Social media: ‘1947లో విడిపోయిన కుటుంబాలు సోషల్ మీడియా వల్ల మళ్లీ కలిశాయి..’-social media reunites sikh family separated at the time of partition ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  Social Media Reunites Sikh Family Separated At The Time Of Partition

Social media: ‘1947లో విడిపోయిన కుటుంబాలు సోషల్ మీడియా వల్ల మళ్లీ కలిశాయి..’

HT Telugu Desk HT Telugu
Mar 03, 2023 10:29 PM IST

Social media reunites Sikh family: సోషల్ మీడియా చేస్తున్నఅద్భుతాలు అన్నీ ఇన్ని కావు.. తాజాగా 1947లో దేశవిభజన సమయంలో విడిపోయిన అన్నదమ్ముల కుటుంబాలు సోషల్ మీడియా కారణంగా మళ్లీ ఒక్కటయ్యాయి.

కర్తార్పూర్ గురుద్వారా దర్బార్ సాహిబ్
కర్తార్పూర్ గురుద్వారా దర్బార్ సాహిబ్

Social media reunites Sikh family :1947లో దేశ విభజన కారణంగా విడిపోయిన కుటుంబాలెన్నో ఉన్నాయి. అలాంటి కుటుంబాల్లో ఒకటి హరియాణాకు చెందిన గురుదేవ్ సింగ్ ది. తమ్ముడి కుటుంబంతో మళ్లీ కలవాలన్న గురుదేవ్ సింగ్ ఆకాంక్ష ఇప్పటికి నెరవేరింది. కానీ గురుదేవ్ సింగ్ గత సంవత్సరమే చనిపోయారు.

ట్రెండింగ్ వార్తలు

1947 partition: 1947లో..

గురుదేవ్ సింగ్, దయా సింగ్ అన్నదమ్ములు. హరియాణాలోని మహేంద్రగఢ్ జిల్లాలో ఉన్న గోమ్లా గ్రామానికి చెందినవారు. దేశ విభజన జరిగిన 1947లో వారు చిన్న పిల్లలు. తల్లిదండ్రులిద్దరు చనిపోయారు. దాంతో, తండ్రి స్నేహితుడైన కరీం భక్ష్ దయతో చేరదీస్తే ఆయన వద్ద ఉంటున్నారు. దేశ విభజన సమయంలో కరీం భక్ష్ పెద్దవాడైన గురుదేవ్ సింగ్ ను తీసుకుని పాకిస్తాన్ వెళ్లిపోయాడు. చిన్నవాడైన దయాసింగ్ ఇక్కడే ఉండిపోయాడు.

Social media reunites Sikh family: పేరు మార్చి..

పాకిస్తాన్ వెళ్లిన తరువాత గురుదేవ్ సింగ్ పేరును గులాం మొహమ్మద్ గా కరీం భక్ష్ మార్చాడు. వారు లాహోర్ కు సుమారు 200 కిమీల దూరంలో పంజాబ్ రాష్ట్రం ఝంగ్ జిల్లాలో స్థిరపడ్డారు. దశాబ్దాలు గడచిపోయాయి. అన్నదమ్ములిద్దరికీ వివాహాలయ్యాయి. కుటుంబాలు ఏర్పడ్డాయి. కరీం భక్ష్ చనిపోయాడు. అయితే, గులాం మొహమ్మద్ గా పేరు మార్చుకున్న గురుదేవ్ సింగ్ మాత్రం తమ్ముడిని మర్చిపోలేదు. తమ్ముడి వివరాలు కావాలంటూ భారత ప్రభుత్వానికి ఎన్నో లేఖలు రాశారు. తమ్ముడి వివరాలను, చిన్నప్పటి తమ జ్ఞాపకాలను తన కుటుంబంతో పంచుకునేవాడు. కొన్నేళ్ల క్రితం గురుదేవ్ సింగ్ కూడా చనిపోయాడు. కానీ, ఆయన కుమారుడు మొహ్మద్ షరీఫ్ మాత్రం తన చిన్నాన్న దయా సింగ్ వివరాల కోసం వెతకడం ఆపేయలేదు. చివరకు, ఆరు నెలల క్రితం సోషల్ మీడియా సాయంతో చిన్నాన్న దయాసింగ్ ఆచూకీ తెలుసుకున్నాడు.

Sikh family reunites at Kartatpur: కర్తార్పూర్ కారిడార్ లో మళ్లీ కలిశారు..

దాంతో, రెండు కుటుంబాలు ఫోన్లలో మాట్లాడుకున్నారు. కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకు వేదికగా పవిత్ర కర్తార్పూర్ ఆలయాన్ని ఎంచుకున్నారు. పాకిస్తాన్ లోకి కర్తార్పూర్ కు హరియాణా నుంచి దయాసింగ్ కుటుంబం వెళ్లింది. అక్కడ రెండు కుటుంబాలు ఆనంద భాష్పాల మధ్య కలుసుకున్నారు. డ్యాన్సులు చేస్తూ, పాటలు పాడుతూ, ఒకరిపై ఒకరు పూలు చల్లుకుంటూ , ఒకరిని ఒకరు హత్తుకుంటూ కలిసిపోయారు. తమ రీయూనియన్ కు కారణమైన సోషల్ మీడియాకు ధన్యవాదాలు చెప్పడం మాత్రం మర్చిపోలేదు. కర్తార్పూర్ కారిడార్ పాకిస్తాన్ లోని పంజాబ్ లో ఉన్న గురుద్వారా దర్బార్ సాహిబ్ ను, భారత్ లోని పంజాబ్ లో ఉన్న డేరా బాబా నానక్ ఆలయాన్ని అనుసంధానపరుస్తుంది. 4 కిమీల ఈ కారిడార్ ద్వారా వీసాలు లేకుండానే సిక్కు భక్తులు రెండు పవిత్ర ఆలయాలను దర్శించుకోవచ్చు.

WhatsApp channel