Steve Jobs' wife Laurene Powell: ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళా 2025లో ఆపిల్ సహ వ్యవస్థాపకుడు దివంగత స్టీవ్ జాబ్ భార్య లారెన్ పావెల్ జాబ్స్ అస్వస్థతకు గురయ్యారు. ఆమె అలర్జీతో బాధపడుతున్నారు. అయితే, కుంభమేళాలో మంగళవారం జరిగే కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటారని, గంగానదిలో పవిత్ర స్నానం ఆచరిస్తారని ఆధ్యాత్మిక గురువు స్వామి కైలాసానంద్ గిరి తెలిపారు.
పావెల్ మంగళవారం కుంభమేళాలో జరిగే సంప్రదాయ కార్యక్రమాల్లో పాల్గొంటారని స్వామి కైలాసానంద గిరి వివరించారు. "ఆమె (సంగమం వద్ద) స్నానం చేసే సంప్రదాయ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆమె ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ఆమెకు కొన్ని అలర్జీలు ఉన్నాయి. ఇంత రద్దీగా ఉండే ప్రదేశానికి ఆమె ఎప్పుడూ వెళ్లలేదు. ఆమె చాలా సింపుల్ గా ఉంటారు. పూజ సమయంలో ఆమె మాతోనే ఉండిపోయారు’’ అని ఆయన వివరించారు.
144 ఏళ్ల తర్వాత ఈ అరుదైన మహా కుంభమేళా జరుగుతోంది. ఈ మహాకుంభ్ 2025లో పాల్గొనేందుకు దివంగత స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్ జాబ్స్ జనవరి 13న ప్రయాగ్ రాజ్ కు చేరుకున్నారు. ఆమెకు ఆధ్యాత్మిక గురువు వ్యాసానంద్ గిరి ఆమెకు హిందూ నామం 'కమల ' అని నామకరణం చేశారు. తెల్లటి పొడవాటి దుస్తులు, నారింజ రంగు శాలువా ధరించిన పావెల్ జాబ్స్ ప్రార్థనల్లో పాల్గొన్నారు.
పవిత్ర మహా కుంభమేళాలో పాల్గొనడానికిి దేశ విదేశాల నుంచి భక్తులు, పర్యాటకులు తరలివస్తున్నారు. ఈ కుంభమేళా సజావుగా జరగడానికిి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంగా భావిస్తున్నారు. కుంభమేళా (maha kumbha mela 2025) ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలోని నాలుగు ప్రదేశాలలో ఒకదానిలో జరుగుతాయి. మహా కుంభమేళా సందర్భంగా సనాతన ధర్మానికి చెందిన 13 అఖాడాలకు చెందిన సాధువులు ఒక్కొక్కరుగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.