చాలా రాష్ట్రాలు పోక్సో కేసుల కోసం ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేశాయని సుప్రీం కోర్టు పేర్కొంది. అయితే తమిళనాడు, బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, మహారాష్ట్ర, మరికొన్ని రాష్ట్రాల్లో చాలా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, అందుకే పోక్సో కోర్టుల అవసరం ఉందని తెలిపింది. పోక్సో చట్టం ప్రకారం 100కు పైగా ఎఫ్ఐఆర్‌లు ఉన్న ప్రతి జిల్లాలో ఒక కోర్టు ఉండాలని స్పష్టం చేసింది.
పోక్సో కేసుల దర్యాప్తుతో సంబంధం ఉన్న అధికారులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. పోక్సో కేసుల దర్యాప్తులో పాలుపంచుకున్న అధికారులకు అవగాహన కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పింది. పోక్సో కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులను కూడా ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నట్లు కోర్టు వ్యాఖ్యానించింది. నిర్ణీత గడువులోగా విచారణ పూర్తి చేయాలని చెప్పింది.
'కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పోక్సో కేసుల దర్యాప్తుతో సంబంధం ఉన్న అధికారుల కోసం తగిన చర్యలు తీసుకోవాలి. పోక్సో కేసులను అత్యంత ప్రాధాన్యత ఆధారంగా విచారించడానికి ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలి. చట్టంలో నిర్దేశించిన గడువులోగా చార్జిషీట్లు దాఖలు చేయాలి. నిర్ణీత గడువులోగా విచారణలను పూర్తి చేయాలి.'అని సుప్రీంకోర్టు ఆదేశించింది.'
చిన్నారులపై అత్యాచార ఘటనలు విపరీతంగా పెరిగిపోతున్నాయంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. పోక్సో చట్టం కింద వేధింపుల కేసులు 300కు పైగా పెండింగ్‌లో ఉన్న జిల్లాల్లో రెండు కోర్టులను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు తెలిపింది.