Shri Badrinath Temple Open : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బద్రీనాథ్ ఆలయ తలుపులు భక్తుల దర్శనం కోసం తెరుచుకున్నాయి. ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో శ్రీ బద్రీనాథ్ ఆలయం ఉంది.
ఆర్మీ బ్యాండ్ మేళవింపుల మధ్య ఇవాళ (మే 12) ఉదయం 6 గంటలకు ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. ఆచార వ్యవహారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణలతో పాటు 'బద్రీ విశాల్ లాల్ కీ జై' నినాదాలు ఆలయం నలువైపులా ప్రతిధ్వనించాయి.
శీతాకాలం కారణంగా గత నవంబర్‌లో ఆలయాన్ని మూసివేయగా.. ఆరు నెలల తర్వాత ఈ ఆలయ తలుపులు నేడు తలుపులు తెరుచుకున్నాయి. అలకనంద నది తీరంలో ఈ ఆలయం కొలువుదీరి ఉంది. ఈ ఏడాది నవంబర్ వరకు ఈ ఆలయాన్ని భక్తులు దర్శించుకోవచ్చు.
ఆదివారం ఉదయం బద్రీనాథ్ ధామ్ ప్రవేశానికి వందలాది మంది భక్తులు తరలివచ్చారు. ప్రవేశద్వారం పూలతో అలంకరించబడింది.ఈ దృశ్యాన్ని చూసి భక్తులు పరవశించారు. జై బద్రీ విశాల్ అంటూ నినాదాలు చేశారు. విష్ణువు ఈ ఆలయంలో బద్రీనాథుడిగా కొలువై ఉన్నారు. తిరిగి నవంబర్ 18 నుంచి ఆలయాన్ని మూసివేస్తారు.
బద్రీనాథ్ యాత్ర అనేది హిందూ మతంలో ఒక ముఖ్యమైన తీర్థయాత్ర. ఇది ప్రధానంగా విష్ణువు భక్తులచే నిర్వహించబడుతుంది. బద్రీనాథ్ భారతదేశంలోని ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ఉన్న ఒక పవిత్ర పట్టణం. ఇది సముద్ర మట్టానికి 3,133 మీటర్లు (10,279 అడుగులు) ఎత్తులో గర్హ్వాల్ హిమాలయాలలో ఉంది.
చార్ ధామ్ తీర్థయాత్ర సాధారణంగా ఏప్రిల్ చివరిలో లేదా మే ప్రారంభంలో ప్రారంభమవుతుంది. నవంబర్ వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత శీతాకాలం ప్రారంభం అవ్వటంతో ఆలయ దర్శనం ఉండదు.
మే 10న ఉత్తరాఖండ్‌లో చార్ ధామ్ యాత్ర ప్రారంభమైంది. గత రెండు రోజులుగా కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రి సహా మూడు ధామ్‌లు సందడిగా మారాయి.
భారతదేశం మరియు ఇతర దేశాల నుండి రికార్డు స్థాయిలో 29 వేల మంది యాత్రికులు మొదటి రోజు కేదార్‌నాథ్ ధామ్‌ను సందర్శించారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి… తీర్థయాత్ర మొదటి రోజున కేదార్‌నాథ్ ధామ్‌లో ప్రారంభ పూజ నిర్వహించారు.
వాతావరణ పరిస్థితుల కారణంగా చార్‌ధామ్ క్షేత్రాలైన గంగోత్రి, కేదార్‍నాథ్, యమునోత్రి, బద్రీనాథ్ ఆలయాలు.. ప్రతీ ఏడాది అక్టోబర్ - నవంబర్ మధ్య మూతపడతాయి. మళ్లీ ఏప్రిల్ - మే నెలల మధ్య భక్తుల దర్శనం కోసం తెరుచుకుంటాయి.
ప్రతీ ఏడాది సుమారు ఆరు నెలలు పాటు భక్తులు ఈ ఆలయాలను దర్శించుకునే అవకాశం ఉంటుంది. ఈ నాలుగు ఆలయాలను దర్శించుకునే చార్‌ధామ్ యాత్రను అత్యంత పుణ్యకార్యంగా భక్తులు నమ్ముతారు. ప్రతీ ఏడాది భారీ సంఖ్యలో భక్తులు చార్‌ధామ్ యాత్ర చేస్తారు.