Sunita Williams : భారత్‌లోని ఈ చిన్న గ్రామంతో సునితా విలియమ్స్‌కి పెద్ద కనెక్షన్..
Sunita Williams Indian connection : భారత్‌లోని ఒక చిన్న గ్రామంతో సునితా విలియమ్స్‌కి పెద్ద కనెక్షన్ ఉంది. ఆ గ్రామం గుజరాత్‌లోని ఝులసన్! సునితా విలియమ్స్ ఇక్కడికి మూడుసార్లు వెళ్లారు.
అంతరిక్షంలో అద్భుతాలు సృష్టించి, ఎన్నో రికార్డులు సాధించిన సునితా విలియమ్స్ ఒక భారత సంతతి మహిళ కావడం భారతీయులకు నిజంగా గర్వకారణం. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా, సునితా మాత్రం తన మూలాలను మర్చిపోలేదు. అంతరిక్షంలో 9 నెలల పాటు చిక్కుకుపోయిన ఆమె, ఇంకొన్ని గంటల్లో భూమి మీదకు తిరిగి వస్తున్న నేపథ్యంలో భారత్‌లోని ఒక చిన్న గ్రామంతో సునితా విలియమ్స్‌కి ఉన్న పెద్ద కనెక్షన్ గురించి ఇక్కడ తెలుసుకోండి..
మూలాలను మర్చిపోని సునితా విలియమ్స్..
1965 సెప్టెంబర్ 19న అమెరికా ఓహాయోలోని యూక్లిడ్లో జన్మించారు సునితా విలియమ్స్. ఆమె తండ్రి పేరు దీపక్ పాండ్య. ఆయన గుజరాత్లో ఒక న్యూరోసైంటిస్ట్. 1957లో అమెరికాకు వలస వెళ్లిపోయారు. అక్కడే స్లొవీన్ అమెరికన్ ఉర్సులీన్ బానీని కలిసి, వివాహం చేసుకున్నారు.
అయితే, సునితా విలియమ్స్ తండ్రి స్వస్థలం గుజరాత్‌లోని ఝులసన్ అనే చిన్న గ్రామం. ఈ గ్రామంలో సుమారు 7వేల మంది ఉంటారు. సునితా విలియమ్స్ సాధించిన ఘనతలు చూసి ఇక్కడి వారందరు గర్వపడుతుంటారు.
అంతేకాదు, ఈ గ్రామంలోని ఒక లైబ్రెరీకి సునితా విలియమ్స్ పూర్వికుల పేరు ఉంటుంది. దీపక్ పాండ్య తండ్రి, తాత ఇల్లు ఇప్పటికీ ఉంది.
సునితా విలియమ్స్ మాత్రం తన మూలలను ఎప్పుడు మర్చిపోలేదు! నివేదికల ప్రకారం.. స్పేస్ మిషన్స్ పూర్తి చేసుకున్న తర్వాత సునితా విలియమ్స్ 1972, 2007, 2013లో ఝులసన్ గ్రామాన్ని సందర్శించారు. ఇక్కడి స్కూల్‌కి డొనేషన్లు కూడా ఇచ్చారు. ఆ స్కూల్లోని ప్రేయర్ హాల్లో సునితా విలియమ్స్ తాత-నానమ్మల ఫొటోలు ఇప్పటికీ ఉన్నాయి.
జూన్ 2024లో అంతరిక్షంలోకి వెళ్లిన సునితా విలియమ్స్, అక్కడే చిక్కుకుపోయారని తెలిసిన ఝులసన్ గ్రామస్థులు చాలా బాధపడ్డారు. ఆమె సురక్షితంగా భూమికి తిరిగిరావాలని అప్పటి నుంచి ప్రార్థనలు చేస్తూ, ప్రతి రోజు దీపం వెలిగిస్తున్నారు.
ఇంకొన్ని గంటల్లో భూమి మీదకు సునితా విలియమ్స్..
గత ఏడాది జూన్ నుంచి సునితా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఐఎస్ఎస్లో ఉన్న విషయం తెలిసిందే. బోయింగ్ స్టార్‌లైనర్‌ని పరీక్షించిన తొలి వ్యోమగాములుగా విల్మోర్, విలియమ్స్ జూన్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. అయితే, ప్రొపల్షన్ సిస్టమ్ పనిచేయకపోవడం వల్ల వారు స్పేస్‌క్రాఫ్ట్‌లో తిరిగి రావడం చాలా ప్రమాదకరంగా మారింది. అందుకే ఐఎస్ఎస్లో ఉండిపోయారు. వారిని అంతరిక్షంలోకి తీసుకెళ్లిన బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్ క్యాప్సూల్ గత ఏడాదే భూమికి తిరిగి వచ్చింది. దీనికి బదులుగా స్పేస్ఎక్స్ క్యాప్సూల్‌లో వారిని భూమి మీదకు రప్పించాలని నాసా నిర్ణయించింది.
ఈ మేరకు ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి స్థానిక కాలమానం ప్రకారం రాత్రి మార్చ్ 14 రాత్రి 7.03 గంటలకు క్రూ-10 మిషన్‌లో భాగంగా ఫాల్కన్ 9 రాకెట్ నలుగురు సభ్యుల బృందంతో నింగిలోకి ఎగిరింది. ఆ తర్వాతి రోజు అది ఐఎస్ఎస్కు చేరింది.
ఇక స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5 గంటల 57 నిమిషాలకు గల్ఫ్ ఆఫ్ మెక్సికో తీరం వద్ద దిగనున్నారు సునితా విలియమ్స్, బుచ్ విల్మోర్.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం