గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న 'వంతారా వన్యప్రాణి రెస్క్యూ సెంటర్' కార్యకలాపాలపై దర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ని ఏర్పాటు చేసింది. ఈ బృందానికి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ జే చలమేశ్వర్ నాయకత్వం వహిస్తారు.
వంతారా కేంద్రం జంతువులను సేకరించడంలో, ముఖ్యంగా ఏనుగులను దేశీయంగా, విదేశాల నుంచి తీసుకురావడంలో వన్యప్రాణి సంరక్షణ చట్టం, ఇతర సంబంధిత చట్టాలను పాటించిందా లేదా అని సిట్ పరిశీలిస్తుంది.
వంతారాపై దేశ-విదేశాల్లో జంతువుల అక్రమ కొనుగోలు, సరిగ్గా చూసుకోకపోవడం, ఆర్థిక అవకతవకలు, మనీ లాండరింగ్ ఆరోపణలు వేస్తూ రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని విచారించిన సర్వోన్నత న్యాయస్థానం సిట్ దర్యాప్తునకు ఆదేశాలిచ్చింది.
అయితే ఈ విచారణ ఉత్తర్వులను ఏ సంస్థ పనితీరుపైనా సందేహాలు వ్యక్తపరిచినట్లుగా భావించవద్దని, ఇది కేవలం వాస్తవాలను కనుగొనే (ఫ్యాక్ట్ ఫైండింగ్) ప్రక్రియ మాత్రమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నివేదికను సెప్టెంబర్ 12, 2025లోగా సమర్పించాలని సిట్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది.
జస్టిస్ చలమేశ్వర్ నేతృత్వంలోని ఈ సిట్‌లో ఉత్తరాఖండ్, తెలంగాణ హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర చౌహాన్, ముంబై మాజీ పోలీస్ కమిషనర్ హేమంత్ నాగ్రాలే, అడిషనల్ కమిషనర్ (కస్టమ్స్) అనీష్ గుప్తా సభ్యులుగా ఉంటారు.
సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తున్నామని, విచారణకు పూర్తి సహకారం అందిస్తామని వంతారా ప్రతినిధి ఒకరు తెలిపారు. "మా లక్ష్యం జంతువులను రక్షించడం, సంరక్షించడం. విచారణ బృందానికి పూర్తిగా సహకరిస్తాం. జంతువుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మా పనిని కొనసాగిస్తాం. ఈ ప్రక్రియ ఊహాగానాలకు తావు లేకుండా, జంతువుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సాగాలని కోరుకుంటున్నాము," అని వాంతారా ప్రతినిధి పేర్కొన్నారు.
మీడియా నివేదిక ప్రకారం, సిట్ పరిశీలించాల్సిన ఇతర ముఖ్య అంశాలు ఇవి:
దేశీయంగా, విదేశాల నుంచి జంతువుల సేకరణ, ముఖ్యంగా ఏనుగుల కొనుగోలు.
వన్యప్రాణుల (సంరక్షణ) చట్టం, 1972 జంతు ప్రదర్శనశాలలకు సంబంధించిన నియమాలను పాటించడం.
అంతర్జాతీయంగా అంతరించిపోతున్న వృక్షజాలం, జంతుజాలాల వాణిజ్యంపై అంతర్జాతీయ ఒప్పందంను అనుసరించడం.
జంతు సంరక్షణ, పశువైద్య సంరక్షణ, జంతు సంక్షేమ ప్రమాణాలను పాటించడం, జంతువుల మరణాల రేటు.
పారిశ్రామిక ప్రాంతానికి సమీపంలో ఉండటం, వాతావరణ పరిస్థితులపై వచ్చిన ఫిర్యాదులు.
జంతువులను ప్రైవేట్ కలెక్షన్‌గా పెంచుకోవడం, పునరుత్పత్తి కార్యక్రమాలు, బయోడైవర్సిటీ వనరుల వినియోగంపై వచ్చిన ఆరోపణలు.
నీటి వనరుల దుర్వినియోగం, కార్బన్ క్రెడిట్స్‌కు సంబంధించిన ఆరోపణలు.
జంతు అక్రమ రవాణా, మనీ లాండరింగ్ వంటి అంశాలపై వచ్చిన ఆరోపణలు.
ఈ దర్యాప్తు బృందానికి సెంట్రల్ జూ అథారిటీ, సీఐటీఈఎస్ మేనేజ్‌మెంట్ అథారిటీ, పర్యావరణ, అటవీ- వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అటవీ, పోలీసు విభాగాలు పూర్తి సహకారం అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
సంబంధిత కథనం