Sunita Williams : సునితా విలియమ్స్​ రాక మరింత ఆలస్యం! ఆగిపోయిన కీలక స్పేస్​ఎక్స్​ మిషన్​-spacex delays iss mission to bring stuck nasa astronaut sunita williams home ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sunita Williams : సునితా విలియమ్స్​ రాక మరింత ఆలస్యం! ఆగిపోయిన కీలక స్పేస్​ఎక్స్​ మిషన్​

Sunita Williams : సునితా విలియమ్స్​ రాక మరింత ఆలస్యం! ఆగిపోయిన కీలక స్పేస్​ఎక్స్​ మిషన్​

Sharath Chitturi HT Telugu

sunita williams return : అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునితా విలియమ్స్​, బుచ్​ విల్మోర్​లకు షాక్​! చివరి నిమిషంలో లాంచ్ ప్యాడ్ సమస్య కారణంగా క్రూ-10 ప్రయోగాన్ని రద్దు చేసింది స్పేస్​ఎక్స్​. ఫలితంగా వ్యోమగాలు రాక మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ఐఎస్​ఎస్​లో సునితా విలియమ్స్​, బుచ్​ విల్మోర్​.. (AFP)

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అనేక నెలల పాటు చిక్కుకుపోయి, ఇంకొన్ని రోజుల్లో భూమికి తిరిగి రావాల్సిన వ్యోమగాములు సునితా విలియమ్స్​, బుచ్​ విల్మోర్​లకు మరో షాక్​! వారిని భూమికి తిసుకొచ్చేందుకు బయలుదేరాల్సిన స్పేస్​ఎక్స్​ మిషన్​.. చివరి నిమిషంలో ఆగిపోయింది. రాకెట్ లాంచ్​ప్యాడ్​లో చివరి నిమిషంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో బుధవారం క్రూ-10 ప్రయోగాన్ని వాయిదా వేసింది స్పేస్​ఎక్స్.

స్పేస్​ఎక్స్​ క్రూ-10కి ఏమైంది?

బోయింగ్​కు చెందిన స్టార్​లైనర్​లో ప్రయాణించిన తర్వాత వ్యోమగాములు సునితా విలియమ్స్​, బుచ్​ విల్మోర్​లు తొమ్మిది నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ప్లాన్​ ప్రకారం.. అనుభవజ్ఞులైన అయిన వ్యోమగాములు కేవలం ఎనిమిది రోజులు మాత్రమే ఐఎస్ఎస్​లో ఉండాలి. కానీ ఇప్పుడు 9 నెలలు దాటేసింది. వారిని అంతరిక్షంలోకి తీసుకెళ్లిన బోయింగ్​కు చెందిన స్టార్​లైనర్ క్యాప్సూల్ గత ఏడాదే భూమికి తిరిగి వచ్చింది.

ఇద్దరు అమెరికా వ్యోమగాములు, జపాన్, రష్యాకు చెందిన ఒక్కొక్క వ్యోమగాములతో కూడిన నలుగురు సభ్యుల బృందంతో కేప్ కెనవెరాల్​లోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్​ఎక్స్ క్రూ-10 రాకెట్​ని స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 7.48 గంటలకు ప్రయోగించాల్సి ఉంది. కానీ.. కౌంట్​డౌన్​ సమయంలో రాకెట్​ లాంచ్​ని రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. హైడ్రాలిక్​ సిస్టెమ్​లో సమస్యలు ఇందుకు కారణం. ఈ రాకెట్​ లాంచ్​ మళ్లీ ఎప్పుడు ఉంటుందో స్పేస్​ఎక్స్​ ప్రకటించలేదు!

స్పేస్​లో చిక్కుకుపోయిన వ్యోమగాములను త్వరగా తీసుకురావాలని అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​, స్పేస్​ఎక్స్​ సీఈఓ ఎలాన్​ మస్క్​ విజ్ఞప్తి చేయడంతో.. ఈ రాకెట్​ లాంచ్​ని రెండు వారాల ముందుకు తీసుకొచ్చింది నాసా.

తొలుత మార్చ్​ 26న క్రూ-10 ప్రయోగాన్ని నాసా షెడ్యూల్ చేసింది. కానీ రెడీగా ఉన్న స్పేస్​ఎక్స్ క్యాప్సూల్​ని స్వాప్​ చేయడం ద్వారా మిషన్​ను వేగవంతం చేసింది. కొత్త సిబ్బంది ఐఎస్ఎస్​కి చేరుకున్న తర్వాత, విల్మోర్- విలియమ్స్, నాసా వ్యోమగామి నిక్ హేగ్, రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్.. ఇప్పటికే సెప్టెంబర్​ నుంచి ఐఎస్​ఎస్​లో ఉన్న (క్రూ -9 మిషన్​) క్యాప్సూల్​ ఉపయోగించి భూమికి తిరిగి వస్తారు.

స్పేస్​ఎక్స్​ని నాసా ఎందుకు ఎంచుకుంది?

బోయింగ్ స్టార్​లైనర్​ని పరీక్షించిన తొలి వ్యోమగాములుగా విల్మోర్, విలియమ్స్ జూన్​లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. అయితే, ప్రొపల్షన్ సిస్టమ్ పనిచేయకపోవడం వల్ల వారు స్పేస్​క్రాఫ్ట్​లో తిరిగి రావడం చాలా ప్రమాదకరంగా మారింది. అందుకే ఐఎస్​ఎస్​లో ఉండిపోయారు. దీనికి బదులుగా స్పేస్​ఎక్స్ క్యాప్సూల్​లో వారిని భూమి మీదకు రప్పించాలని నాసా నిర్ణయించింది.

స్టార్​లైనర్​ అభివృద్ధి 2019 నుంచి నిరంతర సాంకేతిక సమస్యలు, బడ్జెట్ పెరుగుదలను ఎదుర్కొంది. ఇది ప్రోగ్రామ్​ని గణనీయంగా ఆలస్యం చేసింది. దీనికి విరుద్ధంగా, కనీసం 4 బిలియన్ డాలర్ల విలువైన నాసా ఒప్పందం కింద అభివృద్ధి చేసిన స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్ చాలా సంవత్సరాలుగా పనిచేస్తోంది. ప్రస్తుతం ఐఎస్ఎస్​కి సిబ్బందిని పంపించేందుకు ఉపయోగంలో ఉన్న ఏకైక యూఎస్ వ్యోమనౌకగా ఈ స్పేస్​ఎక్స్​ క్రూ డ్రాగన్​.

చాలా నెలల తర్వాత భూమి మీదకు తిరిగి వస్తుండటంతో సునీతా విలియమ్స్​ చాలా ఎగ్జైట్​ అయ్యారు. కానీ ఇప్పుడు మిషన్​ వాయిదా పడింది!

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.