South Korea Plane crash : దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179మంది దుర్మరణం- అసలు కారణం ఏంటి? లైవ్ వీడియో..
South Korea Plane crash death toll : దక్షిణ కొరియాలోని మువాన్ విమానాశ్రయంలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 179మంది మరణించారు. ఈ విషాదకర ఘటనలో కేవలం ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.
దక్షిణ కొరియా ఆధివారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 179మంది మరణించారు! ప్రమాదం సమయంలో 181మంది విమానంలో ఉండగా, కేవలం ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఈ వివరాలను దక్షిణ కొరియా ఎమర్జెన్సీ కార్యాలయం వెల్లడించింది.
అసలేం జరిగింది..?
జెజు ఎయిర్ విమానం థాయ్‌ల్యాండ్‌లోని బ్యాంకాక్ నుంచి మువాన్ నగరానికి తిరిగివచ్చింది. నగరంలోని విమానాశ్రయంలో ఆదివారం ల్యాండ్ అవుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అనంతం దట్టమైన నల్లటి పొగ ఆ ప్రాంతాన్ని అలముకుంది.
దక్షిణ కొరియా ప్రమాదం సమయంలో 175 మంది ప్రయాణికులు, ఆరుగురు ఫ్లైట్ అటెండెంట్లు ఉన్నారని యోన్హాప్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ ఘటనలో మృతుల సంఖ్యను తొలుత 28గా ప్రకటించారు. కానీ నిమిష నిమిషానికి మృతుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. చివరికి 179 మంది మరణించినట్టు అధికారులు వెల్లడించారు.
ప్రయాణికుల్లో ఇద్దరు థాయ్ జాతీయులు ఉన్నారని, మిగిలిన వారు దక్షిణ కొరియన్లని రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది.
దక్షిణ కొరియా విమాన ప్రమాదానికి అసలు కారణం ఏంటి?
ల్యాండింగ్ గేర్ సరిగ్గా లేకపోవడంతో విమానం రన్‌వేపై నుంచి జారి కంచెను ఢీకొట్టిందని యోన్ హాప్ వార్తా సంస్థ తెలిపింది. అగ్నిప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను పరిశీలిస్తున్నామని ఎమర్జెన్సీ అధికారులు తెలిపారు. ల్యాండింగ్ గేర్ తెరవకుండానే విమానం ల్యాండ్ అయ్యి చివరికి పేలిపోయిన దృశ్యాలు కనిపించాయి. అయితే విమానం రన్‌వే చివరకు చేరుకునే వరకు వేగాన్ని తగ్గించడంలో విఫలమైందని, ఎయిర్‌పోర్టు వెలుపలి అంచున ఉన్న గోడను ఢీకొట్టి పేలిపోయిందని వారు తెలిపారు.
నేషనల్ ఫైర్ ఏజెన్సీ 32 ఫైర్ ట్రక్కులు, పలు హెలికాప్టర్లను రంగంలోకి దింపింది. ఈ ఘటనతో మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలను నిలిపివేశారు.
మరోవైపు పక్షుల దాడి, ప్రతికూల వాతావరణం కూడా ఈ ఘోర ప్రమాదానికి కారణమై ఉండొచ్చని స్థానిక అగ్నిమాపక అధికారులు భావిస్తున్నారు.
విమాన ప్రమాదం జరిగిన కొంతసేపటికే జెజు ఎయిర్ ఒక ప్రకటన విడుదల చేసింది. "మువాన్ విమానాశ్రయంలో జరిగిన సంఘటనలో ప్రభావితమైన వారందరికీ మేము క్షమాపణలు చెబుతున్నాము," అని తెలిపింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని వివరించింది. జరిగిన బాధకు మనస్ఫూర్తిగా చింతిస్తున్నాము అని జెజు ఎయిర్ తన వెబ్సైట్లో పేర్కొంది.
విమాన ప్రమాదం జరగడం ఈ వారంలో ఇది రెండోది! బుధవారం కజకిస్థాన్‌లోని అక్తౌ సమీపంలో జరిగిన అజర్బైజాన్ ఎయిర్‌లైన్స్ విమాన ప్రమాదంలో 67 మందిలో 38 మంది మృతి చెందగా, మిగతా వారంతా గాయపడ్డారు.
సంబంధిత కథనం