దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వీధి కుక్కల వివాదంపై సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పును వెలువరించింది. వీధి కుక్కులను తీసుకెళ్లి స్టెరిలైజేషన్- వ్యాక్సినేషన్ చేసి, ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తిరిగి అదే ప్రాంతంలో విడిచిపెట్టాలని ఆదేశించింది. అయితే, రేబీస్ సోకినా, లేదా అగ్రెసివ్‌గా ఉన్న వాటిని మాత్రం విడిచిపెట్టకూడదని పేర్కొంది. ఈ మేరకు.. దిల్లీ- ఎన్సీఆర్ ప్రాంతంలోని శునకాలను శాశ్వతంగా షెల్టర్లలో పెట్టాలన్న గత తీర్పును మార్చింది.
మూగజీవులను షెల్టర్లలో పెట్టడం అమానవీయం అని భారీ ఎత్తున నిరసనలు చేసిన జంతు ప్రేమికులకు సుప్రీంకోర్టు తాజా తీర్పు ఒక విజయంగా చూస్తున్నారు!
అయితే, కుక్కలకు బహిరంగంగా ఆహారం పెట్టవద్దని అత్యున్నత న్యాయస్థానం తన తాజా తీర్పు ద్వారా తేల్చిచెప్పింది. వాటికి ఆహారాన్ని ఇచ్చేందుకు ప్రత్యేక ‘ఫీడింగ్ స్పేస్’ని రూపొందించాలని దిల్లీ-ఎన్సీఆర్లోని మున్సిపల్ అధికారులకు స్పష్టం చేసింది.
“వీధి కుక్కల కోసం ప్రత్యేక ఫీడింగ్ స్పేసెస్‌ని రూపొందించాలి. అవి ఫీడింగ్ ఏరియాలు అని నోటీస్ బోర్డులు పెట్టాలి. ఇక్కడ తప్ప మరెక్కడా ఆహారం పెట్టకూడదు. దీనిని ఉల్లంఘిస్తే, చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. దీనిని వ్యతిరేకించే శునక ప్రేమికులు, ఎన్జీఓలు రూ. 25వేల నుంచి రూ. 2లక్షల వరకు రిజిస్ట్రార్ దగ్గర డిపాజిట్ చేయాలి,” అని సుప్రీంకోర్టు వెల్లడించింది.
మరోవైపు, అధికారులకు ఇచ్చిన ఆదేశాల్లో ఉల్లంఘనలు కనిపిస్తే, ప్రజలు ఫిర్యాదు చేసేందుకు ఎంసీడీ ఒక హెల్ప్‌లైన్ నెంబర్ని ప్రారంభించాలని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. జంతు ప్రేమికులు ఎంసీడీ దగ్గరికి వెళ్లి కుక్కలను దత్తత తీసుకునేందుకు అప్లికేషన్లు వేసుకోవచ్చని పేర్కొంది.
అంతేకాదు, ఈ వ్యవహారంపై జాతీయ స్థాయి పాలసీని రూపొందించేందుకు సలహాలు ఇవ్వాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది.
“ఈ తీర్పును పాన్-ఇండియాకు విస్తరిస్తున్నాము. పశుసంరక్షణ శాఖ, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, సెక్రటరీలు ఏబీసీ నిబంధనలపై సమాచారం సేకరించాలి. ఈ వ్యవహారంపై పెండింగ్‌లో ఉన్న అన్ని పిటిషన్లను సేకరించాలి. వాటిని ఈ కోర్టుకు బదిలే చేస్తాము,” అని సుప్రీంకోర్టు వివరించింది.
అనంతరం తదుపరి విచారణను ఎనిమిది వారాలకు వాయిదా వేసింది.
వీధి కుక్కల బెడద, వాటి కాటు వల్ల పిల్లల్లో రేబీస్ వ్యాధి ప్రబలుతున్నట్లు ఒక మీడియా నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది. జులై 28న సుమోటోగా కేసు నమోదు చేసుకున్న ధర్మాసనం ఆగస్ట్ 11న సంచలనాత్మక ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు ప్రకారం.. దిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి వీధి కుక్కలను తక్షణమే పట్టుకుని, వాటిని డాగ్ షెల్టర్లకు తరలించాలని అధికారులను ఆదేశించింది.
సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలు దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకతకు దారితీశాయి. జంతు సంక్షేమ కార్యకర్తలు ఈ ఆదేశాలు అమానవీయమని విమర్శించారు. వీధి కుక్కల సమస్యకు వ్యాక్సినేషన్, వాటికి శస్త్రచికిత్సలు (న్యూటరింగ్) చేయడం వంటి మానవతా దృక్పథంతో కూడిన పరిష్కారాలను సూచించారు.
కార్యకర్తలు, రాజకీయ నాయకులు, చాలా మంది వెటర్నరీ వైద్యులు కుక్కల జనాభాను స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ ద్వారా నియంత్రించాలన్న సత్యాన్ని న్యాయమూర్తులు తగినంతగా పరిగణనలోకి తీసుకోలేదని ఆరోపించారు.
ఈ వారంలో ఒక బహిరంగ సమావేశంలో దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై గుజరాత్‌కు చెందిన ఒక కుక్క ప్రేమికుడు శారీరకంగా దాడి చేశాడు. వీధి కుక్కలను పట్టుకోవాలని ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశంతో ఏకీభవించడం తనను కోపం తెప్పించిందని చెప్పాడు.
మరోవైపు, కుక్కలను పట్టుకోవడానికి వచ్చిన ప్రభుత్వ బృందాలతో కొందరు వ్యక్తులు ఘర్షణపడి, పట్టుబడిన కుక్కలను విడిపించేందుకు ప్రయత్నించిన సంఘటనలు కూడా జరిగాయి. ఇలాంటి కేసుల్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదయ్యాయి.
కాగా.. వీధి కుక్కల వివాదంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ ఈ విషయంపై స్పందిస్తూ.. "ఈ సమస్యను పరిశీలిస్తాను," అని అన్నారు. దీనితో ఈ సుమోటో కేసుతో పాటు వీధి కుక్కలకు సంబంధించిన కొన్ని ఇతర పిటిషన్లను విచారించడానికి ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటైంది.
ఆగస్ట్ 14న విచారణ జరిపిన ఈ ముగ్గురు సభ్యుల ప్రత్యేక ధర్మాసనం.. దిల్లీ-ఎన్సీఆర్లో వీధి కుక్కల సమస్యకు ప్రధాన కారణం స్థానిక అధికారుల "నిర్లక్ష్యం" అని వ్యాఖ్యానించింది. కుక్కల స్టెరిలైజేషన్, టీకాలకు సంబంధించిన 'యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్'ను అమలు చేయడంలో అధికారులు "ఏమీ చేయలేదని" ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆగస్ట్ 11న జారీ చేసిన ఆదేశాలపై స్టే విధించాలన్న మధ్యంతర అభ్యర్థనపై తీర్పును రిజర్వ్ చేసింది.
అనంతరం వీధి కుక్కల వివాదంపై శుక్రవారం కీలక తీర్పును వెలువరించింది.
సంబంధిత కథనం