Agniveer reservations: ‘కార్గిల్ దివస్’ సందర్భంగా అగ్నివీర్ లకు రిజర్వేషన్లు ప్రకటించిన 6 రాష్ట్రాలు
Agniveer reservations: కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ పై విజయం సాధించిన సందర్భంగా ప్రతీ సంవత్సరం జూలై 26న కార్గిల్ దివస్ ను జరుపుకుంటాం. ఈ సంవత్సరం కార్గిల్ దివస్ సందర్భంగా అగ్నివీర్ లుగా త్రివిధ దళాల్లో సేవలు అందించిన వారికి రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు 6 రాష్ట్రాలు ప్రకటించాయి.
Agniveer reservations: కార్గిల్ దివస్ సందర్భంగా అగ్నివీర్ లుగా త్రివిధ దళాల్లో సేవలు అందించిన వారికి రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్ రాష్ట్రాలు ప్రకటించాయి. వివాదాస్పద అగ్నిపథ్ పథకం కింద సైనికులను స్వల్పకాలికంగా చేర్చడంపై ఆగ్రహాన్ని చల్లార్చడానికి, వారిని రెగ్యులర్ సర్వీసులో కొనసాగించకపోతే వారికి రక్షణ కవచం కల్పించే ప్రయత్నంలో భాగంగా రాష్ట్రాలు ఈ రిజర్వేషన్లు కల్పిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని పోలీసు, ఇతర సెక్యూరిటీ సర్వీసుల్లో ఈ రిజర్వేషన్లను ప్రకటించాయి.
అగ్ని వీర్ పథకం
కేంద్రం 2022 జూన్ లో అగ్నిపథ్ (agneepath) పథకాన్ని ప్రారంభించింది. ఇది 17.5 నుండి 21 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులను నాలుగు సంవత్సరాల కాలానికి సాయుధ దళాల్లో నియమించడానికి వీలు కల్పించింది. అయితే, వీరిలో 25% మందిని మాత్రమే సాయుధ దళంలో శాశ్వతంగా కొనసాగిస్తారు. మిగతా, 75% మంది నాలుగేళ్ల తరువాత రిటైర్ కావాల్సి ఉంటుంది. వారికి ఇతర ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో రాష్ట్రాలు తమ పరిధిలోని ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నాయి. కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ పై భారత్ విజయం సాధించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆరు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రకటన చేశాయి.
హర్యానాలో..
ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న హర్యానాలో ప్రభుత్వం జూలై 17న కొన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో అగ్ని వీరులకు 10 శాతం రిజర్వేషన్లు, ఇతర సర్వీసుల అర్హతలో వయోపరిమితి సడలింపును ప్రకటించింది. రాష్ట్రంలో పోలీసు కానిస్టేబుళ్లు, ఫారెస్ట్, జైల్ గార్డులను రిక్రూట్ చేసేటప్పుడు రాష్ట్రానికి చెందిన అగ్నివీరులకు ప్రాధాన్యత ఇస్తామని ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి చెప్పారు. అగ్నివీరులకు నిర్ణీత రిజర్వేషన్ కోటా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మార్గదర్శకాలు జారీ చేస్తుందని, ఈ నియామకాల్లో వారికి ప్రాధాన్యం లభించేలా చూస్తామని చెప్పారు.
మధ్య ప్రదేశ్ లో..
ప్రధాని నరేంద్ర మోదీ కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం అగ్నివీరులకు పోలీసు, భద్రతా దళాల్లో రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించిందని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ చెప్పారు. షార్ట్ సర్వీస్ సైనికులకు రాష్ట్ర పోలీసు శాఖలో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ మాఝీ తెలిపారు. హర్యానా మాదిరిగానే ఒడిశా కూడా ఇతర సర్వీసులకు అర్హతలో వయోపరిమితి సడలింపును ప్రకటించింది. రాష్ట్రంలోని యూనిఫాం బలగాల్లో పది శాతం పోస్టులను అగ్నివీర్లకు రిజర్వు చేస్తామన్నారు.
ఉత్తర ప్రదేశ్ లో..
శాంతిభద్రతలకు విఘాతం తలెత్తిన పరిస్థితుల్లో తరచూ సైన్యాన్ని మోహరించకుండా నిరోధించడానికి 1948 లో ఏర్పాటు చేసిన రాష్ట్ర పోలీసు, ప్రావిన్షియల్ ఆర్మ్డ్ కాన్స్టాబులరీలో అగ్నివీరులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. స్వల్పకాలిక నియామక పథకం కింద చేరిన సైనికులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి హామీ ఇచ్చారు.