ ప్రభు పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు డిప్యూటీ స్పీకర్ రెబల్ ఎమ్మెల్యేలకు ఇచ్చిన అనర్హత నోటీసులపై నిర్ణయం పెండింగ్‌లో ఉండగానే విశ్వాస పరీక్ష జరపడాన్ని తప్పుపట్టారు.

ట్రెండింగ్ వార్తలు

కాగా ఇంతకుముందు డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన అనర్హత నోటీసులను సవాలు చేస్తూ ఏక్‌నాథ్ షిండే వర్గం దాఖలు చేసిన పిటిషన్‌‌పై నిన్న విచారించిన సుప్రీం కోర్టు.. ఆ నోటీసులపై జవాబు ఇచ్చేందుకు జూలై 12 వరకు గడువు ఇచ్చింది.

ఆ వెంటనే ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడణవీస్ ఢిల్లీ వెళ్లొచ్చారు. ఆ వెంటనే గవర్నర్‌ను కలిసి ముఖ్యమంత్రిని విశ్వాస పరీక్ష పిలవాలని కోరారు. ఆ వెంటనే గవర్నర్ విశ్వాస పరీక్షకు పిలిచారు.

దీనిని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి విచారణ జరుపుతోంది.

పిటిషనర్ సునీల్ ప్రభు తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తున్నారు. ఏక్‌నాథ్ షిండే తరపున వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాది నీరజ్ కిషన్ కౌల్ హాజరయ్యారు. గవర్నర్ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరయ్యారు.

అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తూ ‘విశ్వాస పరీక్షకు సంబంధించిన లేఖపై జూన్ 28 అని ఉంది. కానీ ఈరోజు ఉదయం మాకు ఆ లేఖ వచ్చింది. రేపు సభలో విశ్వాస పరీక్ష అని లేఖలో ఉంది. ఒకవైపు ఎన్సీపీకి సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యేలు కోవిడ్ పాజిటివ్‌తో ఉన్నారు. ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే విదేశాల్లో ఉన్నారు..’ అని నివేదించారు. ‘ఇది సూపర్ సోనిక్ స్పీడ్‌తో నిర్వహిస్తున్న ఫ్లోర్ టెస్ట్’ అని సింఘ్వి నివేదించారు.

‘ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపు అభియోగాలను ఎదుర్కొంటున్నారు. ఒకవేళ ఏక్ ‌నాథ్ షిండే పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేస్తే.. రేపటి బలపరీక్ష జూలై 11 నాటి సుప్రీం కోర్టు ఆదేశాలకు లోబడి ఉంటుందా?’ అని వాదించారు.

‘ఓటేసేందుకు ఎవరు అర్హులనేది తేల్చాల్సి ఉంది. కోర్టు ఈ అంశంపై విచారణను వాయిదా వేసింది..’ అని సింఘ్వీ నివేదించారు.

‘గవర్నర్ ఈ కోర్టు ప్రొసీడింగ్స్‌కు విరుద్ధంగా, అలాగే స్పీకర్ ప్రొసీడింగ్స్‌కు విరుద్ధంగా వెళ్లజాలరు..’ అని నివేదించారు.

‘న్యాయస్థానం ఏక్‌నాథ్ షిండే పిటిషన్ కొట్టివేసిందనుకుందాం. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుంది. అలాంటప్పుడు రేపటి బలపరీక్షను రద్దు చేస్తారా?’ అని వాదించారు.

‘ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ జూన్ 21న అనర్హత నోటీసులు జారీచేశారు. ఒకవేళ అనర్హతకు గురైతే ఆ తేదీ నుంచి వారి అనర్హత వర్తిస్తుంది..’ అని సింఘ్వీ నివేదించారు. ‘అంటే కోర్టు జూన్ 21న అనర్హతకు గురైన వారిని విశ్వాస పరీక్షలో ఓటేసేందుకు అనుమతించినట్టవుతుంది..’ అని నివేదించారు.

‘అనర్హత వేటు పడాల్సిన సభ్యులు ఓటేస్తే అది ప్రజాస్వామ్య మూలాలపై వేటేసినట్టే.. అలాగే చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. గవర్నర్ ముఖ్యమంత్రి సలహా మేరకు నడుచుకోవాల్సి ఉంటుంది. అలా జరుగుతోందా లేదో తెలియదు. కానీ ప్రతిపక్ష నేత సలహా మేరకు నడుచుకోరాదు..’ అని నివేదించారు.

‘ఇలాంటి పరిస్థితి వస్తే తమను సంప్రదించవచ్చని మొన్నటి కేసు సందర్భంగా మాకు స్వేచ్ఛనిచ్చారు. ఊహించిన దాని కంటే వేగంగా ఆ పరిస్థితి వచ్చింది..’ అని సింఘ్వీ నివేదించారు.

