తల్లితండ్రులు అమ్మేశారు- 5లక్షలు పెట్టి కొన్న వ్యక్తి రేప్ చేశాడు! న్యాయం కోసం 13ఏళ్ల బాలిక పోరాటం..
UP crime news : యూపీలో కౌశాంబికి చెందిన 13 ఏళ్ల బాలికను ఆమె తల్లిదండ్రులు ఓ వ్యక్తికి అమ్మేశారు! రూ. 5లక్షలు పెట్టి బాలికను కొన్న వ్యక్తి, ఆమెను పలుమార్లు రేప్ చేశాడు.
ఉత్తర్ ప్రదేశ్‌లో అత్యంత దారుణ, విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది! ఓ 13ఏళ్ల బాలికను ఆమె తల్లిదండ్రులు అమ్మేశారు. రూ. 5లక్షలు ఇచ్చి బాలికను కొనుకున్న వ్యక్తి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడి నుంచి తప్పించుకున్న ఆ బాధితురాలు వారందరిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది.
అసలేం జరిగిందంటే..
యూపీలోని కౌశాంబిలో జరిగింది ఈ ఘటన. 13 ఏళ్ల బాలికను తల్లిదండ్రులు గత నెలలో ఎటాలోని ఓ వ్యక్తికి రూ.5 లక్షలకు అమ్మేశారు. బాలికపై అతను మూడు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే బాలిక అతని చెర నుంచి తప్పించుకుని తన ఇంటికి తిరిగి వెళ్లింది. ‘నిన్ను అమ్మేశాము. నువ్వు అతని దగ్గరికి వెళ్లిపో,’ అని తల్లిదండ్రులు ఆమెను ఇంట్లోకి రానివ్వలేదు!
ఈ వ్యవహారంపై పంచాయతీ కూడా బాలికకు న్యాయం చేయలేకపోయింది. 25 రోజుల సమావేశాలు జరిగినా ఫలితం దక్కలేదు.
తల్లిదండ్రులు ఇంట్లోకి రానివ్వకపోవడంతో ఆ బాలిక మూడు వారాల పాటు తన అత్త ఇంట్లో ఉంది. పంచాయతీ ఏమీ తేల్చకపోవడంతో, ఆమెను ఆ బాలికను తీసుకుని పోలీస్ స్టేషన్‌కి వెళ్లడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు తల్లిదండ్రులు, కొనుగోలుదారు, మధ్యవర్తిపై పిల్లల అక్రమ రవాణా, అత్యాచారం సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీఓ మంఝాన్ పూర్ ఈ విషయాన్ని ధృవీకరించారు.
కరారీ ప్రాంతానికి చెందిన బాలిక తెలిపిన వివరాల ప్రకారం.. పొరుగు గ్రామమైన బిహారోజ్పూర్కు చెందిన కమలేష్ పాసి అనే వ్యక్తి ఈటా జిల్లాలోని రాజా కా రాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగ్లా రాంపూర్ గ్రామానికి చెందిన కర్మవీర్ యాదవ్ అనే వ్యక్తితో కలిసి తరచూ ఆమె ఇంటికి వచ్చేవాడు. మార్చ్ 14న కూడా వారిద్దరూ తన ఇంటికి వచ్చారని బాధితురాలు తెలిపింది. ఆ రోజు సాయంత్రం తల్లిదండ్రులు ఆమెకు ఆహారం ఇవ్వడంతో బాధితురాలు అపస్మారక స్థితిలోకి జారుకుంది. మరుసటి రోజు నిద్రలేచేసరికి ఆమె ఎటాలోని కర్మవీర్ యాదవ్ ఇంట్లో కనిపించింది.
బాధితురాలు ప్రశ్నించగా స్వయంగా తన తల్లిదండ్రుల నుంచి రూ.5 లక్షలకు కొనుగోలు చేసినట్లు కర్మవీర్ చెప్పాడు. బాలికను మూడు రోజుల పాటు తన ఇంట్లో బంధీగా ఉంచి కర్మవీర్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మార్చ్ 16వ తేదీ రాత్రి ఆ బాలికకు అవకాశం రావడంతో అక్కడి నుంచి పరారయ్యాడు.
ఆమె ఇంటికి చేరుకోగానే తల్లిదండ్రులు ఆమెను తీసుకునేందుకు నిరాకరించారు. తల్లిదండ్రుల ప్రవర్తనతో మనస్తాపానికి గురైన బాలిక మంఝాన్పూర్లోని అత్త ఇంటికి వెళ్లి అక్కడే ఉంటోంది.
అయితే ఈ విషయంపై గ్రామంలో 25 రోజుల పాటు పంచాయితీ కొనసాగింది. బాలిక కొనుగోలుదారుడితో వెళ్లాలని కొందరు ఒత్తిడి చేశారు. మరికొందరు నిందితులకు డబ్బు తిరిగి ఇవ్వాలని తల్లిదండ్రులకు చెప్పారు.
పంచాయితీ ఒక నిర్ణయానికి రాకపోవడంతో 26వ రోజైన ఆదివారం బాలిక తన అత్త, మామతో కలిసి కరారి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి కేసు నమోదు చేసింది.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మంజన్ పూర్ సీఐ శివాంక్ సింగ్ తెలిపారు. అయితే నిందితులను ఇంకా అరెస్ట్ చేయకపోవడం గమనార్హం.
సంబంధిత కథనం