Karnataka Politics: ఆ ప్రతిపాదనకు ఓకే! కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీగా డీకే శివకుమార్!-siddaramaiah to take oath as karnataka chief minister on may 20 dk sivakumar to be deputy cm ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Karnataka Politics: ఆ ప్రతిపాదనకు ఓకే! కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీగా డీకే శివకుమార్!

Karnataka Politics: ఆ ప్రతిపాదనకు ఓకే! కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీగా డీకే శివకుమార్!

Chatakonda Krishna Prakash HT Telugu
May 18, 2023 07:51 AM IST

Karnataka Politics: కర్ణాటక సీఎం పదవిపై ఏర్పడిన ప్రతిష్టంభన తొలగినట్టే కనిపిస్తోంది. డిప్యూటీ సీఎం పదవికి డీకే శివకుమార్ అంగీకారం తెలిపినట్టు సమాచారం. దీంతో సిద్ధరామయ్య.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు లైన్ క్లియర్ అయింది.

Karnataka Politics: ఆ ప్రతిపాదనకు ఓకే! కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీగా డీకే శివకుమార్! (HT Photo)
Karnataka Politics: ఆ ప్రతిపాదనకు ఓకే! కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీగా డీకే శివకుమార్! (HT Photo)

Karnataka Politics: నాలుగు రోజుల తర్జనభర్జన తర్వాత.. ఎట్టకేలకు కర్ణాటక ముఖ్యమంత్రి(Karnataka Chief Minister)గా ఎవరు ఉండాలనే దానిపై కాంగ్రెస్ అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్టు రిపోర్టులు బయటికి వస్తున్నాయి. గతంలో సీఎంగా పని చేసిన సీనియర్ నేత సిద్ధరామయ్య(Siddaramaiah)నే కర్ణాటక ముఖ్యమంత్రిగా హస్తం పార్టీ అధిష్టానం నిర్ణయించినట్టు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పదవికి డీకే శివకుమార్ (DK Shivakumar) అంగీకరించినట్టు తెలుస్తోంది. బుధవారం రాత్రి కూడా ఈ విషయంపై కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చర్చలు జరపగా.. చివరికి ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలుస్తోంది. బుధవారమే ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్టానం ప్రకటన చేస్తుందని జోరుగా ప్రచారం జరిగినా.. శివకుమార్ పట్టువీడకపోవటంతో అలా జరగలేదు. అయితే, అధిష్టానం పెద్దల చర్చలతో సీఎం సీటు పంపకానికి శివకుమార్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. అంటే తొలి రెండున్నరేళ్లు సిద్ధరామయ్య సీఎంగా ఉంటారు. ఆ తర్వాత శివకుమార్ సీఎం పగ్గాలు చేపడతారు. కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీతో మాట్లాడిన తర్వాతే డీకే శివకుమార్ పట్టువీడినట్టు తెలుస్తోంది. ఈనెల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. ఎట్టకేలకు ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతోంది. పూర్తి వివరాలు ఇవే.

20న ప్రమాణ స్వీకారం!

Karnataka Politics: ఈ నెల 20వ తేదీన కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. బెంగళూరులో ఈ కార్యక్రమం జరగనుంది. అదే రోజున పార్టీ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ జరగనుంది. సిద్ధరామయ్య సీఎం పదవి చేపట్టడం ఇది రెండోసారి కానుంది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇంకా ఢిల్లీలోనే ఉండగా.. వారు బెంగళూరుకు చేరాక నేడే సీఎం పదవిపై ప్రకటన వస్తుందని అంచనాలు ఉన్నాయి.

ఈ ఫార్ములాకు డీకే శివకుమార్ అంగీకారం!

Karnataka Politics: డిప్యూటీ ముఖ్యమంత్రి పదవితో పాటు ఆరు పోర్ట్‌పోలియోలను డీకే శివకుమార్‌కు కాంగ్రెస్ అధిష్టానం ఆఫర్ చేసినట్టు బుధవారం సమాచారం వెల్లడైంది. అయితే ఓ దశలో శివకుమార్ వాటిని అంగీకరించలేదని తెలిసింది. కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీతో సిద్ధరామయ్య, శివకుమార్ చర్చలు జరిపారు. అయినా బుధవారం ప్రతిష్టంభన కొనసాగింది. అయితే బుధవారం రాత్రి కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు ఖర్గే మరోసారి వారిద్దరితో మాట్లాడినట్టు సమాచారం. సీఎం పదవీ కాలం విభజన ఫార్ములాకు డీకే శివకుమార్ కూడా అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది. దీని ప్రకారం, ముందు రెండున్నర సంవత్సరాలు సీఎంగా సిద్ధరామయ్య ఉంటారు, ఆ తర్వాత సీఎంగా పదవిని శివకుమార్ చేపడతారు.

కురుబ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత సిద్ధరామయ్యకు 85 శాతం మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్టు తెలుస్తోంది. 1980ల్లో జనతా పరివార్‌ పార్టీతో సిద్ధరామయ్య తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత జేడీఎస్ నుంచి 2006లో కాంగ్రెస్‍కు వచ్చారు. దేవరాజ్ ఉర్స్ తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పూర్తి పదవీ కాలం (2013-18) కొనసాగిన రెండో వ్యక్తిగా సిద్ధరామయ్య నిలిచారు. ఇప్పుడు మరోసారి సీఎం పీఠాన్ని అధిష్టించేందుకు రెడీ అయ్యారు.

ఈనెల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 224 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 135 సీట్లను కైవసం చేసుకుంది. అధికారం చేపట్టేందుకు కావాల్సిన మెజార్టీ కంటే 23 సీట్లను ఎక్కువగా సాధించింది. 66 స్థానాలను సాధించిన బీజేపీ అధికారాన్ని కోల్పోయింది.

Whats_app_banner