నైరుతి రుతుపవనాలు కేరళను శనివారం తాకాయి! సాధారణంగా జూన్ మొదటి వారంలో దేశాన్ని తాకే రుతుపవనాలు ఈసారి మే 27నే వస్తాయని ఐఎండీ (భారత వాతావరణశాఖ) తొలుత అంచనా వేసింది. ఇక 24 గంటల్లో కేరళను తాకుతాయని ఐఎండీ వెల్లడించింది. అక్కడి నుంచి కొన్ని గంటల్లోనే, రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయని ఒక ప్రకటన చేసింది. రుతుపవనాలు ఇంత త్వరగా కేరళను తాకడం 16ఏళ్లల్లో ఇదే తొలిసారి!
కేరళలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా రుతుపవనాలు కేరళను త్వరగా తాకేందుకు ఈసారి అన్ని సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకే ఈసారి రుతుపవనాలు త్వరగా రాష్ట్రంలోకి ప్రవేశించిన్నట్టు ఐఎండీ వెల్లడించింది.
భారత వాతావరణశాఖ ప్రకారం.. చివరిసారిగా 2001, 2009లో మే 23వ తేదీన రుతుపవనాలు కేరళను తాకాయి. కాగా 1918 మే 11న రుతుపవనాలు రాష్ట్రానికి చేరుకున్నాయి. ఇక 1972 ఏడాదిలో జూన్ 18న నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఇదే అత్యంత ఆలస్యమైన రాక! గడిచిన 25ఏళ్లల్లో చూసుకుంటే మాత్రం 2016 జూన్ 9న.. 9 రోజుల ఆలస్యంతో ఎంట్రీ ఇచ్చాయి.
రుతుపవనాల ఎంట్రీతో దక్షణాధి రాష్ట్రాలైన కేరళ, కర్ణాటకతో పాటు కోంకణ్- గోవా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది.
మరీ ముఖ్యంగా కేరళ, కర్ణాటకలో మే 29 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఐఎండీ పేర్కొంది. ఈ సమయంలో గంటకు 40-50 కేఎంపీహెచ్ వేగంతో గాలులు వీస్తాయని వివరించింది.
ఐఎండీ ప్రకారం.. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా రానున్న ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయి.
వివిధ ప్రాంతాల్లో ఐఎండీ వర్ష సూచనకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
సాధారణంగా మే నెల అంటే భానుడి భగభగలకు ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. కానీ ఈసారి దేశంలోని అనేక ప్రాంతాల్లో ఎండా కాలంలోనూ వర్షాలు పడ్డాయి. ఇక రుతుపవనాలు తొందరగా వస్తుండటంతో తెలంగాణలోని అనేక చోట్ల ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్లో శుక్రవారం నాడు ఉష్ణోగ్రతలు 7-8 డిగ్రీల సెల్సియస్ వరకు డ్రాప్ అయ్యాయి. గరిష్ఠ ఉష్ణోగ్రత 32.2 డిగ్రీలుగా నమోదైంది. సాధారణంతో పోల్చుకుంటే ఇది 7.8 డిగ్రీలు తక్కువ!
రానున్న ఏడు రోజుల పాటు హైదరాబాద్లో ఆకాశం మేఘావృత్తమై ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. మధ్య మధ్యలో వర్షాలు పడతాయని వివరించింది.
సంబంధిత కథనం