Sunita Williams: సురక్షితంగా భూమికి చేరిన సునీతా విలియమ్స్, బారీ విల్మోర్.. 9 నెలలుగా అంతరిక్షంలో నిరీక్షణ..
Sunita Williams: అమెరికా వ్యోమగామి సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ తొమ్మిది నెలల నిరీక్షణ తర్వాత బుధవారం తెల్లవారు జామున సురక్షితంగా భూమిని చేరుకున్నారు.ఫ్లోరిడాలోని సముద్ర తీరంలో క్యాప్సూల్ ల్యాండైంది. సునీతా , విల్మోర్ సురక్షితంగా భూమికి తిరిగి రావడంతో ప్రపంచ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.
Sunita Williams: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 9 నెలలుగా చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమిని చేరారు. నిర్దేశించిన సమయం కంటే అధికంగా 9 నెలల పాటు ఐఎన్‌ఎస్‌లో చిక్కుకుపోయిన వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరారు.
తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో గడిపిన సునీతా, విల్మోర్ తర్వాత భూమికి తిరిగి వచ్చారు. నాసా వ్యోమగాములైన అమెరికన్ నిక్ హేగ్, రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్‌లతో కలిసి సునీతా, విల్మోర్‌లు మంగళవారం సాయంత్రం 5.57 గంటలకు (భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు) ఫ్లోరిడా తీరంలో సురక్షితంగా దిగారు.
వారు ప్రయాణించిన స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సూల్, 'ఫ్రీడమ్' భూవాతావరణం గుండా ప్రయాణించి, సుమారు 3,000 డిగ్రీల ఫారెన్ హీట్ ఉష్ణోగ్రతలను తట్టుకుని, గల్ఫ్ ఆఫ్ మెక్సికోలోకి ప్రవేశించింది.
రికవరీ నౌక క్యాప్సూల్‌ను వెలికితీసి హ్యూస్టన్ లోని నాసాకు చెందిన జాన్సన్ స్పేస్ సెంటర్ కు తరలించింది. వ్యోమగాములు మైక్రోగ్రావిటీలో సుదీర్ఘ కాలం పనిచేయడంతో గురుత్వాకర్షణకు అనుగుణంగా 45 రోజుల పునరావాస కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఉత్కంఠ రేపిన ప్రయాణం…
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరిన కొద్ది గంటల్లోనే వారి స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ పారాచూట్ ద్వారా గల్ఫ్ ఆఫ్ మెక్సికోలోకి ప్రవేశించింది. ఫ్లోరిడా పాన్ హాండిల్ లోని తల్లాహస్సీ తీరంలో స్ప్లాష్ డౌన్ కావడంతో వారి ప్రయాణానికి తెరపడింది.
గంట వ్యవధిలోనే వ్యోమగాములు తమ క్యాప్సూల్ నుంచి బయటకు వచ్చి కెమెరాల వైపు చూస్తూ చిరునవ్వులు చిందిస్తూ సాధారణ వైద్య పరీక్షల కోసం తరలి వెళ్లారు.
గత ఏడాది జూన్‌లో
2024 జూన్ 5న బోయింగ్ స్టార్ లైనర్ క్రూ క్యాప్సూల్ ప్రయోగించిన వారం రోజుల తర్వాత వీరిద్దరూ తిరిగి భూమికి చేరాల్సి ఉంది. అక్కడకు చేరిన తర్వాత అంతరిక్ష కేంద్రానికి వెళ్ళే మార్గంలో అనేక సమస్యలు తలెత్తాయి, చివరికి వ్యోమగాములు లేకుండానే నాసా స్టార్ లైనర్ ఖాళీగా వెనక్కి వచ్చింది. ఐఎన్‌ఎస్‌లో చిక్కుకున్న టెస్ట్ పైలట్లను స్పేస్ ఎక్స్‌కు బదిలీ చేశారు. స్పేస్ ఎక్స్ క్యాప్సూల్‌లో తలెత్తిన సమస్యలు మరో నెల ఆలస్యం చేశాయి. ఆదివారం ఐఎన్‌ఎస్‌కు సహాయక సిబ్బంది రావడంతో విల్మోర్ , విలియమ్స్ తిరుగు ప్రయాణం మొదలైంది.
