ఇజ్రాయెల్- ఇరాన్ ఉద్రిక్తతల మధ్య ముడి చమురు ధర పెరుగుతుందని ఆందోళనలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఇంధనాన్ని భారీ మొత్తంలో దిగుమతి చేసుకునే భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇరాన్ ఒక్క పని చేస్తే చాలు.. ప్రపంచానికి చమురు సప్లై భారీగా పడిపోవచ్చు. ధరలు అమాంతం పెరిగిపోవచ్చు. ఆ ఒక్కటి.. హార్ముజ్ జలసంధిని(స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్) మూసివేయండి! ఈ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ఎందుకు అంత కీలకమైనదో ఇక్కడ తెలుసుకోండి..
స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ఇరాన్- ఒమన్ మధ్య ఉంది. ఇది ఉత్తరాన ఉన్న గల్ఫ్‌ను దక్షిణాన ఉన్న ఒమన్ గల్ఫ్‌తో, ఆపైన అరేబియా సముద్రంతో కలుపుతుంది. సౌదీ అరేబియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఇరాక్‌లతో పాటు చమురు ఎగుమతి చేసే దేశాలు (ఒపెక్) సభ్యులు ఆసియాకు ముడి చమురును ఎగుమతి చేయడానికి దీనిని ఉపయోగిస్తాయి.
అయితే, సౌదీ అరేబియా, యూఏఈ ఈ జలసంధిని తప్పించుకోవడానికి ఇతర మార్గాలను కనుగొన్నాయి. కానీ ఇది మూసివేస్తే గణనీయమైన ప్రభావం కచ్చితంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
యూఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం, ప్రపంచ చమురు వినియోగంలో దాదాపు 20 శాతం ఈ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ద్వారానే వెళుతుంది. ఇది "ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన చమురు రవాణా చెక్‌పాయింట్," అని పేర్కొంది.
ఈ జలసంధి దాని ఇరుకైన ప్రదేశంలో 33 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. షిప్పింగ్ లేన్ ప్రతి దిశలో కేవలం మూడు కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. యూఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం, జలమార్గంలోని షిప్పింగ్ లేన్‌లు మరింత ఇరుకైనవిగా ఉంటాయి. దీనివల్ల అవి దాడులకు గురవుతుంటాయి.
జలసంధిని అడ్డుకుంటామని ఇరాన్ అనేక సంవత్సరాలుగా బెదిరిస్తోంది. కానీ ఆ బెదిరింపును ఎప్పుడూ అమలు చేయలేదు!
కానీ ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన మార్గమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ అడ్డుకోవాలని నిర్ణయించుకుంటే, ప్రపంచ చమురు ధరలు మరింత పెరగవచ్చు.
2024లో, ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్కి సమీపంలో ఇజ్రాయెల్‌కు సంబంధించిన కంటైనర్ నౌకను స్వాధీనం చేసుకుంది. 'ఎంఎస్సీ ఏరీస్' అనే ఈ ఇజ్రాయెల్‌కు చెందిన కార్గో నౌకలో 17 మంది భారతీయులు ఉన్నారన్నది గమనార్హం.
మరి ఇరాన్ తన బెదిరింపులను నిజం చేస్తుందా? లేక ఇజ్రాయెల్- ఇరాన్ ఉద్రిక్తతలు శాంతిస్తాయా అన్నది చూడాలి.
సంబంధిత కథనం