CJI Chandrachud: సీజేఐ జస్టిస్ చంద్ర చూడ్ ను కూడా ట్రోల్ చేశారా?.. ఎవరు? ఎందుకు?
CJI Chandrachud: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్ర చూడ్ కూడా సోషల్ మీడియా ట్రోలింగ్ కు బలయ్యారా? ఆయనపై కూడా సోషల్ మీడియాలో అవాకులు, చవాకులు పేలారా?.. సీజేఐనే దారుణంగా దూషించారా?.. అవుననే అంటున్నారు సీజేఐ చంద్రచూడ్. అందుకు కారణమేంటో కూడా ఆయన వివరించారు.
CJI Chandrachud trolled: ఒక కేసు విచారణ సందర్భంగా కేవలం తన సీటింగ్ పొజిషన్ ను సర్దుబాటు చేసినందుకు తనను సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్ర చూడ్ వెల్లడించారు. తనను దుర్మార్గంగా దూషించిన సంఘటనను సీజేఐ డీవై చంద్రచూడ్ శనివారం గుర్తు చేసుకున్నారు.
సీట్ ను అడ్జస్ట్ చేసుకున్నానంతే..
బెంగళూరులో జరిగిన న్యాయాధికారుల ద్వైవార్షిక సదస్సులో సీజేఐ చంద్రచూడ్ (CJI Chandrachud) ఈ వివరాలను వెల్లడించారు. న్యాయాధికారులు తమ విధి నిర్వహణలో ఒత్తిళ్లను ఎలా ఎదుర్కోవాలనే విషయాన్ని వివరిస్తూ, ఈ విషయాన్ని జస్టిస్ చంద్రచూడ్ వెల్లడించారు. ‘‘నాలుగైదు రోజుల క్రితం ఓ కేసు విచారణ సందర్భంగా వెన్నులో కొద్దిగా నొప్పి వచ్చింది. దాంతో, నేను కూర్చునే పొజిషన్ ను మార్చుకున్నాను. ఆర్మ్ రెస్ట్ లపై చేతులు ఉంచి, కూర్చునే పొజిషన్ ను కొద్దిగా మార్చుకున్నాను. దాంతో, కోర్టులో ముఖ్యమైన వాదన మధ్య తాను లేచి వెళ్లినట్లు కొందరు సోషల్ మీడియా యూజర్లు తనపై అహంకారిగా ముద్ర వేశారు. నాపై కత్తులు దూయడం ప్రారంభించారు. దారుణంగా దూషించారు’’ అని సీజేఐ గుర్తు చేసుకున్నారు. అక్కడ అసలు జరిగిన విషయాన్ని దాచి పెట్టి, తమకు తోచిన రీతిలో ట్రోలింగ్ చేశారన్నారు.
సాధారణ పౌరులకు న్యాయం అందించడమే లక్ష్యం
‘‘న్యాయమూర్తిగా 24 సంవత్సరాల అనుభవం ఉంది. నేను కోర్టు నుంచి బయటకు రాలేదు. నేను నా సీట్ పొజిషన్ ను మార్చుకున్నాను, అంతే. దానికే, నేను తీవ్రమైన వేధింపులు, ట్రోలింగ్ కు గురయ్యాను" అని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ (CJI Chandrachud) విచారం వ్యక్తం చేశారు. ఈ ఒత్తిళ్ల మధ్యనే సాధారణ పౌరులకు శ్రద్ధగా సేవ చేయడానికి న్యాయవ్యవస్థ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. సాధారణ పౌరులకు న్యాయం అందించాల్సిన బాధ్యతను మోయాల్సిన తమ భుజాలు, అందుకు వీలుగా విశాలంగానే ఉన్నాయన్నారు. విధుల్లో ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పటికీ.. ప్రజలకు న్యాయం అందించే విషయంలో ముందుండాలని ఆయన న్యాయాధికారులకు సూచించారు. ఒత్తిడిని ఎదుర్కోవడం, వ్యక్తిగత - వృత్తిగత జీవితాల మధ్య సమతుల్యతను సాధించడం న్యాయాధికారులకు చాలా అవసరమన్నారు.