Southwest Monsoon: ముందుగానే 'తొలకరి జల్లు'... కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు
IMD: అనుకున్న సమయం కంటే ముందే నైరుతి ఆగమనం చేసింది. ఇవాళ కేరళను తాకినట్లు వాతావరణశాఖ ప్రకటించింది. ఫలితంగా జూన్ 1 నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
India Meteorological Department: తొలకరి జల్లు ముందుగానే పలకరించే అవకాశం ఉంది. కొద్దిరోజులుగా చరుకుగా విస్తరిస్తున్న నైరుతి రుతపవనాలు... ఇవాళ కేరళను తాకాయి. జూన్ మొదటి వారంలో వస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేసినప్పటికీ.. 3 రోజులకు ముందుగానే కేరళలోకి ప్రవేశించాయని ప్రకటించారు.
జూన్ 1 నుంచి వర్షాలు...!
నైరుతి రుతుపవనాలు కేరళను తాకటంతో జూన్ 1 నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.తొలి రెండు రోజులు కేరళలో 2.5 మిల్లీమీటర్లకు మించి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో కేరళ, లక్షద్వీప్‌ల్లో ఉరుములు, మెరుపులతో ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇక రుతుపవనాల కారణంగా రానున్న ఐదు నుంచి ఏడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఒక మోస్తారు వర్షం పడొచ్చని ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇందుకు అరేబియా సముద్రం నుంచి వీచే పశ్చిమ గాలులు సహకరిస్తాయని వెల్లడించింది. మరోవైపు, వాయువ్య, మధ్య భారతదేశంలో మరో రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని, గరిష్ట ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల వరకు పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది.