Aayushi Murder Case: పరువు హత్య!.. ఆ అమ్మాయిని చంపింది తండ్రే: పోలీసులు-suitcase murder case man shot daughter wife helped up police revealed ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Suitcase Murder Case Man Shot Daughter Wife Helped Up Police Revealed

Aayushi Murder Case: పరువు హత్య!.. ఆ అమ్మాయిని చంపింది తండ్రే: పోలీసులు

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 21, 2022 06:41 PM IST

Aayushi Chaudhary Murder Case: సూట్‍కేస్‍లో లభ్యమైన అమ్మాయి మృతదేహం కేసులో మిస్టరీ వీడింది. ఆమెను చంపింది తండ్రేనని పోలీసులు వెల్లడించారు. దీన్ని పరువు హత్యగా పేర్కొన్నారు.

Aayushi Murder Case: పరువు హత్య!.. ఆ అమ్మాయిని చంపింది తండ్రే: పోలీసులు (ANI)
Aayushi Murder Case: పరువు హత్య!.. ఆ అమ్మాయిని చంపింది తండ్రే: పోలీసులు (ANI) (ANI)

Aayushi Murder Case: ఉత్తర ప్రదేశ్‍లో మరో విస్మయకర సంఘటన వెలుగులోకి వచ్చింది. మథురలోని యమునా ఎక్స్ ప్రెస్ వే (Yamuna Expressway) సమీపంలో సూట్‍కేస్‍లో గత వారం ఓ అమ్మాయి మృతదేహం లభ్యమైంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేశారు. ఈ సందర్భంగా విస్తుగొలిపే నిజాలు బయటికి వచ్చాయి. ఢిల్లీకి చెందిన ఆ 25 ఏళ్ల అమ్మాయిని చంపింది ఆమె తండ్రేనని ఉత్తర ప్రదేశ్ పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని మాయం చేసేందుకు ఆమె తల్లి కూడా సహకరించిందని తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మథురా పోలీసులు సోమవారం వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు

సూట్‍కేస్‍లో దొరికిన ఆ మృతదేహం సౌత్ ఢిల్లీలోని బదర్‍పురాకు చెందిన ఆయుషీ చౌదరిగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఆ అమ్మాయి తల్లిదండ్రులను అరెస్ట్ చేశారు. ఈ విషయాలను మథుర సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మార్తాండ్ పి.సింగ్ వెల్లడించారు. ఇది పరువు హత్య అని చెప్పారు. పూర్తి వివరాలివే..

Honor Killing: వేరే కులం అబ్బాయిని పెళ్లి చేసుకుందని!

తమకు చెప్పకుండా వేరే కులం అబ్బాయిని పెళ్లి చేసుకుందన్న కోపంతో కూతురు ఆయుషీ చౌదరిని తండ్రి నితేశ్ యాదవ్ చంపాడని పోలీసులు తెలిపారు. దీంతోపాటు కొంతకాలంగా ఇంటికి ఆయుషీ దూరంగా ఉండడం, రాత్రిళ్లు ఆలస్యంగా వస్తోందన్న కారణంగా తరచూ గొడవలు జరుగుతుండేవని తెలిపారు. ఈ కారణాలతో ఆయుషీని తండ్రి హతమార్చాడని పోలీసులు వెల్లడించారు. దీన్ని పరువు హత్యగా తేల్చారు. తుపాకీతో కాల్చి ఈ హత్య చేశాడని తెలిపారు.

సూట్‍కేస్‍లో ఆయుషీ మృతదేహాన్ని పెట్టేందుకు నితేశ్‍కు ఆయన భార్య కూడా సహకరించిందని పోలీసులు వెల్లడించారు. ఇద్దరూ కలిసే సూట్‍కేస్‍ను రహదారి పక్కన పడేసి పోయారని తెలిపారు.

Aayushi Murder Case: విచారణ ఇలా..

ఈనెల 18న మథుర సమీపంలోని యుమనా ఎక్స్ ప్రెస్ వే సమీపంలో పెద్ద ఎరుపు రంగు సూట్‍కేస్‍ను గుర్తించారు పోలీసులు. అందులో ఓ అమ్మాయి మృతదేహం లభ్యమైంది. సూట్‍కేస్‍ను స్వాధీనం చేసుకున్న తర్వాత సీసీ టీవీ ఫుటేజ్‍ను పోలీసులు పరిశీలించారు. అయితే ఆయుషీ గురించిన సమాచారాన్ని ఓ గుర్తు తెలియని కాల్ ద్వారా పోలీసులు ఆదివారం అందుకున్నారు. ఆ తర్వాత ఆయుషీ తల్లి, సోదరుడు మథుర పోలీసుల దగ్గరికి వచ్చారు.

మృతదేహాన్ని గుర్తు పట్టేందుకు వచ్చిన సమయంలో ఆయుషీ తండ్రిని పోలీసులు విచారించారు. అనంతరం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం, వేరే కులానికి చెందిన ఛత్రపాల్ అనే యువకుడిని ఇంట్లో తెలియకుండా ఆయుషీ వివాహం చేసుకుంది. దీంతో తండ్రి ఆమెను కాల్చి హత్య చేశాడు. ఆయుషీని నితేశ్ హత్య చేసిన విషయం ఆమె తల్లి, సోదరుడికి కూడా తెలుసని పోలీసులు చెప్పారు.

IPL_Entry_Point