‘34 మంది ఎమ్మెల్యేలు గవర్నర్‌కు లేఖ ఇచ్చారు. ఆ లేఖ ఇవ్వడమంటే స్వయంగా తమ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్టే.. ఈ మేరకు సుప్రీం కోర్టు తీర్పులు కూడా ఉన్నాయి..’ అని సింఘ్వీ నివేదించారు.

‘తమ పార్టీ గురించి గవర్నర్‌ను కలవడం, ఫిర్యాదుచేయడం అంటేనే స్వచ్ఛందంగా సభ్యత్వాన్ని వదులుకోవడం.. ఈమేరకు సుప్రీం కోర్టు మూడు కేసుల్లో తీర్పు ఇచ్చింది..’ అని సింఘ్వీ నివేదించారు.

ఈ సందర్భంలో జస్టిస్ సూర్యకాంత్ జోక్యం చేసుకుంటూ గవర్నర్ చర్యను ఎందుకు అనుమానించాలని ప్రశ్నించారు. దీనికి సింఘ్వి జవాబు ఇస్తూ.. గవర్నర్ ప్రతి చర్య కూడా న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందని బొమ్మై కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు.

డిస్‌క్వాలిఫికేషన్ ప్రొసీడింగ్‌పై స్టే ఉండి, ఆ వెంటనే ఫ్లోర్ టెస్ట్ ప్రకటన చేసిన సందర్భాలేవీ లేవని సింఘ్వీ నివేదించారు.

తిరిగి జస్టిస్ సూర్యకాంత్ జోక్యం చేసుకుంటూ ‘ప్రభుత్వానికి మెజారిటీ లేదని గవర్నర్‌కు తెలుసనుకుందాం. ప్రభుత్వం స్పీకర్‌ను ఉపయోగించుకుని అనర్హత నోటీసులు ఇప్పించిందనుకుందాం.. అప్పుడు గవర్నర్ ఏం చేయాలి? గవర్నర్ తన విచక్షణను ఉపయోగించవచ్చా?’ అని ప్రశ్నించారు.

దీనికి సింఘ్వీ బదులిస్తూ గవర్నర్ ఎలాంటి వెరిఫికేషన్ చేయలేదని, కోవిడ్ నుంచి ఆయన రెండు రోజుల క్రితమే కోలుకున్నారని నివేదించారు. స్పీకర్‌పై అనర్హత కోరుతూ దాఖలు చేసిన తీర్మానం కూడా వెరిఫై చేయలేని సోర్సెస్ నుంచి మెయిల్ ద్వారా వచ్చినందున తిరస్కరణకు గురైందని నివేదించారు. పదో షెడ్యూలు ద్వారా దఖలు పడిన అధికారాలను తప్పించేందుకు వారు స్పీకర్‌పై అవిశ్వాసం నోటీసు ఇచ్చారని నివేదించారు.

గవర్నర్ నిర్ణయాలపై న్యాయ సమీక్ష జరపవచ్చని, ఆర్టికల్ 361 ద్వార వచ్చే ఇమ్యూనిటీ కేవలం కోర్టు గవర్నర్‌ను ప్రతివాదిగా చేయకుండా ఉండడమేనని, అందుకే సెక్రటరీని పార్టీగా చేర్చుతారని సింఘ్వీ నివేదించారు.

‘మధ్య ప్రదేశ్ కేసులో లాగా ఇక్కడ సభాపతికి స్వేచ్ఛ లేకుండా పోయింది. సభ్యుల రాజీనామాల విషయంలో గానీ, అనర్హత విషయంలో గానీ సభాపతి నిర్ణయం తీసుకోకుండా ఏదీ ఆపలేదు. విశ్వాస పరీక్షకు పిలిచినప్పటికీ ఇందులో మార్పుండదు..’ అని సింఘ్వీ మధ్యప్రదేశ్ కేసు తీర్పును ఉఠంకించారు. కానీ ఈరోజు స్పీకర్ చేతులు కట్టేసి ఉన్నాయని సింఘ్వీ వాదించారు.

స్పీకర్‌కు ఉన్న సంకెళ్లు తెంచినా, లేక విశ్వాస పరీక్ష వాయిదా వేసినా న్యాయం జరుగుతుందని సింఘ్వీ తన వాదనలు ముగించారు.

నీరజ్ కిషన్ కౌల్ వాదనలు ప్రారంభం..

నబం రెబియా కేసులో తీర్పును ప్రస్తావిస్తూ నీరజ్ కిషన్ కౌల్ తన వాదనలు ప్రారంభించారు. సభాపతి తొలగింపుపై నిర్ణయం పూర్తయ్యేవరకు అనర్హత ప్రొసీడింగ్స్‌లో నిర్ణయం తీసుకోజాలరని ఈ కేసులో తీర్పును ఉటంకించారు.

