US elections 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో స్పేస్ లో ఉన్న సునీత విలియమ్స్ కూడా ఓటేస్తున్నారు.. ఎలాగో తెలుసా?
US elections 2024: 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. మిలియన్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ లో అంతరిక్షంలో ఉన్న సునీత విలియమ్స్ తో పాటు ఇతర అమెరికన్లు కూడా ఈ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారు.
US Presidential elections 2024: 2024 అమెరికా ఎన్నికల్లో లక్షలాది మంది అమెరికన్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ బూత్ లకు వెళుతున్నారు. మరోవైపు, వివిధ కారణాలతో విదేశాల్లో ఉన్న అర్హులైన అమెరికా ఓటర్లు కూడా ఆన్ లైన్, ఆఫ్ లైన్ లలో ఓటేసి తమ బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. అలాగే,
నాసా వ్యోమగాములు కూడా..
అదే విధంగా, వ్యోమగాములు అంతరిక్షంలో ఉన్నప్పుడు కూడా తమ పౌర కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి వీలు కల్పించే ప్రణాళికను నాసా రూపొందించింది. ఫిబ్రవరి వరకు అంతరిక్షంలోనే ఉండాల్సిన పరిస్థితిలో ఉన్న ఇద్దరు బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ సహా నలుగురు అమెరికన్లు ప్రస్తుతం అంతరిక్షంలో ఉన్నారని, వారు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని నివేదికలు సూచిస్తున్నాయి.
సునీత విలియమ్స్ ఓటు
భారత సంతతికి చెందిన అస్ట్రోనాట్ సునీత విలియమ్స్ అనుకున్న సమయానికి భూమికి తిరిగి వస్తే, ఈ ఎన్నికల్లో వ్యక్తిగతంగానే ఓటు వేేసే అవకాశం ఉండేది. కానీ, అనివార్య కారణాలతో ఆమె 2025 ఫిబ్రవరి వరకు అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ (ISS) లోనే ఉండాల్సి వస్తోంది. అందువల్ల, ఆమెకు స్పేస్ లో నుంచే ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ‘‘అంతరిక్షం నుంచి ఓటు వేయడానికి నేను ఎదురు చూస్తున్నాను. ఇది చాలా బాగుంది’’ అని ఆమె అన్నారు. ఐఎస్ఎస్ లో ఉన్న మరో వ్యోమగామి విల్మోర్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉత్సాహంగా ఉన్నానని చెప్పారు. ‘‘ఓటు వేయడం పౌరులుగా మనమందరం పోషించే చాలా ముఖ్యమైన పాత్ర. ఆ ఎన్నికల్లో పాల్గొనడం నాసా మాకు చాలా సులభం చేస్తుంది’’ అని ఆయన అన్నారు.
అంతరిక్షం నుంచి ఎలా ఓటు వేస్తారు?
అంతరిక్షంలోని వోమగ్యాములు ఓటు వేసే ఒక విధానాన్ని నాసా అభివృద్ధి చేసింది. ఇది ఇతర దేశాల్లోని అమెరికన్లు తాము ఉన్న ప్రదేశం నుంచే ఓటు వేసే వీలు కల్పించే ఆబ్సెంటీ ఓటింగ్ విధానం తరహాలోనే ఉంటుంది. స్పేస్ స్టేషన్ లోని వ్యోమగాములు వేసిన ఓటు 1.2 మిలియన్ మైళ్ల దూరం ప్రయాణించి టెక్సాస్ లోని నాసాకు చెందిన జాన్సన్ స్పేస్ సెంటర్ లోని మిషన్ కంట్రోల్ సెంటర్ కు చేరుకుంటుంది. వ్యోమగాములు ఆబ్సంటీ బ్యాలెట్ ను అభ్యర్థిస్తూ ఫెడరల్ పోస్ట్ కార్డ్ దరఖాస్తును నింపుతారు. దాంతో, వారికి ఎలక్ట్రానిక్ బ్యాలెట్ ను పంపిస్తారు. ఆ డాక్యుమెంట్ ను నింపి నాసా ట్రాకింగ్ అండ్ డేటా రిలే శాటిలైట్ సిస్టమ్ ముందుగా న్యూ మెక్సికోలోని ఏజెన్సీ టెస్ట్ ఫెసిలిటీలోని భారీ యాంటెనాకు పంపుతారు. అక్కడి నుండి, బ్యాలెట్ ను నాసా (NASA) మిషన్ కంట్రోల్ సెంటర్ కు పంపుతుంది. అది బ్యాలెట్ వేయడానికి బాధ్యత వహించే కౌంటీ క్లర్క్ కు ఆ ఓటును పంపుతుంది. గోప్యతను నిర్ధారించడానికి, బ్యాలెట్ ను ఎన్ క్రిప్ట్ చేస్తారు.
మొదటి వ్యోమగామి
డేవిడ్ వోల్ఫ్ 1997 లో అంతరిక్షంలో ఓటు వేసిన మొదటి వ్యోమగామిగా రికార్డు సృష్టించాడు. కేట్ రూబిన్స్ 2020 యుఎస్ ఎన్నికల సమయంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి ఓటు వేసిన చివరి వ్యోమగామి అని నాసా తెలిపింది.