Parliament Building Inauguration: రూ.75 నాణెం ఆవిష్కరణ.. ప్రత్యేకతలివే..-special 75 rupees coin launched to mark parliament new building inauguration check details ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  Special 75 Rupees Coin Launched To Mark Parliament New Building Inauguration Check Details

Parliament Building Inauguration: రూ.75 నాణెం ఆవిష్కరణ.. ప్రత్యేకతలివే..

రూ.75 నాణెం ఆవిష్కరణ.. ప్రత్యేకతలివే..
రూ.75 నాణెం ఆవిష్కరణ.. ప్రత్యేకతలివే.. (AP)

Parliament Building Inauguration: రూ.75 నాణేన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. పార్లమెంటు నూతన భవనం ప్రారంభానికి గుర్తుగా ఈ నాణెం రూపొందింది.

Parliament Building Inauguration - 75 Coin: పార్లమెంటు నూతన భవనం ప్రారంభం సందర్భంగా ప్రత్యేకమైన ‘రూ.75 నాణెం’ ఆవిష్కృతమైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, లోక్‍సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివర్ష్ నారాయణ్ సింగ్.. పార్లమెంటు కొత్త భవనంలో ఈ నాణేన్ని ఆవిష్కరించారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని దేశం జరుపుకుంటున్న సందర్భంగానూ ఈ నాణేన్ని తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక స్టాంప్‍ను కూడా ఆవిష్కరించారు. పార్లమెంటు నూతన భవనం ప్రారంభోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమంలో జరిగింది. రూ.75 నాణెం విశేషాలు ఇక్కడ చూడండి.

ట్రెండింగ్ వార్తలు

నాణేనికి రెండు వైపులా ఇలా..

రూ.75 నాణెం ఒకవైపున మధ్యలో ఆశోక స్థూపంలో ఉండే సింహాల గుర్తు ఉంది. దాని కింద ‘సత్యేమేవ జయతే’ అని రాసి ఉంది. అశోక స్తంభానికి ఎడమ వైపున దేవనాగరి లిపిలో ‘భారత్’ అని, కుడి అంచున ‘INDIA’ అనే పదం ఉంది. సింహాల గుర్తు కింద 75 అని నాణెం విలువను సూచించే ‘75’ సంఖ్య ఉంది. నాణేనికి రెండో వైపున పార్లమెంటు నూతన భవనం చిత్రం ఉంది. ఆ చిత్రంపైన ‘సన్సి సన్‍కుల్’ అని దేవనాగరి లిపిలో ఉంది. ఇక ఆ చిత్రం కింద 'PARLIAMENT COMPLEX' అని రాసి ఉంది. అలాగే పార్లమెంటు కాంప్లెక్స్ చిత్రం కింద 2023 అని కూడా ఉంది.

కొలతలు, బరువు

ఈ రూ.75 నాణెం 44 మిల్లీమీటర్ల వ్యాసంతో వృత్తాకారంలో ఉంది. 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్‍లతో ఈ నాణెం తయారైంది. ఈ నాణెం చుట్టూ 200 వంకీలు ఉన్నాయి. మొత్తంగా ఈ నాణెం బరువు 35 గ్రాములుగా ఉంది. ప్రత్యేక నాణెం కాబట్టి ఇది చెలామణిలో ఉండదు. మామూలు నాణేల్లాగా వినియోగంలో ఉండవు. సేకరణకు ఇవి అందుబాటులో ఉంటాయి. పరిమిత సంఖ్యలోనే ఇవి రూపొందుతాయి. హైదరాబాద్ మింట్, కోల్‍కతా మింట్, ముంబై మింట్ అనే ప్రభుత్వ అధికారిక వెబ్‍సైట్లలో వీటిని ఆన్‍లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

పార్లమెంటు నూతన భవనాన్ని ఆదివారం ఉదయం ప్రారంభించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. జాతికి అంకితం చేశారు. అనంతరం పార్లమెంటులో స్పీకర్ స్థానానికి సమీపంలో చారిత్రక ‘సెంగోల్‍’ ప్రతిష్టాపన చేశారు. పార్లమెంటు కొత్త భవనంలో మధ్యాహ్నం తొలి ప్రసంగం చేశారు. ఇది భవనం కాదని, 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు, కలలకు ప్రతిబింబమని అన్నారు.

పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవానికి 25 పార్టీల నేతలు హాజరయ్యారు. అయితే, రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడాన్ని వ్యతిరేకిస్తూ 20 ప్రతిపక్షాలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాయి.

సంబంధిత కథనం