Supreme Court : యూపీ మదర్సా చట్టాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు.. కీలక కామెంట్స్.. హైకోర్టు తీర్పు కొట్టివేత
supreme court on up madarsa act : ఉత్తరప్రదేశ్ మదర్సా చట్టాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. మదర్సా చట్టం పూర్తిగా రాజ్యాంగం కింద ఉందని తాము నమ్ముతున్నామని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం పేర్కొంది. హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది.
ఉత్తరప్రదేశ్ మదర్సా చట్టాన్ని రాజ్యాంగబద్ధమైనదిగా సుప్రీంకోర్టు సమర్థించింది. మదర్సా చట్టం పూర్తిగా రాజ్యాంగం కింద ఉందని నమ్ముతున్నట్టుగా ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తెలిపింది. దాని గుర్తింపును కాదనలేమని చెబుతూ.. మదర్సాల్లో సరైన సౌకర్యాలు ఉండాలని, విద్యను పరిరక్షించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మదర్సా చట్టం రూపొందించిన స్ఫూర్తి, పాలనలో ఎలాంటి లోపం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. దీన్ని రాజ్యాంగ విరుద్ధం అనడం సరికాదని అభిప్రాయపడింది. ఈ క్రమంలో అలహాబాద్ హైకోర్టు తీర్పును సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. యూపీ మదర్సా చట్టం రాజ్యాంగ విరుద్ధమని గతంలో హైకోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే.
యూపీ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డు యాక్ట్ 2004 రాజ్యాంగ విరుద్ధమని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దాఖలైన అప్పీళ్లపై సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు వెలువరించనుంది. అన్ని పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు మదర్సా చట్టాన్ని సమర్థించింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వెలువరించిన ఈ తీర్పులో నాణ్యమైన విద్యను ప్రోత్సహించడంలో రాష్ట్ర ప్రయోజనాలకు, మైనారిటీ హక్కుల పరిరక్షణకు మధ్య సమతుల్యతను ఎత్తిచూపింది. ఇటువంటి నియంత్రణ మదర్సా వ్యవస్థను రద్దు చేయడం కంటే మద్దతు ఇవ్వడానికి లక్ష్యంగా ఉండాలని పేర్కొంది. 2004 నాటి చట్టాన్ని రెగ్యులేటరీ చట్టంగా రాజ్యాంగబద్ధమైన విద్యాహక్కును కల్పించే ఆర్టికల్ 21ఏ నిబంధనలకు అనుగుణంగా అర్థం చేసుకోవాలని పేర్కొంది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 30 ప్రకారం మతపరమైన మైనారిటీలు తమ సొంత విద్యా సంస్థలను నిర్వహించుకునే హక్కులను పరిరక్షిస్తూనే మదర్సాలపై ప్రభుత్వ పర్యవేక్షణను కొనసాగించడానికి ఈ చట్టం చెల్లుబాటు అవుతుందని జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. 2004 చట్టం లౌకికవాద సూత్రాలను ఉల్లంఘించిందని, రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని ఉల్లంఘించినందున చట్టాన్ని చెల్లదని ప్రకటించలేమని పేర్కొంది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం మదర్సాల నియంత్రణ జాతీయ ప్రయోజనాల కోసమేనని తెలిపింది. మైనారిటీల కోసం ఏకాంత ప్రదేశాలను సృష్టించడం ద్వారా దేశంలోని వందల ఏళ్ల ఉమ్మడి సంస్కృతిని నాశనం చేయలేమని పేర్కొంది. అంతేకాదు దేశంలో మతపరమైన విద్య ఎప్పుడూ శాపంగా మారలేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఉత్తరప్రదేశ్ మదర్సా చట్టం 2004ను రద్దు చేస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ అంజుమ్ ఖాద్రీ తదితరులు దాఖలు చేసిన అప్పీళ్లపై విచారణ చేసింది.