Delhi Baby Care Hospital : ఢిల్లీలోని పిల్లల ఆస్పత్రిలో అగ్నిప్రమాదం - ఆరుగురు చిన్నారుల మృతి..!
Fire Accident in Delhi Baby Care Hospital: ఢిల్లీలోని ఓ పిల్లల ఆస్పత్రిలో శనివారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది.
Baby Care hospital Fire Accident in Delhi: ఢిల్లీలోని బేబీ కేర్ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో ఆరుగురు నవజాత శిశువులు(చిన్నారులు) మృతి చెందారు. మరో ఆరుగురు చిన్నారులకు చికిత్స అందిస్తున్నారు.
తూర్పు ఢిల్లీలోని వివేక్ విహార్‌లోని న్యూ బోర్న్ బేబీ కేర్ ఆసుపత్రిలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. గాయపడిన చిన్నారుల్లో ఒకరు వెంటిలేటర్‌పై ఉన్నారు. మరో ఐదుగురికి వైద్య సేవలను అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ (DFS) బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. తొమ్మిది అగ్నిమాపక వాహనాలతో మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. దాదాపు గంటసేపుకుపైగా అగ్నిమాపక దళాలు శ్రమించాయి. ఈ ప్రమాదంలో రెండు భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
భవనం పైఅంతస్తు నుంచి చిన్నారులను రక్షించినట్లు పోలీసులు తెలిపారు. మొదటగా మూడంతస్తులో మంటలు చెలరేగాయని పేర్కొన్నారు. ఆ తర్వాత భవనమంతా మంటల్లో చిక్కుకుందని వెల్లడించారు.
గాయపడిన చిన్నారులను తూర్పు ఢిల్లీ అడ్వాన్స్ ఎన్‌ఐసీయూ ఆస్పత్రికి తరలించారు. వారికి ఇక్కడ వైద్య సేవలు అందుతున్నాయి.
అగ్నిమాపక అధికారి రాజేష్ ANIతో మాట్లాడుతూ, “రాత్రి 11:32 గంటలకు, ఆసుపత్రిలో మంటలు చెలరేగినట్లు ఫైర్ సర్వీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందింది. వెంటనే అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా ఆర్పివేశాయి. అగ్నిప్రమాదంలో 2 భవనాలు కాలిపోయాయి. ఇందులో ఒకటి ఆసుపత్రి భవనం ఉండగా… కుడి వైపున ఉన్న నివాస భవనం కూడా మంటల్లో చిక్కుకుంది. 11-12 మంది చిన్నారులను రక్షించాం" అని తెలిపారు.
రాజ్ కోట్ లో ఘోర అగ్ని ప్రమాదం….
Rajkot Fire Accident : గుజరాత్ రాష్ట్రంలోని రాజ్ కోట్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. టీఆర్పీ గేమ్ జోన్ లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 22 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఉన్నారు.
రాజ్‌కోట్ అగ్నిప్రమాదంపై స్థానిక పోలీస్ కమిషనర్ రాజు భార్గవ మీడియాతో మాట్లాడుతూ... "శనివారం మధ్యాహ్నం టీఆర్పీ గేమింగ్ జోన్‌లో మంటలు చెలరేగాయి. రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. మంటలు అదుపులోకి వచ్చాయి. వీలైనంత త్వరగా మృతదేహాలను వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతానికి 22 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాము. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమ్మిత్తం ఆసుపత్రికి పంపాము. ఈ గేమింగ్ జోన్ యువరాజ్ సింగ్ సోలంకి అనే వ్యక్తికి చెందినది. అతడిపై నిర్లక్ష్యానికి పాల్పడినందుకు కేసు నమోదు చేస్తాం. రెస్క్యూ కార్యకలాపాలను పూర్తి చేసిన తర్వాత తదుపరి విచారణ జరుగుతుంది." అన్నారు.
టాపిక్