ముందుగా స్పీకర్ తన పదవిలో ఉండేందుకు అర్హుడా లేదా అన్నదానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని నివేదించారు.

ఎమ్మెల్యే రాజీనామా చేశాడా? లేక పదో షెడ్యూలు కింద అనర్హత వర్తిస్తుందా? వంటి అంశాల కారణంగా విశ్వాస పరీక్షలో జాప్యం తగదని సుప్రీం కోర్టు చెప్పిందని కౌల్ ప్రస్తావించారు.

ఈ సందర్భంలో జస్టిస్ సూర్యకాంత్ జోక్యం చేసుకుంటూ.. ఈ కేసులో ప్రొసీడింగ్స్‌ను స్పీకర్ స్వచ్ఛందంగా నిలిపివేయలేదని, కోర్టు ఆదేశాలతోనే ఆపేశారని గుర్తు చేశారు.

ఈ సందర్భంలో కౌల్ వాదనలు కొనసాగిస్తూ.. తాము ఈ విషయంలో కోర్టుకు వచ్చినప్పుడు తమకు సంపూర్ణ మెజారిటీ ఉందని, సభాపతి సభ విశ్వాసం కోల్పోయారని కూడా తాము లేఖ రాశామని గుర్తు చేశారు. జూన్ 24న సభాపతి తమకు అనర్హత నోటీసులు జారీచేశారని నివేదించారు.

‘సభాపతికి అర్హత లేదనేదే నా ప్రధాన వాదన. ఇది సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం కూడా ఇదివరకే తేల్చింది..’ అని కౌల్ వాదించారు.

‘సాధారణంగా పార్టీలు విశ్వాస పరీక్ష జరిగేలా కోర్టును ఆశ్రయిస్తాయి. కానీ ఇక్కడ విరుద్ధంగా జరుగుతోంది..’ అని కౌల్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు.

విశ్వాస పరీక్షలో జాప్యం రాజ్యాంగానికి ప్రమాదకరం అని నివేదించారు. గవర్నర్ విశ్వాస పరీక్ష నిర్వహించడం ఇక్కడ అహేతుకమా? అని వాదించారు.

ప్రభుత్వం మెజారిటీ కోల్పోయిందని తెలిసి, సభాపతి ద్వారా అనర్హత నోటీసులు జారీచేయించే పరిస్థితి ఉత్పన్నమవుతుందా? అని జస్టిస్ సూర్యకాంత్ ఈ సందర్భంలో ప్రశ్నించారు.

దీనికి కౌల్ జవాబు ఇస్తూ నబం రబియా కేసు ఇదే చెబుతోందని ప్రస్తావించారు.

అనర్హత ప్రొసీడింగ్స్, విశ్వాస పరీక్ష.. రెండూ వేర్వరని, సభాపతి అనర్హత ప్రొసీడింగ్స్ కొనసాగించలేరని సుప్రీం కోర్టు వేర్వేరు కేసుల్లో స్పష్టంచేసిందని కౌల్ నివేదించారు.

ముఖ్యమంత్రి విశ్వాస పరీక్షకు సిద్ధంగా లేరంటేనే ఆయన మెజారిటీ కోల్పోయారని ప్రాథమికంగా అవగతమవుతోందని కౌల్ నివేదించారు.

విశ్వాస పరీక్ష ఎదుర్కోవడమంటే రాజకీయ జవాబుదారీతనం కలిగి ఉండడమని, రాజకీయ నైతికత కలిగి ఉండడమని కౌల్ నివేదించారు.

ఈ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ కౌల్ ను ప్రశ్నిస్తూ అసమ్మతి గ్రూపులో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారని అన్నారు.

55 మందిలో 39 మంది ఎమ్మెల్యేలు అసమ్మతి వర్గంలో ఉన్నారని కౌల్ నివేదించారు. అందుకే విశ్వాస పరీక్షకు ముఖ్యమంత్రి సిద్ధంగా లేరని అన్నారు.

వారిలో ఎంతమందిపై అనర్హత నోటీసులు ఇచ్చారని న్యాయమూర్తి ప్రశ్నించగా 16 మందికి ఇచ్చినట్టుగా కౌల్ వివరించారు.

తాము (ఎమ్మెల్యేలు) శివ సేనను వీడడం లేదని, తామే శివసేన అని అసమ్మతి వర్గం ఎమ్మెల్యేల తరపు న్యాయవాది కౌల్ నివేదించారు. కేవలం 14 మంది మాత్రమే తమను విభేదిస్తున్నారని విన్నవించారు.

