Stock Market today : స్టాక్‌మార్కెట్ల భారీ పతనం.. సెన్సెక్స్ 1447 పాయింట్లు డౌన్
స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ పతనాన్ని చవిచూశాయి. మార్కెట్ల ప్రి ఓపెనింగ్‌లో సెన్సెక్స్ 1118.83 పాయింట్లు, నిఫ్టీ 324 పాయింట్లు కోల్పోయాయి.
స్టాక్ మార్కెట్లు సోమవారం బేర్ గుప్పిట చిక్కాయి. అమెరికాలో మే నెలలో ద్రవ్యోల్భణం రేటు 40 ఏళ్ల గరిష్టానికి పెరిగిందని శుక్రవారం వెల్లడైన గణాంకాలు స్టాక్ మార్కెట్లను అతలాకుతలం చేశాయి. ఆర్థిక మాంద్యానికి సంకేతాలుగా వెలువడుతున్న గణాంకాలు ట్రేడర్లు, మదుపరులను కలవెరపెడుతుండడంతో మార్కెట్లు తీవ్రంగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.
సోమవారం ఉదయం మార్కెట్లు ప్రి ఓపెనింగ్ సమయంలో సెన్సెక్స్ 1118.83 పాయింట్ల మేర పడిపోయి 53,184.61 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 324.25 పాయింట్లు పడిపోయి 15,877.55 పాయింట్ల వద్ద స్థిరపడింది.
మార్కెట్లు ప్రారంభమయ్యాక ఉదయం 9.38 సమయంలో సెన్సెక్స్ 1447 పాయింట్లు కోల్పోయి 52,856 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
మార్కెట్లు ప్రారంభమయ్యాక ఉదయం 9.38 సమయంలో నిఫ్టీ 414 పాయింట్లు కోల్పోయి 15,783 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
తీవ్రంగా నష్టపోయిన ఈక్విటీల జాబితా (టాప్ లూజర్స్) లో హెచ్‌డీఎఫ్‌సీ, విప్రో, హిందాల్కో, కోటక్ మహీంద్రా, లార్సెన్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా తదితర స్టాక్స్ నిలిచాయి.
హిందాల్కో 4.65 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్4.62 శాతం, బజాజ్ ఫైనాన్స్ 4.11 శాతం, టాటా మోటార్స్ 3.95 శాతం, అదానీ పోర్ట్స్ 3.61 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 3.83 శాతం నష్టపోయాయి.
ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎస్‌బీఐ, లార్రసెన్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ తదితర స్టాక్స్ 3 శాతానికి పైగా నష్టపోయాయి.
నిఫ్టీ సూచీలో లాభపడిన స్టాక్స్ జాబితాలో సిప్లా మాత్రమే కనిపించింది.
ఉపసూచీల్లో నిఫ్టీ మిడ్‌క్యాప్ 1.97 శాతం నష్టపోయింది. నిప్టీ బ్యాంక్ 2.89 శాతం నష్టపోయింది. నిఫ్టీ ఆటో 1.56 శాతం నష్టపోయింది. నిఫ్టీ ఐటీ 2.73 శాతం నష్టపోయింది.
నిఫ్టీ ఫార్మా 0.29 శాతం నష్టపోయింది. నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ 0.72 శాతం నష్టపోయింది. నిఫ్టీ మెటల్ 2.02 శాతం నష్ట పోయింది. నిఫ్టీ రియాల్టీ 2.58 శాతం నష్టపోయింది.
శుక్రవారం భారతీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయిన సంగతి తెలిసిందే. సెన్సెక్స్ దాదాపు 1,016 పాయిట్లు కోల్పోయింది.