స్కూల్‌లో గుడ్ టచ్-బ్యాడ్ టచ్ సెషన్‌లో తనపై జరిగిన అత్యాచారాన్ని చెప్పిన 10 ఏళ్ల బాలిక
Good Touch-Bad Touch : స్కూల్లో గుడ్ టచ్-బ్యాడ్ టచ్ గురించి సెషన్ జరుగుతున్న సమయంలో ఓ బాలిక చెప్పిన విషయాలు అందరినీ షాక్‌కు గురిచేశాయి. 10 ఏళ్ల బాలిక తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని వెల్లడించింది. దీంతో వెంటనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
పుణెలోని ఓ పాఠశాలలో గుడ్ టచ్-బ్యాడ్ టచ్ మీద సెషన్ జరుగుతుంది. ఈ సమయంలో ఓ బాలిక తనపై జరిగిన అత్యాచారం గురించి చెప్పింది. పదేళ్ల బాలిక చెబుతున్న మాటలు విని అందరూ షాక్ అయ్యారు. పాఠశాలలో 'గుడ్ టచ్-బ్యాడ్ టచ్' సెషన్ సందర్భంగా.. బాలిక తనపై 67 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడని వెల్లడించింది. తాను పాఠశాలకు వచ్చే దారిలోనే ఆ వ్యక్తి ఇల్లు కూడా ఉందని తెలిపింది. పిల్లలకు అవగాహన కల్పించేందుకు పాఠశాలలో గుడ్ టచ్-బ్యాడ్ టచ్ పై ఈ సెషన్ నిర్వహించారు.
ఈ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే పాఠశాల యాజమాన్యం బాలిక తల్లిదండ్రులను సంప్రదించింది. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆ వ్యక్తిని రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదైంది. పుణె నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాలికకు కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
చాక్లెట్ ఇచ్చి
ఆగస్టు 23న ఉదయం 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో బాలిక పాఠశాలకు వెళ్తోంది. ఘటనకు కొద్ది రోజుల ముందు బాలికకు వృద్ధుడు చాక్లెట్ ఇచ్చినట్లు విచారణలో తేలింది. ఘటన జరిగిన రోజు బాలిక పాఠశాలకు వెళ్తుండగా అతడు ఆమెను పిలిచి ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
నిందితుడు అరెస్టు
తర్వాత పాఠశాలలో 'గుడ్ టచ్-బ్యాడ్ టచ్' అనే అంశంపై సెషన్ జరిగింది. ఇంతలో జరిగిన సంఘటన గురించి బాలిక సెషన్‌లో చెప్పింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. నాలుగు రోజుల పాటు పోలీసు కస్టడీలో ఉంచారు. ఆ వ్యక్తి నిరుద్యోగి అని, ఒంటరిగా నివసిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు జరుగుతోంది.
ఇటీవల ఎన్నో ఘటనలు
కోల్ కతాలోని ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీలో డాక్టర్‌పై అత్యాచారం, హత్య తర్వాత దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మహారాష్ట్ర బద్లాపూర్ పాఠశాలలో ఇద్దరు బాలికలపై జరిగిన లైంగిక వేధింపుల ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అదే సమయంలో అసోంలోని నాగావ్ లో ట్యూషన్ నుంచి తిరిగొచ్చిన బాలికపై సామూహిక అత్యాచారం కేసు కూడా వెలుగులోకి వచ్చింది.
నర్సింగ్ విద్యార్థినిపై
మరోవైపు తాజాగా మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో 19 ఏళ్ల నర్సింగ్ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. సోమవారం మహిళ ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. రత్నగిరిలో విద్యార్థిని నర్సింగ్ చదువుతోంది. ఆటో డ్రైవర్ తనకు తాగే నీటిలో మత్తుమందు కలిపి ఇచ్చాడని, తనపై అత్యాచారం చేశాడని చెప్పింది. ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.