సీనియర్ అడ్వొకేట్ మణిందర్ సింగ్ రాత్రి 7.30కి తన వాదనలు ప్రారంభించారు.

ఎప్పుడైనా విశ్వాస పరీక్ష కోరుతూ వచ్చే పిటిషన్ల కోసం పనివేళల అనంతరం కూడా విచారించారని, విశ్వాస పరీక్ష వద్దని కోరుతూ రావడం ఇదే తొలిసారని నివేదించారు. విశ్వాస పరీక్ష కోసం గవర్నర్‌కు మంత్రి మండలి సలహా అక్కర్లేదని వాదించారు.

ప్రస్తుత పిటిషన్‌ను తిరస్కరించడం ద్వారా కోర్టు పదో షెడ్యూలు ఉద్దేశాలను కాపాడినట్టవుతుందని సింగ్ అన్నారు. రిట్ పిటిషన్ 55 మంది సభ్యుల్లోని 16 మంది మద్దతుతో మాత్రమే దాఖలైందని గుర్తు చేశారు.

ఈ సందర్భంలో జస్టిస్ సూర్యకాంత్ జోక్యం చేసుకుంటూ.. ఈ అంశం అసంబద్ధమవుతుందని తాము అనుకోవడం లేదని, అర్హత లేకుండా విశ్వాస పరీక్షలో పాల్గొనే అవకాశం కల్పించామనుకుంటే.. అనర్హత తేలినప్పుడు దానిని రద్దు చేయొచ్చు కదా అని అభిప్రాయపడ్డారు.

గవర్నర్ తరపు న్యాయవాది వాదనలు ప్రారంభం

గవర్నర్ తరపున సొలిసిటర్ జనరల్ వాదనలు ప్రారంభించారు. స్పీకర్‌ను సుప్రీం కోర్టు అడ్డుకున్నదన్న వాదన సరికాదని, చట్టంలోనే అలా ఉందని అన్నారు. సభాపతి విశ్వాస పరీక్షకు ఓటర్ల జాబితాను నిర్ణయించలేరని అన్నారు. ఎలక్టోరల్ కాలేజ్‌ను నిర్ణయించలేరని నివేదించారు.

విశ్వాస పరీక్షకు ఆదేశిస్తూ గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేసేందుకు తగిన కారణాలు లేవని నివేదించారు.

తిరిగి వాదనలు ప్రారంభించిన సింఘ్వీ

శివసేన చీఫ్ విప్ తరపున అభిషేక్ మను సింఘ్వీ తిరిగి వాదనలు కొనసాగించారు. అనర్హతపై నిర్ణయం తీసుకోకుండా సభాపతి చేతులు కట్టేశారని, ఒకవైపు పదో షెడ్యూలుపై నిర్ణయం తీసుకోకుండా ఇంకోవైపు విశ్వాస పరీక్ష నిర్వహించమంటున్నారని వాదించారు. సభాపతిపై విశ్వాస పరీక్షకు తీర్మానాన్ని కేవలం అసెంబ్లీ కొలువుదీరినప్పుడు మాత్రమే సాధ్యమని నివేదించారు. అలాగే సభాపతి తొలగింపునకు తగిన అభియోగాలు మోపాలని, కానీ ఇక్కడ ఎలాంటి అభియోగాలు లేవని నివేదించారు.

గవర్నర్లు దైవదూతలు కాదని, వారూ మనుషులేనని, అందుకే బొమ్మై కేసులో తీర్పు వెలువడిందని నివేదించారు. కోర్టులో ఉన్న అంశాల్లో గవర్నర్ చర్య తీసుకోలేరని, వెరిఫై చేయలేరని నివేదించారు. ముఖ్యమంత్రి అభిప్రాయాన్ని కూడా తీసుకోలేదని నివేదించారు.

నబం రబియా కేసులో తీర్పును ఇక్కడ నేరుగా అప్లై చేస్తే పదో షెడ్యూలు కథ ముగిసినట్టేనని నివేదించారు. ఫిరాయింపుదారు ఎల్లప్పుడూ స్పీకర్ తొలగింపు కోసం రిజల్యూషన్ పంపగలడని వాదించారు. వాస్తవాలను పట్టించుకోకుండా ఈ తీర్పును వర్తింపజేస్తే ఇక పదో షెడ్యూలుకు అర్థమే ఉండదని వాదించారు.

ధర్మాసనం ముందు ఇరుపక్షాల వాదనలు రాత్రి 8.25కు ముగిశాయి.

కాగా ఈ పిటిషన్‌పై ఉత్తర్వులను రాత్రి 9 గంటలకు వెలువరించనున్నట్టు ధర్మాసనం వెల్లడించి విరామం ప్రకటించింది.

IPL_Entry_Point