అంతరిక్షంలో 286 రోజులు…
విల్మోర్ మరియు విలియమ్స్ అంతరిక్షంలో 286 రోజులు గడిపారు - వారు ఐఎన్‌ఎస్‌కు వెళ్లినపుడు నిర్దేశించిన దానికంటే 278 రోజులు ఎక్కువ కాలం గడపాల్సి వచ్చింది. భూమిని 4,576 సార్లు చుట్టి, స్ప్లాష్ డౌన్ సమయానికి 121 మిలియన్ మైళ్ళు (195 మిలియన్ కిలోమీటర్లు) ప్రయాణించాయి. క్యాప్సూల్ భూమికి చేరడంతో 'స్పేస్ఎక్స్ తరఫున వెల్కమ్ హోమ్' అని కాలిఫోర్నియాలోని స్పేస్ఎక్స్ మిషన్ కంట్రోల్ రేడియోలో పేర్కొంది. ప్రతిగా "వాట్ ఎ రైడ్" క్యాప్సూల్ కమాండర్ హేగ్ జవాబిచ్చాడు.
రికవరీ నౌకపైకి ఎగరడానికి డైవర్లు సిద్ధంగా ఉండగా సముద్రంలో డాల్ఫిన్లు క్యాప్సూల్ చుట్టూ ప్రదక్షిణలు చేశాయి. సురక్షితంగా విమానం ఎక్కిన తర్వాత సైడ్ హ్యాచ్ ను తెరిచి వ్యోమగాములను ఒక్కొక్కరిగా బయటకు తీసుకొచ్చారు. విలియమ్స్ తర్వాతి స్థానంలో విల్మోర్ ఉన్నాడు.
ఊహించని మలుపులు…
బుచ్ విల్మోర్ మరియు సునీతా విలియమ్స్ గత ఏడాది జూన్‌లో బోయింగ్ స్టార్ లైనర్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఐఎస్ఎస్ వ్యోమనౌక భద్రత పరీక్షించడానికి 8 రోజుల వ్యవధితో చేపట్టిన మిషన్ ఏకంగా 9 నెలల పాటు సాగింది. ప్రొపల్షన్ లోపాల వల్ల స్పేస్ క్రాఫ్ట్ ఖాళీగా వెనక్కి రావాల్సి వచ్చింది. దీంతో వ్యోమగాములు ఊహించని విధంగా అంతరిక్షంలో చిక్కుకుపోయారు.
రెస్క్యూ మిషన్ వేగవంతం చేయడానికి నాసా గత సెప్టెంబర్‌లో స్పేస్ఎక్స్ క్రూ -9 మిషన్‌కు ఐఎన్‌ఎస్‌లో చిక్కుకున్న జంటను సురక్షితంగా వెనక్కి రప్పించే బాధ్యత అప్పగించారు. మరోవైపు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న వారి దుస్థితి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. "పనిలో చిక్కుకుపోయింది" అనే పదానికి సునీత కొత్త అర్థాన్ని ఇచ్చారు.
సునీత స్వస్థలంలో ప్రార్థనలు…
నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి తిరిగి వస్తున్న సమయంలో, గుజరాత్‌లోని ఆమె కుటుంబ సభ్యులు ఆమె క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థనలు చేస్తున్నారు.
సునీత బంధువు దినేష్ రావల్ మంగళవారం అహ్మదాబాద్ లో యాగాన్ని నిర్వహించారు, "సునీత క్షేమంగా రావాలని కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తున్నారు. ఆమె తిరిగి రావడం పట్ల అందరూ సంతోషంగా ఉన్నారు.
ఏఎన్ఐ వార్తాసంస్థతో మాట్లాడిన సునీత బంధువులు, “మేము చాలా దూరంలో ఉన్నప్పటికీ, ఆమె క్షేమంగా రావాలని మేమంతా కలిసి దేవుడిని ప్రార్థిస్తున్నాము. ఆమె వస్తోంది, అందుకే మేమంతా సంతోషంగా ఉన్నాం. వారిని సురక్షితంగా భూమ్మీదకు తీసుకురావాలని మిత్రులందరితో కలిసి భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు ” తెలిపారు.
సునీతా విలియమ్స్ క్షేమంగా భూమ్మీదకు రావాలని దేశ వ్యాప్తంగా ప్రజలు ప్రార్థిస్తున్నారు. నాసా వ్యోమగామి క్షేమంగా స్వదేశానికి చేరుకోవాలని ఆమె స్వగ్రామం ఝులాసన్ లో స్థానికులు 'హవన్ ' నిర్వహించారు. ఝులాసన్ లోని డోలా మాతా ఆలయంలో కూడా ప్రార్థనలు నిర్వహించారు.
సంబంధిత కథనం
టాపిక్