Plane Crash : డిసెంబర్‌లో 6 విమాన ప్రమాదాల్లో 234 మంది మృతి.. ఇంతకీ ప్లేన్‌లో ఎక్కడ కూర్చుంటే సేఫ్?
Plane Crash : 2024 డిసెంబర్ విమాన ప్రయాణికులకు 'బ్లాక్ మంత్' అనుకోవచ్చు. ఎందుకుంటే ఈ నెలలో 6 విమాన ప్రమాదాలు జరిగాయి. ఇందులో సుమారు 238 మంది వరకు చనిపోయారు. అయితే సేఫ్టీ గురించి ఆలోచిస్తే విమానంలో ఎక్కడ కూర్చుంటే మంచది?
ఈ నెలలో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 6 విమాన ప్రమాదాలు జరగ్గా 234 మంది మరణించారు. ఈ గణాంకాలు నిజంగా భయపెట్టేవి. విమాన ప్రయాణ సమయంలో భద్రత గురించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతాయి. అయితే విమానంలో ఎక్కడ కూర్చుంటే కాస్త సేఫ్టీగా ఉంటుందనే ప్రశ్న కూడా చాలా మందికి ఉంది. దీని మీద వివిధ గణాంకాలు ఉన్నాయి.
డిసెంబర్ నెలలో దక్షిణ కొరియాలోని మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ సమయంలో జెజు ఎయిర్ బోయింగ్ విమానంలో మంటలు చెలరేగి సుమారు 179 మంది మరణించారు. దేశంలో ఇప్పటివరకు జరిగిన అత్యంత ఘోరమైన విమాన ప్రమాదాల్లో ఇదొకటి అని దక్షిణ కొరియా అధికారులు తెలిపారు. ఈ విమానం బ్యాంకాక్ నుంచి తిరిగి వస్తున్న 15 ఏళ్ల నాటి బోయింగ్ 737-800 జెట్ అని ఆ దేశ రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది.
మరోవైపు కజకిస్తాన్‌లోని అక్టౌ సమీపంలో విమానం క్రాష్-ల్యాండింగ్‌లో 38 మంది ప్రయాణికులు మరణించారు. అజర్ బైజాన్ రాజధాని బాకు నుంచి రష్యా నగరమైన గ్రోంజికి విమానం వెళ్లే సమయంలో ఈ ఘటన జరిగింది. విమానం వేగంగా కిందపడి మంటలు అంటుకోవడానికి సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతుంది.
బ్రెజిల్ దక్షిణ నగరమైన గ్రామడోలో ఓ చిన్న విమానం కూలిన ఘటనలో 10 మంది మృతి చెందారు. 17 మందికి పైగా గాయపడ్డారు. ఉదయం విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే ఈ ప్రమాదం జరిగింది. నార్త్ కోస్ట్ ఏవియేషన్ కు చెందిన బీఎన్ -2బీ-26 విమానం డిసెంబర్ 22న పపువా న్యూ గినియాలో కూలిపోయింది. దీంతో విమానంలో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందారు. అదే సమయంలో అర్జెంటీనాలోని శాన్ ఫెర్నాండో విమానాశ్రయం సమీపంలో బొంబార్డియర్ బిడి-100-1ఎ10 ఛాలెంజర్ 300 కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు.
డిసెంబర్ 17న హవాయిలోని హోనోలులులోని ఇనోయే అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో 208బి గ్రాండ్ కారవాన్ కూలిపోవడంతో ఇద్దరు పైలట్లు మరణించారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం అదుపుతప్పి ఓ భవనాన్ని ఢీకొట్టింది.
ఇలా అనేక ఘటనలు భయపెట్టేవిగా ఉన్నాయి. అయితే విమానంలో ఏ సీటులో కూర్చుంటే సేఫ్టీ ఉంటుందనే విషయంపై కూడా చర్చ నడుస్తోంది. కొన్ని గణాంకాల ప్రకారం ఆ వివరాలు ఏంటో చూద్దాం.. సీటు భద్రత గురించి చర్చించే ముందు, గణాంకాలపరంగా విమాన ప్రయాణం అత్యంత సురక్షితమైన ప్రయాణమని చెప్పాలి. విమాన ప్రమాదాల మరణాల రేటు చూస్తే.. రోడ్డు లేదా రైలు ప్రమాదాల కంటే తక్కువనే ఉన్నాయి.
ఎయిర్ క్రాష్‌లపై సీట్ సేఫ్టీ గురించి సైంటిఫిక్ రిపోర్ట్ లేదు. కానీ క్రాష్ విశ్లేషణలు చూస్తే మాత్రం ఏ ప్రదేశంలో కూర్చున్న వారికి సేఫ్టీ ఉంటుందనేది అర్థమవుతుంది. పాపులర్ మెకానిక్స్.. 1971 నుంచి 2005 మధ్య క్రాష్‌లను పరిశీలించి చేసిన అధ్యయనం ప్రకారం, విమానం వెనుక కూర్చున్న ప్రయాణికులు 40 శాతం బతికే అవకాశం ఉంది. మరణాల రేటు చూసుకుంటే.. వెనక భాగంలో 32 శాతం, మధ్యలో 39 శాతం, ముందు భాగంలో 38 శాతం మరణాల రేటును అధ్యయనం చూపించింది.
విమానం క్రాష్ అయ్యే సమయంలో ముందు సీట్లు ఎక్కువగా దెబ్బతింటాయని ఫలితాలు సూచిస్తున్నాయి. భారతదేశంలో 2010లో జరిగిన మంగళూరు క్రాష్ ఇందుకు ఉదాహరణ. US నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ ఒక అధ్యయనంలో ఉదహరించిన నివేదిక ప్రకారం వెనక సీట్లకు 69 శాతం మనుగడ రేటును సూచించింది. మధ్య సీట్లలో 59 శాతం, ముందు సీట్లలో 49 శాతం చూపించింది.
గమనిక : ఇది వివిధ గణాంకాల ఆధారంగా ఇచ్చిన కథనం మాత్రమే. కంటెంట్‌కు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు.